ఈవీఎంలను ధ్వంసం చేస్తున్న విజువల్స్ ట్వీట్ చేసిన సజ్జల

ఈసీకి చిత్తశుద్ధి ఉంటే మొత్తం వీడియోలను, ఏడు చోట్ల జరిగిన ఘటనలకు సంబంధించిన ఫుల్ వీడియోలను ఎందుకు బయట పెట్టలేదని అడిగారు.

Sajjala Ramakrishna Reddy : బాపట్ల జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని తుమ్మూరుకోట గ్రామంలో ఈవీఎంలను ధ్వంసం చేసిన విజువల్స్ విడుదల చేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. టీడీపీ నేతలు నాగేశ్వరరావు, బూత్ ఏజెంట్ నర్సింహారావు ఈవీఎంలను ధ్వంసం చేశారని సజ్జల ఆరోపించారు. మాచర్ల ఘటనపై తీవ్రంగా స్పందించిన సజ్జల.. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఈసీకి కొన్ని ప్రశ్నలు సంధించారు. పాల్వాయి గేట్ వీడియో నిజమైనదేనని ఎన్నికల సంఘం ప్రకటిస్తున్నా.. ఆ వీడియో సరైనదా? కాదా? అన్నది నిర్ధారించకుండానే ఎన్నికల సంఘం చర్యలకు ఎలా దిగుతుంది? ఒకవేళ నిజమైనదే అయితే ఆ వీడియో సోషల్ మీడియాలోకి ఎలా వచ్చింది? అని సజ్జల ప్రశ్నించారు.

మాచర్ల నియోజకవర్గంలో ఏడు ఘటనలు జరిగాయని ఈసీ చెబుతోందని, అలాంటప్పుడు కేవలం ఒక్క వీడియో మాత్రమే ఎలా లీక్ చేస్తారని ప్రశ్నించారు. ఈసీకి చిత్తశుద్ధి ఉంటే మొత్తం వీడియోలను, ఏడు చోట్ల జరిగిన ఘటనలకు సంబంధించిన ఫుల్ వీడియోలను ఎందుకు బయట పెట్టలేదని అడిగారు. అన్ని వీడియోలు బయటకు వచ్చినప్పుడే అసలేం జరిగింది? అన్నది వెలుగులోకి వస్తుందని, అంతేతప్ప ఒక చిన్న క్లిప్పింగ్ మాత్రమే బయటకు ఎలా వస్తుంది? అని ఆయన మండిపడ్డారు.

తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు, వారిని గుర్తించేందుకు ఈసీ ఎందుకు సరైన పద్ధతిలో నిర్ణయాలు తీసుకోవడం లేదని సజ్జల అడిగారు. సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న రెండు వీడియోలను పరిశీలిస్తే అమాయక ఓటర్లపై టీడీపీ గూండాలు దాడి చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. వారి మీద ఎన్నికల సంఘం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో ఈసీ చెప్పాలని, ఈ ఘటన వెనుక ఉన్నవారిని ఎందుకు పట్టుకోవటం లేదో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు సజ్జల.

Also Read : పిన్నెల్లి వీడియోపై ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనా కీలక వ్యాఖ్యలు

 

ట్రెండింగ్ వార్తలు