ఏపీలో పోలీసులు హై అలర్ట్.. హింస జరక్కుండా కఠిన చర్యలు

అనుమానిత వ్యక్తులు, నేరస్తుల ఇళ్లు తదితర ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా సోదాలు చేశారు. ప్రధానంగా 168 సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేశారు.

Ap Police High Alert : ఎలక్షన్ కౌంటింగ్ లో ఎలాంటి హింసాత్మక ఘటనలు జరక్కుండా పోలీసులు రంగంలోకి దిగారు. ఓట్ల లెక్కింపు రోజున రాష్ట్రంలో భారీగా అల్లర్లు జరుగుతాయన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏపీలో పరస్పర దాడులు జరిగే అవకాశం ఉందని ముందస్తు సమాచారంతో ఏపీ నేర నియంత్రణకు పోలీసు యంత్రాంగం కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది.

ఇప్పటికే 14మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమైన కూడళ్లు, గ్రామ శివార్లు, అనుమానిత వ్యక్తులు, నేరస్తుల ఇళ్లు తదితర ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా సోదాలు చేశారు. ప్రధానంగా 168 సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేశారు.

తనిఖీల్లో భాగంగా రికార్డుల్లో లేని 803 వాహనాలు, 103 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఎక్కడైనా అనుమానితులు కనపడినా, అక్రమాల సమాచారం తెలిసినా.. వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా విజ్ఞప్తి చేశారు.

ప్రకాశం జిల్లా మార్కాపురం టౌన్ లోని రాజ్యలక్ష్మి కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 15 బైక్ లను పోలీసులు సీజ్ చేశారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు కొత్త వ్యక్తులను పోలీసులు ప్రశ్నించారు. ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పల్నాడు జిల్లా కారంపూడి మండలం చింతపల్లి గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని ద్విచక్ర వాహనాలు, ఇతర వెహికల్స్ ను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎవరైనా హింసాత్మక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

అటు నెల్లూరు జిల్లా పోలీసులు సమస్యాత్మక ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గూడూరు, కావలి, నాయుడిపేట తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. సరైన డాక్యుమెంట్స్ లేని ద్విచక్ర వాహనాలు సీజ్ చేశారు. గుడూరులో 35, కావలిలో 45, నాయుడిపేటలో 22 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

Also Read : అసత్య ప్రచారాలకు కొడాలి నాని చెక్.. ఇదిగో వీడియో

ట్రెండింగ్ వార్తలు