BRS Party : హస్తంవైపు వారి చూపు.. మండలిలో త్వరలో బీఆర్ఎస్ ఖాళీ కాబోతుందా?

గులాబీ పార్టీకి మరో టెన్షన్ మొదలైంది. మెజార్టీ ఎమ్మెల్సీలు హస్తం పార్టీలో చేరుతారన్న ప్రచారంతో బీఆర్ఎస్ పార్టీలో గుబులు మొదలైంది.

BRS Party MLCs : త్వరలో మండలిలో బీఆర్ఎస్ ఖాళీ కాబోతుందా..? కారు పార్టీ సభ్యులు హస్తంవైపు చూస్తున్నారా? గులాబీ పార్టీలో ఉండే ఎమ్మెల్సీలు ఎవరు? పోయేదెవరు? ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఈ అంశాలపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇప్పటికే అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ.. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటుకూడా గెలుచుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీలు పార్టీమారుతున్నారన్న ప్రచారంతో గులాబీ పార్టీకి మరో టెన్షన్ మొదలైంది. మెజార్టీ ఎమ్మెల్సీలు హస్తం పార్టీలో చేరుతారన్న ప్రచారంతో బీఆర్ఎస్ పార్టీలో గుబులు మొదలైంది. గతంలో కాంగ్రెస్, టీడీపీ నుంచి కారెక్కిన వారంతా ఇప్పుడు హస్తం పార్టీ వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. ఓ ఎమ్మెల్సీ ద్వారా కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Also Read : RK Roja : ఎందుకు సిగ్గుపడాలి? మంచి చేసి ఓడిపోయాం.. : ఆర్కే రోజా సంచలన ట్వీట్!

బీఆర్ఎస్ పార్టీకి శాసనమండలి గండం వెంటాడుతోంది. ఈ బడ్జెట్ సమావేశాల్లోపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గూటికి చేరుతారన్న ప్రచారం జోరుగా జరుగుతుంది. రాష్ట్రంలో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీకి శాసన మండలిలో సభ్యుల బలం లేదు. అధికారికంగా నలుగురు సభ్యులు మాత్రమే శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం శాసనసభలో బిల్లులకు ఆమోదం తెలిపినా.. శాసన మండలిలో మెజార్టీ ఉన్న బీఆర్ఎస్ సభ్యులు ఆమోదం తెలిపే అవకాశం ఉండదు. అందుకే గులాబీ పార్టీ ఎమ్మెల్సీలను చేర్చుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు చర్చజరుగుతుంది. ఇప్పటికే కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలతో కాంగ్రెస్ నేతలు చర్చలు జరిపారని సమాచారం.

Also Read : ధరణి సమస్యలకు త్వరలోనే పరిష్కారం.. నవీన్ మిట్టల్ కీలక ఆదేశాలు

రెండుమూడు నెలల క్రితమే వరంగల్ జిల్లాకు చెందిన బసవరాజు సారయ్య హస్తం పార్టీలో చేరేందుకు రెడీ అయ్యారని చర్చ జరిగింది. అదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పదవీకాలం ముగుస్తుండటంతో ఆమె కాంగ్రెస్ పార్టీవైపు మొగ్గుచూపే అవకాశాలు ఉన్నాయని గులాబీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది. ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ కు రాజకీయంగా మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అండదండలు ఉండటంతో ఆమె చేరిక లాంఛనమే కావొచ్చన్న వాదనకూడా వినిపిస్తోంది. మండలి చైర్మన్ గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లో చేరారు. గులాబీ పార్టీలో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసేందుకు అవకాశం దక్కకపోవడం, ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో సమన్వయం లేకపోవటంతో గుత్తా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగడం దాదాపు అసాధ్యమన్న ప్రచారం ఉంది.

ఎమ్మెల్సీలుగాఉన్నపట్నం మహేందర్ రెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. కానీ, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి దీనిపై నిర్ణయాన్ని పెండింగ్ లో ఉంచుతూ వస్తున్నారు. ఇలాంటి పరిణామాలన్నింటిని బేరీజు వేసుకుంటున్న హస్తం పార్టీ శాసన మండలిలో బీఆర్ఎస్ కు షాకిచ్చే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మండలి సభ్యులపై అనర్హత వేటు పడకుండా ఒకేసారి బీఆర్ఎస్ శాసనసభ మండలి సభా పక్షాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకునే దిశగా పావులు కదుపుతున్నట్లు టాక్. మెజార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను హస్తం పార్టీలో చేరేందుకు సమన్వయం చేసే బాధ్యతలు ఓ ఎమ్మెల్సీకి అప్పగించినట్లు తెలుస్తోంది. మరికొద్దిరోజుల్లోనే మండలి సభ్యుల వలసలపై స్పష్టం వచ్చే అవకాశం కనిపిస్తుంది.

 

 

ట్రెండింగ్ వార్తలు