భారీ వర్షం,ఉరుములతో దెబ్బతిన్న తాజ్ మహల్

ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో శుక్రవారం రాత్రి భారీ వ‌ర్షం కురిసింది. ఉరుములు, మెరుపుల‌తో విజృంభించిన వ‌ర్షం ధాటికి ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మ‌హ‌ల్ పాక్షికంగా దెబ్బతింది. తాజ్ మహల్…ద్వారం విరిగిపోయింది. పాలరాయి రెయిలింగ్, 2 ఎరుపు సున్నపురాయి పలకలు దెబ్బతిన్నాయి. అంతేకాదు…టిక్కెట్స్‌ కౌంటర్‌తో పాటు , పశ్చిమ ఎంట్రీ గేటు దగ్గర పైవోట్ రాయి కూడా దెబ్బతిన్నాయి.

తాజ్ ప్రాంగణంలోని చాలా చెట్లు వేళ్లతో సహా నేలకూలాయి. ఈ బాధాకరమైన విషయాన్ని భారత పురావస్తు శాఖ అధికారి, ఆర్కియాలజిస్ట్ వసంత్ స్వర్ణకార్ తెలిపారు. స‌మాధి పైకప్పు కూడా చెల్లాచెదురైంద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. కొన్నేళ్లుగా తాజ్ మహల్ తరచూ ఇలాంటి వర్షాలు, ఈదురు గాలులకు దెబ్బతింటూనే ఉంది. ఈసారి కాస్త పెద్ద దెబ్బే తగిలింది అనుకోవచ్చు. 2018 ఏప్రిల్‌ లో కురిసిన వ‌డ‌గ‌ళ్ల వాన వ‌ల్ల తాజ్ మ‌హ‌ల్ ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న పిల్ల‌ర్ దెబ్బతిన్న విష‌యం తెలిసిందే.

మ‌రోవైపు రాష్ట్ర‌వ్యాప్తంగా పిడుగుపాటుకు మృతి చెందిన 13 మంది కుటుంబాలకు ఉత్త‌ర ప్ర‌దేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. యూపీలో రానున్న రోజుల్లోనూ ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. దీంతో తాజ్‌కి మరి కొన్ని రోజులు నష్టాలు తప్పవని అనిపిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు