హేమంత్ కర్కరేను చంపింది ఉగ్రవాదులు కాదు, పోలీసులే కాంగ్రెస్: కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

ముంబై 26/11 దాడుల సమయంలో పోలీసు అధికారి హేమంత్ కర్కరేను చంపింది ఉగ్రవాదులు కాదని, పోలీసులే చంపారని మహారాష్ట్ర కాంగ్రెస్ నేత విజయ్ వాడెట్టివార్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

Congress Leader Vijay Wadettiwar: మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు విజయ్ వాడెట్టివార్ వివాదస్పద వ్యాఖ్యలతో కలకలం రేపారు. ముంబై 26/11 దాడుల సమయంలో పోలీసు అధికారి హేమంత్ కర్కరేను చంపింది ఉగ్రవాదులు కాదని, పోలీసులే చంపారని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. హేమంత్ కర్కరేను ఉగ్రవాది అజ్మల్ కసబ్ చంపలేదని, ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన పోలీసు చంపాడని.. ఈ విషయాన్ని లాయర్ ఉజ్వల్ నికమ్ దాచిపెట్టారని అన్నారు.

ఉజ్వల్ నికమ్ 26/11 కేసులో ప్రభుత్వ న్యాయవాదిగా వ్యవహరించారు. తాజా లోక్‌స‌భ‌ ఎన్నికల్లో ముంబై నార్త్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. “26/11 దాడుల సమయంలో హేమంత్ కర్కరేను కసబ్ కాల్చిచంపలేదు. ఆర్‌ఎస్‌ఎస్ సూచనల మేరకే ఓ పోలీసు అధికారి అతడిని కాల్చిచంపాడు. అప్పటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్‌కి ఈ విషయం తెలుసు. ఇప్పటికీ వాస్తవాన్ని దాచిపెట్టారు” అని విజయ్ వాడేట్టివార్ ఆరోపించారు.

ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారడంతో నష్టనివారణ చర్యలు చేపట్టారు. తాను వెల్లడించిన విషయాలు రిటైర్డ్ పోలీసు అధికారి SM ముష్రిఫ్ రాసిన హూ కిల్డ్ కర్కరే అనే పుస్తకంలో రాశారని చెప్పారు. ప్రస్తుత రాజకీయాల్లో నైతికత అనేదే లేదని.. అధికారం కోసం రాజకీయాలు చేసే వ్యక్తులు దేశాన్ని అమ్మడానికి కూడా వెనుకాడబోరని వ్యాఖ్యానించారు. ముంబే ఏటీఎస్‌ చీఫ్‌గా పనిచేసిన హేమంత్ కర్కరే 2008 ఉగ్ర దాడుల సమయంలో హతమయ్యాడు. మరణానంతరం 2009లో ఆయనకు అశోకచక్ర పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

షాకింగ్, నమ్మశక్యం కాదు..
కాగా, విజయ్ వాడెట్టివార్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. “షాకింగ్, నమ్మశక్యం కాదు.. కాంగ్రెస్ మరియు రాహుల్ గాంధీ కోసం పాకిస్తాన్ ప్రార్థించడంలో ఆశ్చర్యం లేదు. కాంగ్రెస్ మళ్లీ ఓటుబ్యాంక్ రాజనీతిని రాష్ట్రనీతి పైన ఉంచుతోంది. బాట్లా, అఫ్జల్, యాకూబ్, నక్సల్స్ కోసం ఏడ్చి.. షహీద్ అని లేబుల్ చేసి ఇప్పుడు ఉజ్వల్ నికమ్ వంటి దేశభక్తులను అనుమానిస్తున్నారు. క్లీన్ చిట్ పాక్!” బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా అన్నారు. హేమంత్ కర్కరే మరణంపై అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ నాగ్‌పూర్ బీజేపీ లీగల్ సెల్ ఫిర్యాదు చేసింది.

Also Read: ఎంపీ టికెట్ వద్దని వాపస్ ఇచ్చేసిన కాంగ్రెస్ మహిళా నేత.. ఎందుకో తెలుసా?

ఏక్‌నాథ్ షిండే, ఫడ్నవీస్ ఖండన
విజయ్ వాడెట్టివార్ వ్యాఖ్యలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఖండించారు. దేశభక్తుడైన ఉజ్వల్ నికమ్‌తో బీజేపీ చేతులు కలపగా, కసబ్‌తో కాంగ్రెస్ ఉందని ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు. విజయ్ వాడెట్టివార్ చాలా అవమానకరంగా మాట్లాడారని ఇటీవల ఏక్‌నాథ్ షిండే శివసేన పార్టీలో చేరిన కాంగ్రెస్ మాజీ ఎంపీ మిలింద్ దేవరా విమర్శించారు. 26/11 దాడుల సమయంలో తాను సౌత్ ముంబై ఎంపీగా ఉన్నానని, అప్పటి బాధలను ప్రత్యక్షంగా చూశానని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు