లోకేశ్ రెడ్ బుక్ హడల్.. ఏం జరుగుతోందో తెలుసా?

Nara Lokesh Red Book: లోకేశ్‌ రెడ్‌ బుక్‌లో ఎవరి పేర్లు ఉన్నాయి? యాక్షన్‌ ఎలా ఉంటుంది?

గత ప్రభుత్వంలో ఐపీసీ చట్టం స్థానంలో వైసీపీ చట్టాన్ని అమలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు మంత్రి నారా లోకేశ్‌ రెడ్‌ బుక్‌ నిద్ర పట్టనీయడంలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం గతానికి భిన్నంగా… అడ్డగోలుగా వ్యవహరించిన అధికారుల ముఖం మీదే డోర్స్‌ క్లోజ్‌ చేస్తుండటంతో తమ భవిష్యత్‌ ఎలావుంటుందోనని టెన్షన్‌ పడుతున్నారు.

లోకేశ్‌ రెడ్‌ బుక్‌లో ఎవరి పేర్లు ఉన్నాయి? యాక్షన్‌ ఎలా ఉంటుంది? అన్న ఆందోళనే ఎక్కువ మందిలో కనిపిస్తోంది… పగ, ప్రతీకారాలకు తావులేని పాలన అందిస్తామని చెబుతున్న ప్రభుత్వం… తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందేనని వార్నింగ్‌లిస్తుండటంతో కొందరు అధికారులు కంటిమీద కునుకులేకుండా గడపుతున్నారట…

లోకేశ్‌ రెడ్‌ బుక్‌… అంటేనే అధికారులు ఉలిక్కిపడుతున్నారు. ముఖ్యంగా పోలీసుశాఖలో మంత్రి లోకేశ్‌ రెడ్‌ బుక్‌ వ్యవహారం కలకలం రేపుతోంది. రెడ్‌బుక్‌లో ఎవరి పేర్లు ఉన్నాయి? ఎలాంటి చర్యలు తీసుకుంటారనే చర్చే ఎక్కువగా వినిపిస్తోంది. గత ప్రభుత్వంలో ఏకపక్షంగా వ్యవహరించిన అధికారులు, అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారు, తప్పుడు కేసులు పెట్టారని కొందరు పోలీసులపై టీడీపీ ఆరోపణలు చేస్తోంది. ఇలా అడ్డగోలుగా వ్యవహరించిన వారిపేర్లను రెడ్‌బుక్‌లో నమోదు చేసినట్లు తన పాదయాత్రలో చెప్పేవారు మంత్రి లోకేశ్‌.

అప్పట్లో లైట్‌గా తీసుకున్న అధికారులు..
మంత్రి లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్రలో రెడ్‌బుక్‌లో పేర్లు నమోదు చేయడం ప్రారంభమైంది. రాష్ట్రంలో గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తూ.. ప్రతిపక్షాలను వేధించిన అధికారుల పేర్లు రెడ్‌బుక్‌లో రాసినట్లు గతంలో ప్రకటించారు మంత్రి లోకేశ్‌. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్‌బుక్‌లో పేర్లు ఉన్న ప్రతి అధికారిని శిక్షిస్తామని హెచ్చరికలు జారీచేశారు. అప్పట్లో ఈ ఇష్యూని డ తీసుకున్న అధికారులు… ఇప్పుడు కూటమి చేతుల్లోకి అధికారం వచ్చాక ఒకటే టెన్షన్‌ పడుతున్నారు. రెడ్‌బుక్‌లో పేర్లు ఉన్నవారిపై ఎలాంటి చర్యలు ఉంటాయని తెలిసిన వారి వద్ద ఆరా తీస్తున్నారు.

ముఖ్యంగా మంత్రి లోకేశ్‌ రెడ్‌బుక్‌లో ఎక్కువ మంది పోలీసుల పేర్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పోలీసు శాఖలోని ఎస్‌ఐ నుంచి ఎస్పీ స్థాయి వరకు పనిచేసిన వారిలో కొందరు గత ప్రభుత్వంపై మితిమీరి స్వామి భక్తి ప్రదర్శించారని, ప్రతిపక్ష కార్యకర్తలు, నాయకులను ముప్పతిప్పలు పెట్టారని ఆరోపణలు ఉన్నాయి.

రాయలసీమలోని చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పనిచేసిన పోలీసు అధికారుల సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలపై దాడులు జరిగాయని…. ఆ సందర్భంలో దాడులను అడ్డుకోకపోవడమే కాకుండా… తిరిగి బాధితులపైనే కేసులు నమోదు చేసేవారని ఆరోపిస్తోంది టీడీపీ. ఇక మంత్రి లోకేశ్‌ యువగళం పాదయాత్రకు అడుగడుగునా అవాంతరాలు సృష్టించేవారు…. ఇలాంటి వారిపై అప్పట్లోనే తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు లోకేశ్‌.

అధికారుల పని పట్టాలని డిమాండ్
మరోవైపు లోకేశ్‌ రెడ్‌బుక్‌లో ఉన్న అధికారుల పని పట్టాలని టీడీపీలోని బాధిత కార్యకర్తల డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి.. తప్పు చేసిన వారిని…. కట్టు తప్పిన వారిని శిక్షించకుండా వదిలేస్తే… అది వారికి అలవాటుగా మారిపోయే అవకాశం ఉందంటున్నారు. సీఎం చంద్రబాబు సైతం కూటమి పక్ష సమావేశంలో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని గుర్తుచేస్తున్నారు. దీంతో రెడ్‌బుక్‌లో పేర్లు ఉన్నాయని అనుమానం ఉన్న అధికారుల్లో భయం కనిపిస్తోంది.

Also Read: చంద్రబాబు శ్వేతాస్త్రం.. గత వైసీపీ ప్రభుత్వ అప్పుల లెక్కలపై..

మంత్రి లోకేశ్‌ను ప్రసన్నం చేసుకుని… అప్పటి పరిస్థితులను వివరించే ప్రయత్నం చేయాలని కొందరు భావిస్తుండగా, అలాంటివారికి కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వకూడదని భావిస్తున్నారు మంత్రి లోకేశ్‌. ఈ విషయంలో చంద్రబాబు అనుసరించిన విధానాన్ని ఫాలో అవుతున్నారు. గత ప్రభుత్వంలో నిబంధనలను పాటించని ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను కలిసేందుకు అవకాశం ఇవ్వని చంద్రబాబు… వారిపై భవిష్యత్‌లో చర్యలు ఉంటాయనే హెచ్చరికలు పంపారు. ఇప్పుడు లోకేశ్‌ కూడా అదేదారిన నడుస్తున్నారు. రెడ్‌బుక్‌లో ఉన్న పేర్లపై యాక్షన్‌కు రంగం సిద్ధం చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు