Pilli Subhash Chandra Bose: పిల్లి సుభాశ్‌చంద్రబోస్ వైఖరిలో మార్పు ఎందుకొచ్చింది.. అసంతృప్తిగా ఉన్నారా?

వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు సూర్యప్రకాశ్ ను ఎన్నికల బరిలో దింపడం ఒక్కటే మార్గమని భావిస్తున్న బోస్.. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అవసరమైతే తన కుమారుడు ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేస్తాడనే సంకేతాలు ఇచ్చినట్లు చెబుతున్నారు.

Pilli Subhash Chandra Bose dissatisfaction : పిల్లి సుభాశ్‌చంద్రబోస్.. ఏపీ రాజకీయాల్లో చాలా సైలెంట్ పర్సన్. అధికార వైసీపీలో అధినేత జగన్‌కు నమ్మిన బంటు. ఎమ్మెల్యేగా గెలవకపోయినా జగన్ మంత్రివర్గం (Jagan Cabinet)లో చోటిచ్చారు. ఆ తర్వాత రాజ్యసభకు పంపి పెద్దల సరసన కూర్చొబెట్టారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌కు.. ప్రస్తుత సీఎం జగన్‌ (CM Jagan)కు విధేయుడిగా పేరొందిన బోస్.. ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారారు. వారసుడికి వారసత్వం కట్టబెట్టేందుకు పార్టీ లైన్‌ను సైతం అతిక్రమిస్తున్నారా! విధేయతకు బ్రాండ్ అంబాసిడర్ అయిన బోస్‌ వైఖరిలో మార్పు ఎందుకొచ్చింది? తెరవెనుక ఏం జరుగుతోంది?

ఉభయ గోదావరి జిల్లాల్లో సీఎం జగన్‌కు అత్యంత సన్నిహిత నేతల్లో ఒకరు మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్. ప్రస్తుతం వైసీపీ రాజ్యసభ ఎంపీగా ఉన్న బోస్.. 2012లో జగన్కి మద్దతుగా మంత్రి పదవిని సైతం త్యజించారు. సీఎంకి వీరవిధేయుడైన బోస్ సొంత నియోజకవర్గం రామచంద్రాపురం. 2012లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. వైసీపీ తరపున ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో రామచంద్రాపురం నుంచి.. 2019లో మండపేట నుంచి పోటీ చేసినా విజయం సాధించలేకపోయారు. కానీ, జగన్ కోసం పదవిని వదులుకున్నారనే ఏకైక కారణంతో 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రిని చేశారు. అప్పటివరకు ఎమ్మెల్సీగా ఉన్న బోస్.. మండలి రద్దు నిర్ణయంతో ఎమ్మెల్సీ పదవిని వదులుకున్నారు. జగన్ విధేయుడిగా గుర్తింపు ఉండటంతో ఆయనను రాజ్యసభకు పంపింది పార్టీ.

అధిష్టానంపై పట్టున్న బోస్.. కొన్నాళ్ల నుంచి సొంత నియోజకవర్గ పరిణామాలు చక్కదిద్దలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారని టాక్ నడుస్తోంది. బోస్ సొంత నియోజకవర్గం రామచంద్రపురం నుంచి ప్రస్తుతం మంత్రి చెల్లుబోయిన వేణు (Chelluboina Srinivasa Venugopala Krishna) ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ బోస్ స్థానంలో వేణుని మంత్రిగా ఎంపిక చేశారు ముఖ్యమంత్రి జగన్. బోస్ సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో వేణుకి అదృష్టం వరించిదని ఇప్పటికీ చెబుతుంటారు. బోస్ స్థానంలో ఎమ్మెల్యేగా ఎన్నికై అనంతరం మంత్రిగా బాధ్యతలు తీసుకున్న మంత్రి వేణు నియోజవర్గంలో క్యాడర్ పెంచుకోడానికి చేస్తున్న ప్రయత్నాలతో బోస్ వర్గం అసంతృప్తితో రగిలిపోతోంది. తమ నేతకు ప్రత్యామ్నాయంగా వేణు సొంతంగా ఎదగాలని చూస్తుండటాన్ని బోస్ వర్గం నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అంతిమంగా ఇది ఇద్దరి నేతల మధ్య విభేదాలకు కారణమైంది.

Also Read: పవన్ కల్యాణ్‌కు సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి- వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

ఈ వ్యవహారం పార్టీ పెద్దలు దృష్టికి వెళ్లినప్పటికీ లైట్ తీసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. పార్టీ కోసం ఎంతో చేశాం.. వలస నేతల పెత్తనంపై ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని.. ఎంపీ బోస్ తన అనుచరుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉభయగోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్‌గా ఉన్న బోస్.. కాకినాడ, కోనసీమ జిల్లాల పార్టీ సమీక్ష సమావేశాలకు గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. స్థానికంగా అందుబాటులో ఉన్నప్పటికీ పార్టీ మీటింగ్‌లకు దూరంగా ఉండటంపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు. సొంత ఇంటి వ్యవహారం చక్కబెట్టుకోలేనప్పుడు అక్కడికి వెళ్లి ఏమి ఉపయోగం ఉంటుందని, తన నిరసన అధినేత దృష్టికి వెళ్లాలని ఆ సమావేశాలకి బోసు వెళ్లలేదని ప్రచారం జరుగుతోంది.

Also Read: విశాఖ ఎంపీ స్థానం నుంచి పురంధేశ్వరి పోటీచేస్తారా.. జీవీఎల్ పరిస్థితి ఏంటి?

తాను చెప్పిన పనులను.. తన మనుషులను మంత్రి వేణు టార్గెట్ చేస్తున్నారని.. ఈ విషయంలో క్లారిటీ కావాల్సిందేనని ఎంపీ బోస్ పట్టుబడుతున్నారు. ఇప్పటికే ఈ విషయమై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. అయినా పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదని బోస్ అసంతృప్తి చెందుతున్నారు. తన సొంత నియోజకవర్గంలో తన మాట చెల్లుబాటు కావాలంటే.. వచ్చే ఎన్నికల్లో కుమారుడు సూర్యప్రకాశ్ (Pilli Surya Prakash) ను ఎన్నికల బరిలో దింపడం ఒక్కటే మార్గమని భావిస్తున్న బోస్.. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై అనుచరులకు సంకేతాలు పంపుతున్నట్లు చెబుతున్నారు. అంతా ఓకే అనుకుంటే వైసీపీ అభ్యర్థిగా సూర్యప్రకాష్ బరిలో ఉంటారని లేదంటే.. దానికి తగ్గట్లుగా అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని క్లారిటీ ఇస్తున్నారు. ఇప్పటివరకు రామచంద్రాపురానికి 17 సార్లు ఎన్నికలు జరిగితే ఐదు సార్లు ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచారు.

Also Read: టీడీపీకి ఎన్డీయే నుంచి పిలుపొచ్చిందా.. చంద్రబాబు రియాక్షన్ ఏంటి?

ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన రాజశేఖర్ రెడ్డి జయంతి కార్యక్రమంలో చెప్పిన బోస్.. అవసరమైతే వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేస్తాడనే సంకేతాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. 30 శాతం మంది ఓటర్లు పార్టీలకన్నా అభ్యర్థులనే చూస్తున్నారని దానికి తగ్గట్లుగా మనం ట్యూన్ అవ్వాల్సిన అవసరం ఉందని బోస్ చెప్పడం చర్చనీయాంశమైంది. ఎన్నికల బరిలో సూర్యప్రకాష్ ఉంటారని.. శ్రావణ మాసంలో మంచి ముహూర్తం చూసుకుని అధికారకంగా ప్రకటిస్తారని బోస్ అనుచరులు చెబుతున్నారు. అంటే పార్టీ లైన్ దాటైనా సరే తన కుమారుడిని బరిలో దింపడంతోపాటు నియోజకవర్గంలో తన పట్టు నిలుపుకోవాలని చూస్తున్నారు బోస్.

ట్రెండింగ్ వార్తలు