రిజర్వేషన్లు కాపాడుకోవాలంటే కాంగ్రెస్ గెలవాలి, రాహుల్ ప్రధాని కావాలి- సీఎం రేవంత్

రాష్ట్రంలో పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. ఎవరూ ఈ ప్రభుత్వాన్ని ఇంచు కూడా కదపలేరు. పదేళ్లు ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది. ప్రజా పాలన ఉంటుంది.

Cm Revanth Reddy : ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు సీఎం రేవంత్ రెడ్డి. ఓవైపు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తూనే.. మరోవైపు ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు. తూటాల్లాంటి మాటలతో చెలరేగిపోతున్నారు. బీఆర్ఎస్, బీజేపీ వైఖరిని ఎండగడుతూ ముందుకు సాగుతున్నారు. వారికి ఎందుకు ఓటు వేయాలి? అని ప్రశ్నిస్తూ.. వారిని చిత్తుగా ఓడించాలి అంటూ పిలుపునిస్తున్నారు సీఎం రేవంత్. జగిత్యాల జిల్లా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ధర్మపురి జన జాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు.

”పత్తిపాడు రిజర్వాయర్ మంజూరు చేసి మీ కష్టాలు తీర్చాలని మా నేతలు కోరారు. రామగుండంలో 2వేల మెగావాట్ల పవర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. నేతకాని సోదరులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. మీరు అడిగినవన్నీ మంజూరు చేస్తా. కానీ 2లక్షలకు పైగా మెజార్టీతో గడ్డం వంశీని గెలిపించండి. పెద్దపల్లి పార్లమెంట్ కు గొప్ప చరిత్ర ఉంది. ప్రధానిగా దేశాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించిన పీవీ నరసింహారావు ఈ ప్రాంతానికి చెందిన వారే. 1990లో సింగరేణి దివాళా తీస్తే.. కాపాడిన ఘనత దివంగత నేత కాకా ది. స్పీకర్ పదవికి వన్నె తెచ్చిన శ్రీపాదరావు ఇక్కడి మంథని ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించారు.

కొప్పుల ఈశ్వర్ ను అసెంబ్లీ ఎన్నికల్లో బండకేసి కొట్టి కాంగ్రెస్ ను గెలిపించారు. ఏ దిక్కు లేని బీఆర్ఎస్ కొప్పుల ఈశ్వర్ ను అభ్యర్థిగా నిలబెట్టింది. ఈ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ కు, ఈశ్వర్ కు లేదు. బొగ్గు గనులను ప్రైవేట్ పరం చేస్తుంటే మౌనంగా ఉన్న ఈశ్వర్.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వస్తారు? ఈ ఎన్నికలతో కాలనాగు బీఆర్ఎస్ పీడ పూర్తిగా విరగడ కావాలి.

పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఇచ్చిందేమీ లేదు. ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీని తరలించుకుపోయారు. తెలంగాణకు ఏమీ ఇవ్వని ప్రధాని.. గుజరాత్ కు లక్షల కోట్లు తరలించుకుపోయారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తోంది. అందుకే 400 సీట్లు కావాలని బీజేపీ కోరుతోంది. దళిత, గిరిజన, ఓబీసీల హక్కులను కాలరాయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. 2021లో జనగణన, కులగణన జరగాల్సిన అవసరం ఉన్నా.. బీజేపీ ఆ పని చేయలేదు. ఈ వేదికగా బండి సంజయ్.. కిషన్ రెడ్డిని అడుగుతున్నా. 2021లో జనగణన, కులగణన ఎందుకు చేపట్టలేదు? దీని వెనుక రిజర్వేషన్లు రద్దు చేయాలన్న కుట్ర లేదా? సమాధానం చెప్పాలి. రిజర్వేషన్లు కాపాడుకోవాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. రాహుల్ గాంధీ ప్రధాని కావాలి.

రిజర్వేషన్లు పెరగాలంటే కాంగ్రెస్ కు ఓటు వేయండి. రాష్ట్రంలో పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. ఎవరూ ఈ ప్రభుత్వాన్ని ఇంచు కూడా కదపలేరు. పదేళ్లు ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది. ప్రజా పాలన ఉంటుంది. బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగితే.. బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు. ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అడిగితే.. బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు.. తెలంగాణకు బీజేపీ ఇచ్చింది.. మోదీ తెచ్చింది గాడిద గుడ్డు.. పెద్దపల్లి పార్లమెంట్ లో వంశీని 2లక్షల మెజారిటీతో గెలిపించండి” అని విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి.

Also Read : రౌస్ అవెన్యూ కోర్టుకు ఎమ్మెల్సీ కవిత కీలక విన్నపం.. ఏమని కోరారంటే..

ట్రెండింగ్ వార్తలు