Kuchadi Srihari Rao : బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లోకి సీఎం కేసీఆర్ అత్యంత సన్నిహితుడు.. మోసం చేశారని ఆవేదన

Kuchadi Srihari Rao : ఇంద్రకరణ్ రెడ్డి కోసం టికెట్ త్యాగం చేస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తానని మోసం చేశారని శ్రీహరి రావ్ ఆవేదన వ్యక్తం చేశారు.

Kuchadi Srihari Rao

Kuchadi Srihari Rao : నిర్మల్ జిల్లాలో అధికార బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. సీఎం కేసీఆర్ అత్యంత సన్నిహితుడు, సీనియర్ నేత శ్రీహరి రావ్.. బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. పార్టీకి ఆయన రాజీనామా చేశారు. కార్యకర్తలు, అభిమానులతో సమావేశం అనంతరం శ్రీహరి రావ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

నిర్మల్ లో పార్టీ పరిస్థితి గురించి అధిష్టానానికి ఎన్నిసార్లు చెప్పినా అధిష్టానం పెడచెవిన పెట్టిందని శ్రీహరి రావ్ వాపోయారు. చారిత్రక తప్పిదం జరగొద్దని ఏడాదిగా మౌనంగానే ఉన్నట్లు తెలిపారు. కాంగ్రెస్ లో చేరాలని అభిమానులు సూచించారని అన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను బలపర్చాల్సి ఉందన్నారు.

ఉద్యమకారులకు పదవులు ఇవ్వాలని సూచిస్తే.. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టించుకోలేదని శ్రీహరి రావ్ ఆరోపించారు. నాకు సమాచారం ఇవ్వకుండా నా సొంత ఊరిలో కార్యక్రమాలు నిర్వహించారని మండిపడ్డారు. పాత టీఆర్ఎస్ కార్యకర్తలు, ఉద్యమకారులను ఇంద్రకరణ్ రెడ్డి కలుపుకొని పోలేదన్నారు.

Also Read..Jagtial Constituency: జగిత్యాలలో ఏ పార్టీ నుంచి ఎవరెవరు పోటీకి దిగుతున్నారు.. పార్టీలు వేస్తున్న లెక్కలేంటి?

టీఆర్ఎస్ నిర్మాణంలో 2007 నుండి తాను చాలా కష్టపడ్డానని శ్రీహరి రావ్ పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు పెద్ద నాయకులు పార్టీలో చేరేలా ఎంతో కృషి చేశానని అన్నారు. 2018లో ఇంద్రకరణ్ రెడ్డి కోసం టికెట్ త్యాగం చేస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తానని మోసం చేశారని శ్రీహరి రావ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంద్రకరణ్ రెడ్డి చాలామంది ఉద్యమకారులను అవమానపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ లో చేరే తేదీని త్వరలోనే ప్రకటిస్తానని శ్రీహరి రావ్ తెలిపారు. రాజకీయాలను పవిత్రంగా భావించే తాను ఏదో ఆశించి పాలిటిక్స్ లోకి రాలేదన్నారు శ్రీహరి రావ్. ఆత్మాభిమానం చంపుకుని కేసీఆర్, కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డిని అడిగితే మంచి పదవి ఇచ్చేవారన్నారు. కానీ, తాను అలా చేయలేదన్నారు.

Also Read..Telangana Politics : తెలంగాణ అడ్డాలో బీఆర్‌ఎస్ పార్టీని ఢీకొట్టే మొనగాడు ఎవరు.. అనూహ్యంగా పుంజుకున్న కాంగ్రెస్.. కొత్త టీంతో బీజేపీ?

ఉద్యమకారులకు కనీసం మార్కెట్ కమిటీ, పార్టీ మండల అధ్యక్ష పదవులు కూడా ఇవ్వరా? అని నిలదీశారు. 2018లో పార్టీ టికెట్ వదులుకొని తప్పుడు నిర్ణయం తీసుకున్నానని చాలామంది చెప్పారని శ్రీహరి రావ్ గుర్తు చేశారు. ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇవ్వడం వల్లే టికెట్ ను త్యాగం చేశానని వివరించారు.

”ఉద్యమంలో ముందుడి పోరాటం చేశా. కానీ, రాష్ట్ర ఏర్పాటు తర్వాత సరైన గుర్తింపు రాలేదు. రెండుసార్లు గెలిచి బీఆర్ఎస్ ప్రజలను వంచించింది. ఇలాంటి మోసాలు చూడటం ఇష్టంలేకనే బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నా. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలి” అని శ్రీధర్ రావ్ ఆకాంక్షించారు.

తెలంగాణ ఉద్యమకారుడు అయిన కూచాడి శ్రీహరి రావ్ కి సీఎం కేసీఆర్ కు సన్నిహితుడిగా పేరుంది. అలాంటి వ్యక్తి కాంగ్రెస్ లో వెళ్లనుండటం.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు