Kuppam Municipal Election: అధికార, ప్రతిపక్షాల ఎత్తుగడలు.. హీట్ పెంచేస్తున్న కుప్పం!

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పం మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడు రాష్ట్రంలో మరోసారి ఎన్నికల వేడిని పెంచేస్తున్నాయి. పేరుకు ఇది ఒక్క..

Kuppam Municipal Election: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పం మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడు రాష్ట్రంలో మరోసారి ఎన్నికల వేడిని పెంచేస్తున్నాయి. పేరుకు ఇది ఒక్క మున్సిపల్ ఎన్నికే అయినా.. నియోజకవర్గం మొత్తాన్ని తనవైపు తిప్పుకుంది. ఈ ఎన్నికలలో ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రకాశ్‌ను సొంత పార్టీ నేతలే కిడ్నాప్‌ చేశారంటూ ఆయన సోదరుడు ఫిర్యాదు చేయడం ఒక్కసారిగా కలకలం రేపింది.

అయితే, ప్రకాష్ సోదరుడు కిడ్నాప్ ప్రకటన అనంతరం తానేమీ కిడ్నాప్ కాలేదని ప్రకాశ్‌ స్వయంగా ప్రకటించడం ఎన్నికల వేడిని రాజేసింది. కుప్పం మున్సిపాలిటీలో 14వ వార్డు నుంచి వెంకటేశ్‌, ప్రకాశ్‌ టీడీపీ అభ్యర్థులుగా నామినేషన్‌ దాఖలు చేయగా.. వెంకటేశ్‌ నామినేషన్ తిరస్కరణకు గురైంది. అనంతరం ఆదివారం ప్రకాశ్‌ అన్న గోవిందరాజు.. తన తమ్ముడు​తోపాటు కుటుంబ సభ్యులను టీడీపీ నేతలు కిడ్నాప్‌ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అంతకు ముందే నామినేషన్ వేసేందుకు వెళ్తున్న వారిపై దాడి చేసి పత్రాలను చించేసిన ఘటనల నేపథ్యంలో గోవిందరాజు చేసిన కిడ్నాప్ ఆరోపణలు సంచలనంగా మారాయి.

అయితే.. ఉదయం గోవిందరాజు ఫిర్యాదు చేయగా సాయంత్రం తాము కిడ్నాప్‌నకు గురికాలేదంటూ ప్రకాశ్‌ కుటుంబ సభ్యులు వీడియో విడుదల చేయడంతో ఇది మరో కొత్త మలుపు తీసుకుంది. కాగా, ఇదంతా అధికార వైసీపీ రాజకీయ ఎత్తుగడలో భాగమని టీడీపీ నేత, మాజీ మంత్రి అమర్నాథ్‌రెడ్డి మండిపడ్డారు. తమ పార్టీ అభ్యర్థుల కుటుంబ సభ్యులను అడ్డు పెట్టుకొని తప్పుడు కేసులు బనాయించి అక్రమంగా గెలిచేందుకు వైసీపీ యత్నిస్తోందని ఆరోపించారు. దీనికి తోడు జిల్లా స్థాయి స్థానిక నేతలంతా ఇక్కడే మకాం వేసి పావులు కదుపుతుండడంతో కుప్పం మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ కోణాన్ని తనవైపుకు తిప్పుకుంది.

ట్రెండింగ్ వార్తలు