Cm Revanth Reddy : పసుపు బోర్డు రావాలన్నా, చక్కెర కర్మాగారం తెరుచుకోవాలన్నా జీవన్ రెడ్డిని గెలిపించాలి- సీఎం రేవంత్

దేశంలో రైతులు ఏ విధంగా ఉండాలో నిజామాబాద్ రైతులను చూసి నేర్చుకుంటారు. నిజామాబాద్ ఎంపీగా బీఆర్ఎస్, బీజేపీకి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ కు ఛాన్స్ ఇవ్వండి.

Cm Revanth Reddy : నిజామాబాద్ ఆర్మూర్ లో ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ”2021లో ఆర్మూర్ రైతులు పసుపు బోర్డు, గిట్టుబాటు ధర జరిగిన ఆందోళన కోసం నన్ను ఆహ్వానించారు. ఆనాడు ఆర్మూర్ రైతుల కోసం చేసిన దీక్ష నన్ను పీసీసీ అధ్యక్షుడిని చేసింది. ప్రజలు ఆశీర్వదించి తెలంగాణకు ముఖ్యమంత్రిగా చేశారు. ఆర్మూర్ రైతాంగం అండగా నిలబడటం వల్లనే సీఎం కాగలిగాను. 2014లో 100 రోజుల్లో చక్కెర కర్మాగారం తెరిపిస్తామని కల్వకుంట్ల కవిత పోటీ చేశారు. చక్కెర కర్మాగారం తెరవకపోవడంతో నమ్మించి మోసం చేసినందుకు 2019లో 100 మంది నామినేషన్లు వేశారు.

2019లో ఒక గుండు బాండ్ పేపర్ రాసి ఇచ్చారు. ఎంపీగా గెలిచిన 5 రోజుల్లో పసుపు బోర్డు తీసుకొస్తానని బాండ్ పేపర్ రాసి ఇచ్చారు. పసుపు బోర్డు తెచ్చి పసుపు రైతులను ఆదుకుంటామన్నందుకు అర్వింద్ ను గెలిపించారు. మళ్లీ గెలిపించండి పసుపు బోర్డు తెస్తానని అర్వింద్ మళ్లీ ఇప్పుడు చెపుతున్నారు. ఈ ప్రాంత రైతులంటే లెక్క లేదు. మోసం చేయవచ్చని మోదీ, ధర్మపురి అర్వింద్ అనుకుంటున్నారు. నిజామాబాద్ రైతుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది.

ఆర్మూర్ లో బీజేపీ ఎమ్మెల్యే గెలిచి 150 రోజులైంది. కేంద్రం నుంచి ఏం తెచ్చారు? కేంద్రంతో మాట్లాడి ఆర్మూర్ మున్సిపాలిటీకి మున్సిపల్ కార్యాలయం కూడా తేలేదు. ఆర్మూర్ లో బీజేపీకి వేసిన ఓట్లు శుద్ధ దండగ. జీవన్ రెడ్డికి వ్యవసాయం అంటే ఏమిటో తెలుసు. ఆయన ఆదర్శ రైతు.
రైతు వ్యతిరేక నల్లచట్టాలు తీసుకొచ్చిన నరేంద్ర మోదీ మెడలు వంచి క్షమాపణ చెప్పించిన పౌరుషం పంజాబ్ రైతులది. తెలంగాణలో ఆర్మూర్, నిజామాబాద్ రైతులు కూడా పంజాబ్ రైతుల్లా కొట్లాడతారు. పసుపు బోర్డు రావాలన్నా, చక్కెర కర్మాగారం తొందరగా తెరుచుకోవాలన్నా జీవన్ రెడ్డిని పార్లమెంటుకు పంపించాలి.

మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసి 47 కోట్ల బకాయిలు విడుదల చేసి చక్కెర కర్మాగారాన్ని తెరిపించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. 500 రూపాయల బోనస్ ఇచ్చి ధాన్యాన్ని కొనే బాధ్యత నాది. 9వ తేదీ లోపు రైతుబంధు వేస్తా.. లేకపోతే అమరవీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాస్తానని సవాల్ చేశా. 69 లక్షల మంది రైతుల అకౌంట్లలో రైతుబంధు నిధులు వేశాం. కేసీఆర్ సిగ్గుంటే అమరవీరుల స్థూపం లేకుంటే ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తా దగ్గరకు వచ్చి ముక్కు నేలకు రాయాలి. కేసీఆర్.. రైతు బంధు వచ్చిందో రాలేదో ఏ రైతు ఖాతానైనా చూడు.

లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు కొట్లాడి ఇందిరమ్మ రాజ్యం తెచ్చారు. ఆగస్టు 15లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తా అంటే హరీశ్ రావు రాజీనామా సవాల్ చేశారు. రుణమాఫీ చేసి సిద్దిపేటకు పట్టిన శనిశ్వరుడిని శాశ్వతంగా వదిలిస్తా. ఆర్మూర్ సిద్ధులగుట్ట సాక్షిగా ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తా. దేశంలో రైతులు ఏ విధంగా ఉండాలో నిజామాబాద్ రైతులను చూసి నేర్చుకుంటారు. నిజామాబాద్ ఎంపీగా బీఆర్ఎస్, బీజేపీకి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ కు ఛాన్స్ ఇవ్వండి.

జీవన్ రెడ్డి రైతు. రైతుల కష్టం ఏమిటో తెలుసు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయం నిర్మాణం కోసం 16కోట్లు మంజూరు. ఆర్మూర్ మున్సిపాలిటీ సమస్యలన్నింటిని పరిష్కరిస్తాం. పదేళ్లు ప్రధానిగా నరేంద్ర మోదీ పసుపు బోర్డుపైన అబద్ధాలు చెపుతున్నారు. రాముడి కళ్యాణం కాకుండా ఎక్కడైనా అక్షింతలు పంచుతారా..?  రాముని కళ్యాణానికి 15 రోజులకు ముందే బీజేపీ వాళ్లు అక్షింతలు పంచారు. ఇది దేవుడిని మోసం చేయడం కాదా? హిందువులను మోసం చేసినట్లు కాదా? బీజేపీ వాళ్లు మనకు భక్తి, పూజల గురించి చెబుతారా..? దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలి.. వారే అసలైన హిందువులు.. దేవుడి పేరు చెప్పి ఓట్లు అడిగే వారు భిక్షగాడు అవుతాడు.

మచ్చలేని నాయకుడు జీవన్ రెడ్డి. నిజామాబాద్ రైతుల సమస్యలు పరిష్కారం కావాలంటే జీవన్ రెడ్డి ఎంపీ కావాలి. 40ఏళ్ల పాటు రాజకీయాల్లో ఆదర్శంగా ఉన్న నేత జీవన్ రెడ్డి. నిజామాబాద్ ఎంపీగా జీవన్ రెడ్డి లక్ష ఓట్ల మెజార్టీతో గెలవాలి” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read : మందుబాబుల‌కు షాక్‌.. తెలంగాణ‌లో 48 గంట‌ల పాటు మ‌ద్యం దుకాణాలు బంద్‌..

 

ట్రెండింగ్ వార్తలు