మంత్రి భార్య తీరుపై చంద్రబాబు సీరియస్.. ఉపేక్షించేది లేదని వార్నింగ్

మంత్రితో ఫోన్ లో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆ ఘటనపై వివరణ కోరారు.

Cm Chandrababu Naidu : ఏపీ రవాణశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య పోలీసులతో వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదమైంది. మంత్రి భార్య తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ వ్యవహారం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన మంత్రి రాంప్రసాద్ భార్య తీరుపై సీరియస్ అయ్యారు. పోలీసులతో మంత్రి భార్య హరితా రెడ్డి వ్యవహరించిన తీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసులతో మంత్రి భార్య మాట్లాడిన తీరును చంద్రబాబు తప్పుపట్టారు.

మంత్రితో ఫోన్ లో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆ ఘటనపై వివరణ కోరారు. అధికారులు, ఉద్యోగుల పట్ల గౌరవంగా మసలుకోవాలని సూచించారు. ఇలాంటి వైఖరిని సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. ఈ ఘటన పట్ల విచారం వ్యక్తం చేసిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకుంటానని ముఖ్యమంత్రికి తెలిపారు.

అసలేం జరిగిందంటే..
రవాణ శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య హరితా రెడ్డి ఓ పోలీస్ పై సీరియస్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ”తెల్లారిందా? మీ కోసం మేం ఎదురుచూడాలా? మీకు జీతాలు ప్రభుత్వమే కదా చెల్లిస్తోంది. వైసీపీ వాళ్లు ఏమైనా ఇస్తున్నారా? మీ కోసం అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాం. వెంటనే వెళ్లి కాన్వాయ్ స్టార్ట్ చేయండి” అంటూ పోలీస్ పై మంత్రి భార్య అసహనం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను వైసీపీ సోషల్ మీడియాలో వైరల్ చేసింది. ‘మంత్రి గారి భార్య రాయచోటిలో పోలీసులను బానిసల్లా చూస్తూ వార్నింగ్ ఇచ్చారు’ అని వైసీపీ ట్వీట్ చేసింది. మంత్రి భార్య తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారితో మాట్లాడేది ఇలానేనా? అని మండిపడుతున్నారు.

అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఈ ఘటన జరిగింది. మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరితా రెడ్డి పెన్షన్ల పంపిణీకి బయలు దేరారు. ఈ క్రమంలో ఆలస్యంగా ఎందుకు వచ్చావంటూ.. పోలీస్ పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : వాళ్లకి.. జగన్ లాంటి నాయకుడే కరెక్ట్..!- పవన్ కల్యాణ్ హాట్ కామెంట్స్

ట్రెండింగ్ వార్తలు