రెడ్ బుక్ తెరవక ముందే.. జగన్ ఢిల్లీ వెళ్లి గగ్గోలు పెడుతున్నాడు: నారా లోకేశ్ సెటైర్లు

జగన్ అసెంబ్లీకి వస్తే గౌరవంగా చూసుకుని వాస్తవాలు అర్ధమయ్యేలా వివరిస్తామన్నారు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్.

Minister Nara Lokesh sataires on YS Jagan Pressmeet

Nara Lokesh on YS Jagan Pressmeet: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంపై ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సెటైర్లు వేశారు. శుక్రవారం అసెంబ్లీ లాబీలో మీడియా ప్రతినిధులతో ఆయన చిట్ చాట్ చేశారు. గత 5 ఏళ్ల కాలంలో జగన్ 2 ప్రెస్‌మీట్‌లు పెడితే.. 11 సీట్లు వచ్చాక నెల రోజుల వ్యవధిలో ప్రెస్‌మీట్‌లు పెట్టారని తెలిపారు. జగన్ చెప్పే అసత్యాలేవో అసెంబ్లీకి వచ్చి చెప్తే, వాస్తవాలు మేం వివరిస్తాం కదా అని అన్నారు. జగన్ అసెంబ్లీకి వస్తే గౌరవంగా చూసుకుని వాస్తవాలు అర్ధమయ్యేలా వివరిస్తామన్నారు. వైకాపా నేతల్లా కూటమి నేతలెవ్వరూ బూతులు తిట్టరు, జగన్ కుటుంబ సభ్యుల్ని అగౌరవపరచరని లోకేశ్ హామీయిచ్చారు.

”నా దగ్గర రెడ్ బుక్ ఉందని నేనే దాదాపు 90 బహిరంగ సభల్లో చెప్పా. తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్‌లో చేర్చి చట్టప్రకారం శిక్షిస్తామని చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా. ఇంకా రెడ్ బుక్ తెరవక ముందే జగన్ ఢిల్లీ దాకా వెళ్లి గగ్గోలు పెడుతున్నాడు. పీవీ నరసింహారావుకు భారతరత్నపై స్పందించమని జాతీయ మీడియా కోరితే విజయసాయి పేరు చెప్పి వెళ్ళిపోయాడు. రెడ్ బుక్‌కు మాత్రం జాతీయ మీడియా వెంటపడి బతిమాలి పిలిపించి మరీ ప్రచారం కల్పించాడ”ని లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా, జగన్ తన మీడియా సమావేశంలో లోకేశ్ రెడ్ బుక్‌పై విమర్శలు చేశారు. రెడ్ బుక్ పేరుతో రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో నారా లోకేశ్ స్పందించారు.

Also Read : రెడ్ బుక్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా లోకేశ్ హోర్డింగ్స్.. ప్రజలకు ఏం మేసేజ్ పంపుతున్నారు?

నారా లోకేశ్‌కు వినతులు వెల్లువ
అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు కావటంతో నారా లోకేశ్‌కు వినతులు వెల్లువ వచ్చాయి. పలువురు నామినేటెడ్ పదవుల ఆశావహులు.. ఆయనను కలిసి తమ బయోడేటాలు అందచేశారు. పార్టీ కోసం కష్టపడిన వారి సేవల్ని గుర్తుపెట్టుకుని అందరికీ న్యాయం చేస్తానని వారికి లోకేశ్‌ హామీయిచ్చారు. కాగా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.

Also Read : షర్మిలతో రాజీపడతారా, బీజేపీ పెద్దలను ఎదిరిస్తారా.. వైఎస్ జగన్ దారెటు?

లోకేశ్‌ను కలిసిన వైసీపీ ఎమ్మెల్సీ
వైకాపా ఎమ్మెల్సీ, మండలి డిప్యూటీ చైర్ పర్సన్ జాకియ ఖానమ్ శాసనమండలి లాబీలో మంత్రి నారా లోకేశ్‌ను కలవడం చర్చనీయాంశంగా మారింది. కుటుంబ సభ్యులతో పాటు లోకేశ్‌ను కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చారు. జగన్ సహా వైకాపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చట్టసభల్ని బాహిష్కరించినా జాకియ ఖానమ్ మాత్రం శాసనమండలికి హాజరవుతున్నారు. ఇప్పటికే మంత్రి ఫరూఖ్ తోనూ ఆమె భేటీ అయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆమె త్వరలో టీడీపీలో చేరుతున్నారని పార్టీ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది.

ట్రెండింగ్ వార్తలు