పక్కలో బల్లెంలా ప్రత్యర్థులు.. ఈ దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు

Ongoing wars: పాక్ దుర్మార్గాలను, దుర్బుద్ధిని గుర్తించి ఎప్పటికప్పుడు భారత్

రాజుల కాలంలో రాజ్యాల కోసం యుద్ధాలు జరిగేవి.. ఇష్టారాజ్యంగా రాజ్యాక్రమణలు సాగేవి. ప్రజారంజక పాలన కన్నా, ప్రజల అవసరాలను పట్టించుకోవడం కన్నా రాజ్యవిస్తరణే చక్రవర్తుల లక్ష్యంగా ఉండేది. తర్వాతి కాలంలో కొన్ని దేశాలు.. ఆయుధ, ఆర్థికబలంతో ఇతర దేశాలను ఆక్రమించి శతాబ్దాల పాటు పాలించాయి.

తర్వాత ప్రపంచం మొత్తం ప్రజాస్వామ్యం దిశగా పయనించింది. దేశాలకు దేశాలు.. పోరాటాలు చేసి సర్వస్వతంత్రంగా మారాయి. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచయుద్ధం సృష్టించిన వినాశనం గమనించి.. 80 ఏళ్లగా మరో యుద్ధం తలెత్తకుండా అంతా జాగ్రత్తపడుతున్నారు. కానీ తాజా పరిణామాలు చూస్తే… మరో ప్రపంచ యుద్ధం తప్పదా అన్న సందేహం కలుగుతోంది. ఆధునిక చక్రవర్తుల్లా భావించే కొన్ని దేశాలతో ప్రపంచానికి పెనుముప్పు తప్పదా అన్న భయాందోళన వ్యక్తమవుతోంది.

సరిహద్దు దేశాలతో గొడవలు
ప్రపంచం ప్రశాంతంగా లేదు. బాంబు పేలుళ్లు, ఆత్మాహుతి దాడులు, అంతర్గత కలహాలు, తెరవెనక కుట్రలకే దేశాలు పరిమితం కావడం లేదు. శత్రదేశాలను కవ్విస్తున్నాయి. సరిహద్దు దేశాలతో కావాలని గొడవలు పెట్టుకుంటున్నాయి. తమ స్వార్థ ప్రయోజనాల కోసం కూటములు కట్టుకుంటున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలు, అగ్రరాజ్య హోదా పొందేందుకు, నిలబెట్టుకునేందుకు ఆరాటపడుతున్న దేశాలు చిన్నదేశాలను, తృతీయ ప్రపంచదేశాలను అప్పుల పేరుతో, ఆయుధసాయం పేరుతో తమ వైపుకు తిప్పుకుని బలవంతులుగా ముద్రవేయించుకునేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి.

మరోపక్క ఉనికి కోసం, అస్తిత్వాన్ని నిలుపుకోవడం కోసం, స్వాతంత్ర్యాన్ని కొనసాగించుకునేందుకు ఇంకొన్నిదేశాలు అలుపెరగక శ్రమిస్తున్నాయి. మొత్తంగా అనేక కుదుపులకు లోనవుతోంది ప్రపంచం. ఈ పరిణామాలన్నీ గమనిస్తే…ఇంకో యుద్ధం దిశగా అడుగులు పడుతున్నాయా…అన్న సందేహాలు కలుగుతున్నాయి. మానవజాతి పెనువిధ్వంసం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్న హెచ్చరికలు వినపడుతున్నాయి.

రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ఆధునిక ప్రపంచం అవతరించినప్పటినుంచి… అనేక దేశాల మధ్య సరిహద్దు తగాదాలు, అస్తిత్వ పోరాటాలు సాగుతున్నాయి. కొన్నిసార్లు అవి ఆయా దేశాల మధ్య యుద్ధాలకూ దారితీశాయి. ఆ యుద్ధాల్లో గెలుపోటములు..ఆయా దేశాల స్థితిగతులను మార్చివేశాయి తప్ప మొత్తం ప్రపంచంపై పడిన ప్రభావమేదీ లేదు. అయితే ఇప్పుడు కొన్ని దేశాల మధ్య చెలరేగిన ఉద్రిక్తతలు, ఘర్షణలు, యుద్ధాలు.. ఆ రెండు దేశాలనూ దాటి.. ప్రపంచమంతటికీ విస్తరిస్తాయా..మరో ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయా అన్నదే భయాందోళన కలిగిస్తున్న విషయం.

మరో వరల్డ్ వార్‌కి దారితీసేలా..
మరో వరల్డ్ వార్‌కి దారితీసేలా ఉండే సంక్షోభాలను ప్రపంచ సంక్షోభాలుగా భావిస్తున్నాం. ఆ జాబితాలో భారత్-పాకిస్థాన్ వివాదం, చైనా-తైవాన్ ఘర్షణ, ఉత్తరకొరియా-దక్షిణకొరియా విభేదాలు, రష్యా-యుక్రెయిన్ ఉద్రిక్తత, ఇజ్రాయెల్-పాలస్తీనా గొడవలు ఉండేవి. ఇప్పుడు తాజాగా ఇరాన్-ఇజ్రాయెల్ సంక్షోభం వచ్చి చేరింది. రెండు దేశాలు ఆవిర్భవించిన తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య మూడు యుద్ధాలు జరిగాయి. మూడింటిలోనూ భారత్ విజయం సాధించింది.

తైవాన్ సర్వస్వతంత్ర దేశంగా ప్రకటించుకోవడం, తైవాన్..చైనాలో భాగమని వాదించడం దశాబ్దాలుగా జరుగుతోంది. తైవాన్‌లో విదేశీ నేతలు ఎవరన్నా పర్యటించినా… తైవాన్ నేతలు స్వతంత్ర దేశం గురించి మాట్లాడినా చైనా తన ఆయుధబలంతో భయపెట్టడానికి ప్రయత్నిస్తూ వస్తోంది.. ఇక ఎప్పుడూ యుద్ధవాతావరణంలోనే ఉండే ఉత్తర, దక్షిణకొరియాల మధ్య ఏ క్షణం ఏమైనా జరిగేంత ఉద్రిక్తత నెలకొని ఉంటుంది. రష్యా, యుక్రెయిన్ రెండేళ్లగా యుద్ధభూమిలో తలపడుతున్నాయి.

ఇజ్రాయెల్-పాలస్తీనా సంక్షోభం పరిష్కారం లేని సమస్యగా మారింది. తాజాగా హమాస్‌కు మద్దతుగా ఇరాన్ నిలవడం ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధ పరిస్థితులును సృష్టించింది. మొత్తంగా ప్రపంచంలో మరో మహాసంగ్రామం తప్పదన్నట్టుగా వెలువడుతున్న సంకేతాలు శాంతికాముకులను కలవరపరుస్తున్నాయి.

దేశాల మధ్య జరుగుతున్నప్పటికీ..
ఘర్షణలు రెండు దేశాల మధ్య జరుగుతున్నప్పటికీ… వాటిలో కొన్ని బాధిత దేశాలు కాగా కొన్ని కావాలని ఉద్రిక్తతలు రెచ్చగొట్టి… యుద్దానికి దారితీసే పరిస్థితులను సృష్టించేదేశాలు. భారత్-పాకిస్థాన్ విషయానికొస్తే..మనది శాంతికాముక దేశం. పార్టీలతో సంబంధం లేకుండా అధికారంలో ఎవరున్నా….పొరుగుదేశాలతో స్నేహసంబంధాలే కోరుకుంటారు మన నాయకులు. యుద్ధాలతో దక్కే అంతిమప్రయోజనం ఏదీ ఉండదన్న స్పృహ మన నేతలకు ఉంది. కానీ పాకిస్థాన్ అలా కాదు.

ఆవిర్భావం నుంచి ఇప్పటిదాకా ప్రతీసందర్భంలో భారత్‌ను ఏదో ఒక విధంగా రెచ్చగొడుతూనే ఉంటుంది. సరిహద్దుల్లో నిరంతరం కవ్వింపులకు దిగుతుంటుంది. ఉగ్రవాదులను ఉసిగొల్పుతుంటుంది. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తుంది. చొరబాటుదారులను ప్రోత్సహిస్తుంటుంది. అంతర్జాతీయ వేదికల్లో భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతూ ఉంటుంది. భారత్‌లో అలజడి సృష్టించడమే పాకిస్థాన్ అంతిమలక్ష్యంగా ఉంటుంది. భారతీయులపై ద్వేషం ప్రదర్శించడమే పాకిస్థాన్ అసలు సిద్దాంతమన్నట్టుగా ప్రవర్తిస్తుంటుంది.

భారత్‌ను నిరంతరం అస్థిరపరిచే ప్రయత్నాలు చేయడంలోనే పాకిస్థాన్ ఉనికి ఉన్నట్టు అక్కడి నేతలు భావిస్తుంటారు. భారత్‌పై విద్వేషం వ్యాప్తిచేయడమే అక్కడి నాయకుల మనుగడకు ఆధారంగా ఉంటుంది. దీనివల్లే 77 ఏళ్ల తర్వాత కూడా ఇరుదేశాల మధ్య శాంతియుత పరిస్థితులు నెలకొనలేదు.. పాకిస్థాన్ కవ్వింపు చర్యలతో భారత్ ప్రతిచర్యలకు దిగాల్సిన పరిస్థితులు అనివార్యమయ్యాయి.. 1971లో పాకిస్థాన్ చీలిపోయి.. భారత్ సాయంతో బంగ్లాదేశ్ ఆవిర్భవించిన తర్వాత కూడా దాయాది దేశవైఖరిలో మార్పు రాలేదు.

యుద్ధాల వరుస ఓటములూ పాక్ నేతల ఆలోచనా విధానాలను మార్చడం లేదు. చివరకు దేశం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయినా… ఆర్థిక వ్యవస్థ పతనావస్థకు చేరినా..అప్పులిచ్చేవాళ్లు లేక అల్లాడుతున్నా… రక్షణరంగానికి 18వేల కోట్లు ఖర్చుపెడుతూ….భారత్‌ను ఏదో చేసేయాలన్న దుర్బుద్ధితోనే పాకిస్థాన్ పనిచేస్తోంది.

మరోవైపు పాకిస్థాన్‌తో పోలిస్తే..భారత్ ఆర్థికంగా, రక్షణపరంగా, సాంకేతికంగా అన్ని విధాలుగా మెరుగైన స్థితిలో ఉంది. ఏ దేశానికీ తొత్తుగా లేకుండా, ఎవరి చేతుల్లో పావుగా మారకుండా, ఎవరి ప్రయోజనాల కోసం పనిచేయకుండా స్వతంత్ర విదేశాంగ విధానం అనుసరిస్తుంటుంది. అలాగే పాకిస్థాన్‌పై యుద్ధాల్లో గెలిచిన చరిత్రా ఉంది. అయినా సరే మనదేశం ఎంతో సంయమనంతో వ్యవహరిస్తుంటుంది. నేతలు దేశాభివృద్ధిపైనే దృష్టిపెట్టి ముందుకుసాగుతున్నారు.

ఈ విషయాన్ని పాకిస్థాన్‌లో కొందరు రాజకీయ నేతలు సైతం ఒప్పుకుంటున్నారు. రెండు దేశాలు ఒకేసారి స్వాతంత్ర్యం పొందినా… భారత్ స్వతంత్ర విదేశాంగ విధానంతో ముందుకు సాగుతోందని, పాకిస్థాన్ ఆ స్థితిలో లేదని, దేశానికి మరోసారి స్వాతంత్ర్యం రావాల్సి ఉందని ఇమ్రాన్‌ఖాన్ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. భారత్ చంద్రునిపై అడుగుపెడుతోంటే.. కరాచీలో పిల్లలు తెరిచి ఉన్న కాల్వల్లో పడి మరణిస్తున్నారని మరో నేత ఆవేదన వ్యక్తంచేశారు.

పాకిస్థాన్ పాలకులు?
అయినా మిలటరీ కనుసన్నల్లో నడిచే పాకిస్థాన్ పాలకులు భారత్‌పై వ్యతిరేకతే పాకిస్థాన్ అస్తిత్వం అన్నతరహాలో పాలన సాగిస్తున్నారు. ఆ దేశంలో ప్రజాస్వామ్యం, మానవహక్కులు అన్నది ఓ బూటకం. చివరకు ఎన్నికల ప్రక్రియను కూడా అపహాస్యం చేశారు ఆ దేశ నేతలు. ఇమ్రాన్ ఖాన్ పార్టీ మద్దతుదారులు స్వతంత్రంగా పోటీచేసి ఎన్నికల్లో ఎక్కువస్థానాల్లో గెలుపొందితే….. వారిని కాదని… ప్రతిపక్షాలను గద్దెనెక్కించింది పాక్ మిలటరీ.

పాకిస్థాన్ ఆర్మీ లక్ష్యం… భారత్‌ను దెబ్బతీయడమే. అయితే పాక్ దుర్మార్గాలను, దుర్బుద్ధిని గుర్తించి ఎప్పటికప్పుడు భారత్ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఎదురుదాడి చేస్తోంది. ఐదేళ్ల క్రితం పుల్వామాలో ఉగ్రదాడి తర్వాత భారత్ సర్జికల్ స్ట్రయిక్స్‌తో ప్రతీకార దాడులకు దిగి పాకిస్థాన్‌కు చెక్‌ పెట్టింది. అయితే పాక్ ఆగడాలు శ్రుతి మించితే…. యుద్ధం చేయక తప్పని పరిస్థితులు ఏర్పడతాయి. మరోవైపు చైనా దుర్బుద్ధితో పాక్‌కు అన్నివిధాలా సాయమందిస్తోంది. ఈ పరిస్థితుల్లో భారత్-పాక్ మధ్య మరో యుద్ధం జరిగితే… ప్రపంచ సంక్షోభంగా మారే ప్రమాదముంది.

భారీ ఎన్‌కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి

ట్రెండింగ్ వార్తలు