BRS: ఈసారి గెలిచి తీరాల్సిందే..! ఖైరతాబాద్ ఉపఎన్నిక కోసం బీఆర్ఎస్ కసరత్తు.. బలమైన అభ్యర్థి కోసం వేట..

ఖైరతాబాద్ టికెట్ ను పలువురు ఆశిస్తున్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన మన్నె గోవర్ధన్ రెడ్డి తనకే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట.

BRS: ఈసారి గెలిచి తీరాల్సిందే..! ఖైరతాబాద్ ఉపఎన్నిక కోసం బీఆర్ఎస్ కసరత్తు.. బలమైన అభ్యర్థి కోసం వేట..

Updated On : November 24, 2025 / 9:04 PM IST

BRS: ఈసారి మునుపటి లెక్క కాదు. కంటోన్మెంట్ చేజారింది..జూబ్లీహిల్స్ మిస్ అయ్యింది. ఆ రెండు సిట్టింగ్ సీట్లలో సెంటిమెంట్ వర్కవుట్ కాలేదు. ఖైరతాబాద్ బై ఎలక్షన్ వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాల్సిందేనని పట్టుదలతో ఉంది బీఆర్ఎస్. ఇక చేజారిన జూబ్లీహిల్స్ పక్కనే ఉన్న ఖైరతాబాద్‌కు కూడా ఉప ఎన్నిక ఖాయమన్న ప్రచారం ఊపందుకుంది. పార్టీ ఫిరాయింపుల ఎపిసోడ్‌లో ఖైరతారాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు తప్పదన్న చర్చ జరుగుతోంది. దానంపై వేటు పడటమో లేక అంతకంటే ముందే ఆయన రిజైన్ చేయడమో? ఏదో ఒకటి పక్కా అని టాక్ వినిపిస్తోంది.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమితో తీవ్ర నిరాశలో ఉన్న బీఆర్ఎస్..కచ్చితంగా ఖైరతాబాద్‌లో గెలిచి తీరాలన్న కసితో ఉంది. అందుకోసం ఇప్పటి నుంచే కసరత్తు స్పీడప్ చేసింది. బలమైన అభ్యర్థి కోసం గులాబీ పార్టీ వేట మొదలుపెట్టింది. అధికార కాంగ్రెస్ నుంచి మళ్లీ దానం నాగేందర్ పోటీ చేస్తే ఒకలా..లేదంటే మరోలా రెండు ప్లాన్స్‌ రెడీ చేస్తోంది గులాబీదళం. దివంగత నేత పీజేఆర్‌కు ఖైరతాబాద్ లో అభిమానులు ఉండటంతో..ఆయన తనయుడు, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ ను రంగంలోకి దించాలని అనుకుంటోందట బీఆర్ఎస్.

పీజేఆర్ తనయుడిగా ఫాలోయింగ్‌..

ఒకసారి ఖైరతాబాద్ నుంచి, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జూబ్లీహిల్స్ నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన విష్ణు..2023లో టికెట్ దక్కకపోవడంతో కారెక్కారు. మొన్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో విష్ణు టికెట్ ఆశించినా..మాగంటి గోపీనాథ్ భార్య సునీతనే పోటీలో పెట్టారు గులాబీ బాస్ కేసీఆర్. కాబట్టి ఇప్పుడు ఖైరతాబాద్ ఉపఎన్నిక వస్తే విష్ణును పోటీ చేయిస్తే..పీజేఆర్ తనయుడిగా ఇప్పటికే ఆయనకున్న ఫాలోయింగ్‌తో ఖైరతాబాద్ లో దానం నాగేందర్‌కు గట్టి పోటీ ఇస్తాడని నమ్ముతోంది గులాబీ పార్టీ.

టికెట్ రేసులో మన్నె, దాసోజు..?

ఇదే సమయంలో బీఆర్ఎస్ లో ఖైరతాబాద్ టికెట్ ను పలువురు ఆశిస్తున్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన మన్నె గోవర్ధన్ రెడ్డి తనకే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట. ఒకవేళ తనకు టికెట్ ఇవ్వకపోతే తన భార్య మన్నె కవితకు ఛాన్స్ ఇవ్వాలని అడుగుతున్నారు. ప్రస్తుతం ఖైరతాబాద్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్ గా ఉన్నారు మన్నె కవిత. 2018, 2023 రెండుసార్లు బీఆర్ఎస్ దానం నాగేందర్‌కు టికెట్ ఇస్తే సీటు త్యాగం చేసి సహకరించానని..ఈసారి తనకు, లేకపోతే తన భార్య మన్నె కవితకు టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారట మన్నె గోవర్ధన్‌రెడ్డి.

మరోవైపు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కూడా గతంలో ఖైరతాబాద్‌ నుంచి పోటీ చేశారు. బీసీ ఈక్వేషన్‌లో దాసోజు పేరు కూడా బీఆర్ఎస్‌ పరిశీలిస్తోంది. వీరితో పాటు మరికొందరు నేతలు ఖైరతాబాద్ బీఆర్ఎస్ టికెట్ రేసులో ఉన్నారని..పార్టీ ముందు తమ ప్రతిపాదన పెట్టారని అంటున్నారు. దీంతో ఖైరతాబాద్ నుంచి ఎవరిని బరిలోకి దింపాలని బీఆర్ఎస్ ఆలోచనలో పడింది. జూబ్లీహిల్స్ మాదిరి కాకుండా ఈసారి ఖైరతాబాద్ లో కచ్చితంగా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్న గులాబీ పార్టీ..బలమైన అభ్యర్ధి కోసం వడపోస్తోందట.

Also Read: బాబోయ్.. ఐదేళ్లలో రూ.100 కోట్ల సంపాదన..! ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్టులో సంచలన విషయాలు..