చంద్రబాబు శ్వేతాస్త్రం.. గత వైసీపీ ప్రభుత్వ అప్పుల లెక్కలపై..

Chandrababu Naidu: రాష్ట్ర వాస్తవ ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించేందుకు ఈ అంశాలతో నాలుగు శ్వేతపత్రాలను విడుదల చేయాలని

చంద్రబాబు శ్వేతాస్త్రం.. గత వైసీపీ ప్రభుత్వ అప్పుల లెక్కలపై..

Chandrababu Naidu

రాష్ట్ర వాస్తవ ఆర్థిక చిత్రాన్ని ప్రజలు ముందు ఉంచాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇందుకోసం రాష్ట్ర ఆదాయం… గత ఐదేళ్లలో చేసిన అప్పులు, చెల్లించాల్సిన బిల్లులు వంటి వివరాలతో నాలుగు శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బతిన్నదని.. ఒకరిద్దరు అధికారులు అడ్డగోలుగా వ్యవహరించారని ఎన్నికల సమయంలో ఆరోపించింది టీడీపీ కూటమి.

ఇప్పుడు అధికారం చేపట్టడంతో వాస్తవాలను వివరించే పనిని కొందరు అధికారులకు అప్పగించింది. ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ పర్యవేక్షణలో శ్వేతపత్రాల రూపకల్పనకు కసరత్తు మొదలైంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మొత్తం అప్పులు ఎన్ని? ఎక్కడి నుంచి ఎంత రుణం తెచ్చారు? దేనికి ఖర్చు చేశారు..? కార్పొరేషన్ల పేరిట వాడిన డబ్బు ఏమైంది? వంటి అంశాలపై చంద్రబాబు ప్రభుత్వం ఆరా తీస్తోంది.

నాలుగు శ్వేతపత్రాలు
రాష్ట్ర వాస్తవ ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించేందుకు ఈ అంశాలతో నాలుగు శ్వేతపత్రాలను విడుదల చేయాలని నిర్ణయించింది. ఇందుకు అవసరమైన కసరత్తు ప్రారంభించాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ ఆదేశించారు. గత ఐదేళ్లలో ఆర్థికశాఖలో చోటుచేసుకున్న అనేక అవకతవకల్ని వెలికితీయాలని ఆర్థిక శాఖ అధికారులకు ప్రభుత్వం సూచించింది.

గత ఐదేళ్లలో రాష్ట్రం మొత్తం అప్పు 11 లక్షల కోట్లకు చేరినట్లు చెబుతున్నారు. ఐతే గత ప్రభుత్వం మాత్రం ఇందులో సగమే చెబుతోంది. కార్పొరేషన్ల పేరుతోనూ, ప్రభుత్వ ఆస్తుల తాకట్టు ద్వారా తెచ్చిన రుణాలను వేరుగా చూపుతున్నట్లు ఆరోపిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం.

అందుకే మొత్తం రుణాల లోగుట్టు తేల్చేపని మొదలుపెట్టింది. కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పు దేనికి వినియోగింది స్పష్టతలేదు. అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి రుణాలు చేసినట్లు చెబుతున్నారు. ఏ ఆస్తిని ఎంతకు తాకట్టు పెట్టిందీ ఎవరికీ తెలియదు. ఈ విషయాలపై సమగ్ర సమాచారాన్ని ప్రజలకు వివరించేందుకు వైట్‌ పేపర్‌ రిలీజ్‌ చేయాలనుకుంటోంది ప్రభుత్వం.

ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల భవిష్యనిధితోపాటు విద్యార్థుల పరీక్షా ఫీజుల కింద వసూలు చేసిన మొత్తం, పోలీసులు విధించే చలానాల డబ్బు కూడా వాడేసినట్లు చెబుతున్నారు. ఇలా ఏ శాఖ నుంచి ఎంత తీసుకున్నారనేది శ్వేతపత్రాల ద్వారా వివరించే అవకాశం ఉంది. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బిల్లులు చెల్లించలేదు.

బిల్లుల బకాయిలు కొండలా..
వీటికితోడు గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లుల బకాయిలు కొండలా పేరుకుపోయాయి. ఇదీ ఒకరకమైన అప్పు కిందే లెక్కిస్తున్నారు. పెండింగు బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్లు హైకోర్టులో కేసులు వేశారు. గడిచిన ఐదేళ్లలో ఎంత మొత్తం పెండింగు బిల్లులు ఉన్నాయో ఇంతవరకు బయటపెట్టలేదు. ఆ వివరాలన్నీ సేకరించాలంటే చాలా లోతుల్లోకి వెళ్లాల్సివుంటుంది. ఏ ఆర్థిక సంవత్సరంలో ఎన్ని బిల్లులు పెండింగులో ఉన్నాయి, ఆ మరుసటి ఏడాదికి ఎంత బదిలీ చేశారు? అన్నది తేల్చాల్సివుంది. ఈ సమాచారమంతా సేకరించి నాలుగు శ్వేతపత్రాలను వెలువరించాలని నిర్ణయించారు.

వాస్తవానికి రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రానికి అప్పుల భారం ఎక్కువైంది. గత ఐదేళ్లులో ఇవి మరింత ఎక్కువయ్యాయి. ఏడాదిలో 340 రోజులు అప్పులు చేయడమే పనిగా మారిందనే విమర్శలు ఉన్నాయి. ప్రతి మంగళవారం ఆర్‌బీఐ నుంచి రుణం తేవడం ఓ ఆనవాయితీగా మారింది. ఎఫ్‌ఆర్‌ఎంబీ నిబంధనలు తుంగలో తొక్కి నిధులు సమీకరించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

Also Read: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

రాష్ట్రాన్ని నడిపించడానికి వీల్లేని పరిస్థితుల్లో వేస్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్‌లను ఉపయోగించుకొని రుణాలు తీసుకున్నారు. ఈ అప్పులు రాష్ట్రంపై చాలా భారాన్ని మోపుతున్నాయి. వీటిని చంద్రబాబు అనుభవంతో అధిగమించే కార్యాచరణ ఓ వైపు చేస్తూనే…. గతంలో వ్యవస్థను దుర్వినియోగం చేసిన తీరును ప్రజల కళ్లకు కట్టేలా వివరించాలనే ఉద్దేశంతోనే శ్వేతపత్రాలను ముద్రించాలని నిర్ణయించింది ప్రభుత్వం.