AP PRC : ఒకటో తారీఖు వస్తోంది.. జీతాలు వస్తాయా ?

జనవరి నెల జీతాలు ఆపాలని ప్రభుత్వమే కుట్ర చేస్తోందని.. అదే జరిగితే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు. అయితే తాము చర్చలకు రమ్మంటున్నా రాకుండా, జీతాలు ప్రాసెస్ చేయాలని...

AP Govt Employees Protest : ఒకటో తారీఖు దగ్గరకు వస్తుంది.. అయినా ఎవరూ దగ్గడం లేదు.. పట్టువీడటం లేదు. దీంతో ఫిబ్రవరి ఒకటో తారీఖున ఉద్యోగుల అకౌంట్లలలో జనవరి నెల జీతాలు పడటం అనుమానంగానే కనిపిస్తోంది.. జీతాలు ప్రాసెస్ చేయాల్సిందే అని ప్రభుత్వం.. మీరేం చేసినా ప్రాసెస్ చేసేది లేదంటూ ఉద్యోగులు భీష్మించుకోవడంతో ఒకటో తారీఖు వస్తున్న కొద్ది జీతాలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలివ్వాలన్న విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. జీతాలు ప్రాసెస్‌ చేయకపోతే చర్యలు తప్పవని ట్రెజరీ ఉద్యోగులకు ప్రభుత్వం వరుస పెట్టి సర్క్యూలర్స్‌ జారీ చేస్తూనే ఉంది. జీతాలు, పెన్షన్ల బిల్లుల ప్రకారం టైమ్‌ లైన్‌ నిర్ధేశించి దాని ప్రకారం గడువులోగా జీతాలివ్వాలని తేల్చి చెప్పింది.. లేదంటే ఊరుకునేది లేదని హుకుం జారీ చేసింది. ట్రెజరీ ఉద్యోగులకు అండగా తామున్నామంటున్నారు పీఆర్సీ సాధన సమితి నేతలు. ఒకవేళ ఉద్యోగులపై చర్యలు తీసుకుంటే న్యాయపోరాటానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు.

Read More : Web Series Telugu: ఓటీటీని దోచుకొనే పనిలో పడిన టాప్ డైరెక్టర్లు.. బడా ప్రొడ్యూసర్లు!

పెండింగ్ డీఏలతో కూడిన పాత జీతాన్నే ఇవ్వాలన్నది ఉద్యోగుల ప్రధాన డిమాండ్‌. ఇందుకు తగ్గట్టుగా జనవరి నెలకు పాత జీతాలను డీఏలతో కలిపి ఇవ్వాలని ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా డీడీవోలకు వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక జీతాలను ప్రాసెస్ చేసే విషయంలో తమపై అంత ఒత్తిడి తెస్తున్న ప్రభుత్వం.. నిజంగా ఉద్యోగులపై ప్రేమ ఉంటే రూ. 1800 కోట్ల సప్లిమెంటరీ బిల్లులు ఎందుకు ప్రాసెస్‌ చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు నేతలు. అంతేగాకుండా 2 వేల 100 కోట్ల పీఎఫ్ ఇతర బిల్లులు ఎందుకు చెల్లించడం లేదని నిలదీస్తున్నారు. జనవరి నెల జీతాలు ఆపాలని ప్రభుత్వమే కుట్ర చేస్తోందని.. అదే జరిగితే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు. అయితే తాము చర్చలకు రమ్మంటున్నా రాకుండా, జీతాలు ప్రాసెస్ చేయాలని ఆదేశాలు ఇచ్చినా చేయకుండా ప్రభుత్వంపై పోరాటం చేయడం అనేది సరికాదంటున్నారు ఏపీ మంత్రులు. దీంతో జనవరి జీతాలపై డైలమా కంటిన్యూ అవుతోంది.

Read More : LIC IPO : ఎల్ఐసీ ఐపీవో.. మార్చి 31లోపు లిస్ట్

మరోవైపు…ఉద్యోగులు చర్చలకు వస్తామని రాకపోవడంతో.. మంత్రుల కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్సనల్‌గా ఫోన్ చేసినా.. రాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించారు. తాజాగా.. ప్రభుత్వ సలహాదారు సజ్జల, మంత్రి బోత్స సత్యనారాయణలు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రుల కమిటీగా తాము ప్రతిరోజు వస్తున్నా..ఉద్యోగ సంఘాల నేతలు రావడం లేదన్నారు. అయితే.. కొన్ని ఉద్యోగ సంఘాలు రావడంతో.. వారితో చర్చించడం జరిగిందన్నారు సజ్జల. ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబసభ్యులు ఆలోచించాలని సూచించారు మంత్రి బోత్స. ఇక స్టీరింగ్ కమిటీ పిలిస్తేనే వస్తామని, వారితో చర్చలు చేసేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉందన్నారు. వాళ్లు చర్చలకు రాకుండా ఇలాగే వ్యవహరిస్తే… చట్టం ప్రకారం జరుగుతోందని హెచ్చరించారు. మరి రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు