Tripura Civic Polls Results : త్రిపుర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్..టీఎంసీ,సీపీఎంకు షాక్

త్రిపుర పురపాలక ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుభి మోగించింది. బీజేపీకి తామే ధీటైన ప్రత్యర్ధులమంటూ బరిలోకి దిగిన తృణమూల్ కాంగ్రెస్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

Tripura Civic Polls Results త్రిపుర పురపాలక ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుభి మోగించింది. బీజేపీకి తామే ధీటైన ప్రత్యర్ధులమంటూ బరిలోకి దిగిన తృణమూల్ కాంగ్రెస్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అగర్తల మునిసిపల్‌ కార్పోరేషన్‌ సహా 14 పట్టణ సంస్థలకు(Urban Bodies) నవంబర్-15న ఎన్నికలు జరగ్గా..వాటి ఫలితాలు ఆదివారం(నవంబర్-28,2021) విడుదలయ్యాయి.

అగర్తలా మున్సిపల్ కార్పొరేషన్(AMC)తో పాటు 11 పురపాలికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 14 పట్టణ సంస్థల్లోని 222 స్థానాలకు ఎన్నికలు జరుగ్గా..217 సీట్లలో బీజేపీ విజయం సాధించింది. అగర్తాలా మున్సిపల్ కార్పొరేషన్(AMC) లో అయితే విపక్షం లేకపోవడం ఇదే తొలిసారి. 51 సభ్యులున్న ఏఎంసీలో బీజేపీ క్లీన్ స్వీప్ చేయగా..తృణముల్ కాంగ్రెస్, సీపీఎం ఖాతా కూడా తెరవలేక పోయాయి.

ఇక,గత పురపాలిక ఎన్నికలలో అన్ని పట్టణ బాడీలలో గెలిచిన సీపీఐ(ఎం) ఈసారి భారీ ఓటమిని చవిచూసింది. కేవలం మూడు సీట్లలో మాత్రేమే సీపీఐ(ఎం)విజయం సాధించింది. కైలాషహర్ మున్సిపల్ కౌన్సిల్ లోని ఒక స్థానంలో, అంబాస మున్సిపల్ కౌన్సిల్స్ లోని ఒక స్థానంలో, పానీసాగర్ నగర్ పంచాయితీలోని ఒక స్థానంలో సీపీఐ(ఎం)విజయం సాధించింది.

ఇక,అగర్తలా మున్సిపల్ కార్పొరేషనల్ లో బీజేపీ తర్వాత అత్యధిక ఓట్లు సాధించిన తృణముల్ కాంగ్రెస్ పార్టీ.. టీఎంసీ అంబాస నగర పంచాయతీలో ఒక స్థానంలో విజయం సాధించింది. త్రిపుర రాజ వంశస్థుడు ప్రద్యోత్ కిషోర్ నేతృత్వంలోని TIPRA మోతా ఒక స్థానాన్ని గెలుచుకుంది.

తాజా ఫలితాలపై స్పందించిన బీజేపీ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్..రాష్ట్రానికి టీఎంసీ పార్టీ అవసరం లేదని తాజా ఫలితాలు స్పష్టం చేస్తున్నాయన్నారు. ఇక్కడి ప్రజలకు కాషాయపార్టీ పైనే విశ్వాసం ఉందని చెప్పారు. బీజేపీతో త్రిపుర ప్రజలకు ఉన్న బంధం చాలా బలమైనదని వ్యాఖ్యానించారు. కిరాయి వ్యక్తులతో త్రిపురలో ప్రచారం చేశారని టీఎంసీని విమర్శించారు. బీజేపీ తన అభ్యర్థులను నిలబెట్టకపోతే తప్ప టీఎంసీ ఇక్కడ ఖాతా తెరవదని ఎద్దేవా చేశారు.

మరోవైపు, టీఎంసీ మాత్రం ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేసింది. సీపీఎంను వెనక్కి నెట్టి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించే అవకాశాలు తమ పార్టీకి ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేసింది. తాజా ఫలితాలు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలను సూచిస్తున్నాయని టీఎంసీ బంగాల్ కార్యదర్శి కునాల్ ఘోష్ పేర్కొన్నారు. అనేక సీట్లలో పార్టీ రెండో స్థానంలో నిలిచిందని చెప్పారు.

ALSO READ Padutha Theeyaga: బాలు మానస పుత్రిక.. వారసుడే నాయకుడై.. మళ్ళీ సరికొత్తగా!

ట్రెండింగ్ వార్తలు