Job Crisis At IITs : ఐఐటీల్లో ఉద్యోగ సంక్షోభం.. 38శాతం మందికి దక్కని ఉద్యోగాలు..!

2024లో, ప్లేస్‌మెంట్‌ల కోసం రిజిస్టర్ చేసుకున్న 21,500 మంది విద్యార్థులలో 13,410 మంది మాత్రమే ఉద్యోగాలను పొందారు. 38శాతం మంది ఇప్పటికీ ఉద్యోగం కోసం వెతుకుతున్నారు.

Job Crisis At IITs : భారత్‌‌లో ఐఐటీలకు ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పన్కర్లేదు. అందులోనూ ఇంజినీరింగ్ విద్య కోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IITs)లో చదివేందుకు విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఇలాంటి యూనివర్శిటీల్లో చదువుకుంటే కెరీర్ పరంగా బాగుంటుందని, అనేక మంచి ఉద్యోగవకాశాలు వస్తాయని భావిస్తుంటారు.

Read Also : CBSE Open Book Exams : పుస్తకాలు చూస్తూనే పరీక్షలు రాయొచ్చుంటున్న సీబీఎస్ఈ.. విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన!

కానీ, ప్రస్తుత నిరుద్యోగం కారణంగా ఐఐటీల పరిస్థితి దుర్భరంగా మారింది. దీనికి ఐఐటీల్లో ఉద్యోగ సంక్షోభమే ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఐఐటీల్లో చదువుకున్న వారిలో చాలామందికి ఇప్పటివరకూ ఉద్యోగాలు దొరకలేదు. 2024లో ఐఐటీల్లో చదివిన అనేక మంది విద్యార్థుల్లో దాదాపు 38శాతం మంది విద్యార్థులకు ఉద్యోగవకాశాలు రాలేదు. ఇప్పటికీ ఉద్యోగాల కోసం తెగ వెతుకుతున్న పరిస్థితి నెలకొంది.

ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్థి ధీరజ్ సింగ్ దాఖలు చేసిన సమాచార హక్కు (RTI) దరఖాస్తుల ద్వారా అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. వెల్లడైన డేటా ప్రకారం.. 23 క్యాంపస్‌లలో సుమారు 8వేల (38శాతం) మంది ఐఐటీ విద్యార్థులు ఈ ఏడాది ఉద్యోగం లేక ఖాళీగా ఉన్నారు. 2024లో, ప్లేస్‌మెంట్‌ల కోసం రిజిస్టర్ చేసుకున్న 21,500 మంది విద్యార్థులలో 13,410 మంది మాత్రమే ఉద్యోగాలను పొందారు. 38శాతం మంది ఇప్పటికీ ఉద్యోగం కోసం వెతుకుతున్నారు. రెండు ఏళ్ల క్రితం 3,400 (19శాతం) మంది విద్యార్థులకు ఉద్యోగం దొరకలేదు. అప్పటినుంచి నుంచి నిరుద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

ఇంకా 37శాతం మందికి ఉద్యోగాలు లేవు :
పాత తొమ్మిది ఐఐటీల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ ఏడాదిలో 16,400 మంది విద్యార్థులు ప్లేస్‌మెంట్ కోసం రిజిస్టర్ చేసుకున్నారు. అందులో 6,050 (37శాతం) మందికి ఇంకా ఉద్యోగాలు దొరకడం లేదు. కొత్త 14 ఐఐటీలు కొంచెం అధ్వాన్నంగా ఉన్నాయి. 5,100 మంది ప్లేస్‌మెంట్ నమోదు చేసుకున్న విద్యార్థులలో 2,040 (40శాతం) మంది చోటు కోల్పోయారు. కన్సల్టెంట్, ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్థి ధీరజ్ సింగ్ లింక్డ్‌ఇన్‌లో సంబంధిత డేటాను షేర్ చేశారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లోని 33శాతం మంది విద్యార్థులకు గత సంవత్సరం ప్లేస్‌మెంట్‌ల ద్వారా ఉద్యోగాలు లభించలేదు.

ఉద్యోగ నియామకాల పేలవమైన పరిస్థితుల కారణంగా ప్లేస్‌మెంట్ లేని విద్యార్థులు ఒత్తిడి, ఆందోళన, నిస్సహాయతతో వ్యవహరిస్తున్నారని ఆయన తెలిపారు. ఐఐటీ ఢిల్లీలో గత ఐదేళ్లలో 22శాతం మంది విద్యార్థులకు ఉద్యోగం లభించలేదు. 2024లో 40శాతం మంది ఇప్పటికీ నిరుద్యోగులుగానే ఉన్నారు. ఆర్టీఐ రిప్లయ్ ప్రకారం.. గత రెండేళ్లలో ఐఐటీ ఢిల్లీలో 600 మంది విద్యార్థులు చోటు కోల్పోయారని సింగ్ పేర్కొన్నారు.

ఉద్యోగాలు లేక ఐఐటీ విద్యార్థుల్లో ఆందోళన :
డేటాను పరిశీలిస్తే.. 2022 నుంచి 2024 వరకు పాత తొమ్మిది ఐఐటీల్లో నమోదిత విద్యార్థుల సంఖ్య 1.2 రెట్లు పెరిగింది. అయితే, అన్‌ప్లేస్డ్ విద్యార్థుల సంఖ్య 2.1 రెట్లు పెరిగింది. కొత్త 14 ఐఐటీల్లో నమోదిత విద్యార్థుల సంఖ్య 1.3 రెట్లు పెరిగింది. కానీ, స్థానం పొందని విద్యార్థుల సంఖ్య 3.8 రెట్లు పెరిగింది. ఈ ప్లేస్‌మెంట్ సంక్షోభం విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతోంది.

ఈ ఏడాది మొత్తం 6 ఐఐటీ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడంతో చాలా మంది తీవ్ర ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నారు. ఉద్యోగం దొరకని విద్యార్థుల సంఖ్య రెట్టింపు కావడంతో పాటు దేశంలోని అత్యుత్తమ ఇంజినీరింగ్ కళాశాలల్లో అనిశ్చిత స్థితిని సూచిస్తుంది. దాదాపు 61శాతం పోస్ట్ గ్రాడ్యుయేట్‌లు ఇప్పటికీ జాబ్ దొరకలేదు. ప్రధాన కాలేజీలు, యువ గ్రాడ్యుయేట్లు ఎదుర్కొంటున్న ఉద్యోగ సంక్షోభమని సింగ్ పేర్కొన్నారు.

Read Also : CBSE Boards Exam 2024 : పరీక్షల ఒత్తిడిని తగ్గించుకోవడానికి విద్యార్థులకు సీబీఎస్ఈ సూచనలు.. ఏం చేయాలి? ఏం చేయకూడదంటే? 

ట్రెండింగ్ వార్తలు