Election Results : యూపీలో బీపీ.. గెలుపెవరిది..?

ఒకవేళ యూపీలో ప్రతికూల ఫలితాలు వస్తే.. రాష్ట్రపతి ఎన్నికలో బీజేపీ తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది.

5 States Election Results : దేశమంతా ఎదురుచూస్తున్న టైమ్ రానే వచ్చింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల విడుదలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ శాసనసభ ఎన్నికల ఫలితాల ప్రక్రియ కాసేపట్లో ప్రారంభం కానుంది. బాక్సుల్లో దాగిన అభ్యర్థుల భవితవ్యం తేలిపోయే సమయం వచ్చేసింది.

నరాలు తెగే ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడబోతోంది. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న ఈ ఎన్నికల ఫలితాల్లో ఒక్కో నిమిషం గడుస్తున్నకొద్దీ.. అభ్యర్థుల గుండెల్లో గంటలు మోగుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా? లేదంటే ఓటర్ షాకిచ్చాడా అన్న టెన్షన్ మొదలైంది.

Read This : Election Results : ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజమవుతాయా..?

ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి అన్ని రాష్ట్రాల్లోనూ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏ రాష్ట్రంలో ఎవరిది ఆధిపత్యం అన్నదానిపై మధ్యాహ్యానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

అయితే.. అందరి కళ్లు దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ మీదే ఉన్నప్పటికీ.. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టబోతున్నారు? ఎవరికి షాక్ ఇవ్వబోతున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రాల్లో తన పట్టు నిలబెట్టుకుంటుందా? లేదంటే ప్రతిపక్షం అధికారంలోకి వస్తుందా అని ప్రజలు ఎదురు చూస్తుంటే.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతుయా? లేక తారుమారు అవుతాయా అని అన్ని పార్టీల అభ్యర్థులు టెన్షన్‌ పడుతున్నారు.

2024లో జరిగే లోక్ సభ ఎన్నికలకు.. ఈ ఐదు రాష్ట్రాల ఫలితాలను సెమీఫైనల్‌గా భావిస్తుండటంతో.. ఇవాళ్టి రిజల్ట్స్ ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఈ ఫలితాలు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులనే కాదు.. ఈ ఏడాదిలో జరిగే రాష్ట్రపతి ఎన్నికలోనూ కీలకపాత్ర పోషించనున్నాయి.

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీ కాలం జులై 24తో ముగియనుంది. దీంతో కొత్త రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయాల్సి ఉంది. ఇందులో అతిపెద్ద రాష్ట్రమైన యూపీ.. కీలక భూమిక పోషించబోతోంది. ఈ రాష్ట్రం నుంచి ఎన్నికైన ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ 208. జనాభా పరంగా అతిపెద్ద రాష్ట్రమైన యూపీ ఎమ్మెల్యే ఓటు విలువ దేశంలోనే అత్యధికం.

ఇప్పటికైతే తమ అభ్యర్థిని రాష్ట్రపతి భవన్‌కు పంపించడానికి అధికార బీజేపీకి ఎలాంటి ఇబ్బందీ లేనప్పటికీ.. యూపీలో ప్రతికూల ఫలితాలు వస్తే ఆ పార్టీకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. దీంతో తెలంగాణలో టీఆర్ఎస్‌, ఏపీలో వైసీపీ, ఒడిశాలో బిజూ జనతా దళ్‌.. రాష్ట్రపతి ఎన్నికలో కీలకం కానున్నాయి. ఈ మూడు పార్టీలు ప్రస్తుతం ఏ కూటమిలోనూ చేరకుండా తటస్థంగా ఉన్నాయి. ఒకవేళ యూపీ ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురైతే.. బీజేపీ ఈ పార్టీల మద్దతు కూడగట్టాల్సి ఉంటుంది.

మరోవైపు.. మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చాక అకాలీదళ్‌, శివసేన లాంటి మిత్రులు దూరమయ్యారు. కూటమిలో లేనప్పటికీ సన్నిహితంగా మెలిగిన కొన్ని పార్టీలు సైతం కమలం పార్టీని దూరం పెట్టాయి. ఈ పరిస్థితుల్లో ఎన్డీయే తన అభ్యర్థిని రాష్ట్రపతిగా నెగ్గించుకోవాలంటే మిత్ర పక్షాలతో పాటు సన్నిహితంగా మెలిగే పార్టీలను కలుపుకోవడం ముఖ్యం.

ఒకవేళ యూపీలో ప్రతికూల ఫలితాలు వస్తే.. రాష్ట్రపతి ఎన్నికలో బీజేపీ తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు