Andheri East Bypoll: మహారాష్ట్రలో కొత్త రాజకీయం.. ఉద్ధవ్ థాకరేకు షిండే, ఫడ్నవీస్ మద్దతు!

ఉపఎన్నిక ఏకగ్రీవానికి ఏక్‌నాథ్ షిండే కూడా సుముఖంగా ఉన్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈనెల 17వ తేదీ సోమవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో రాజ్ థాకరే విజ్ఞప్తిని పురస్కరించుకుని బీజేపీ తమ అభ్యర్థిని ఉపసంహరించుకునే అవకాశాలున్నాయని చెబుతున్నారు. కారణాలు ఏవైనా.. కొద్ది రోజులుగా ఉద్ధవ్‭ను దెబ్బ మీద దెబ్బ కొడుతూ వచ్చిన షిండే, ఫడ్నవీస్‭లు అంధేరీ ఈస్ట్ ఉప ఎన్నికలో మాత్రం మద్దతు ఇస్తుండడం గమనార్హం.

Andheri East Bypoll: మహారాష్ట్రలో కొద్ది రోజులుగా పచ్చగడ్డి మీద నీళ్లు చల్లినా నిప్పులే కక్కుతోంది. ఒకవైపు ఉద్ధవ్ థాకరే.. మరొకవైపు ఏక్‭నాథ్ షిండే, బీజేపీ. విమర్శలు ప్రతి విమర్శలు, ఎత్తులు-పై ఎత్తులు.. అక్కడక్కడా చెదురుముదురు దాడులతో రాష్ట్రం నిప్పుల కుంపటి మీదే ఉంటోంది. సందు దొరికితే ఎవరిని ఇరుకున పెడదామన్న రాజకీయమే రాజ్యమేలుతోంది. అలాంటిది ఒక్కసారిగా రాజకీయం కొత్త రూపును తీసుకుంది. ఉన్నట్టుండి ఉద్ధవ్ థాకరేకు ఏక్‭నాథ్ షిండే నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ నుంచి మద్దతు లభిస్తోంది.

ముంబైలోని అంధేరి ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ బరిలో ఏక్‌నాథ్ షిండే వర్గంతో కలిసి ఉమ్మడి అభ్యర్థిని పోటీకి దింపింది బీజేపీ. అయితే తాజాగా ఆ అభ్యర్థిని పోటీ నుంచి తప్పించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అంథేరి నియోజకవర్గంలో రుతుజ లట్కే పోటీ చేస్తున్నందున ఆమెకు పోటీగా బీజేపీ అభ్యర్థిని బరిలోకి దింపవద్దని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌‭ను కోరుతూ మహారాష్ట్ర నవ్‌నిర్మాణ్ సేన చీఫ్ రాజ్ థాకరే తాజాగా ఒక లేఖ రాశారు. దివంగత ఎమ్మెల్యే రమేష్ లట్కే భార్య రుతుజ లట్కే పోటీలో ఉన్నందున, ఆ నేతకు నివాళిగా ఆమెపై ఎవరినీ పోటీలోకి దింపవద్దని ఫడ్నవిస్‌ను ఆ లేఖలో రాజ్ థాకరే కోరారు. ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని శివసేన పార్టీ తరఫున రుతుజ లట్కే పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

ఇకపోతే, అంథేరీ ఈస్ట్ ఉపఎన్నిక ఏకగ్రీవానికి ఏక్‌నాథ్ షిండే కూడా సుముఖంగా ఉన్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈనెల 17వ తేదీ సోమవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో రాజ్ థాకరే విజ్ఞప్తిని పురస్కరించుకుని బీజేపీ తమ అభ్యర్థిని ఉపసంహరించుకునే అవకాశాలున్నాయని చెబుతున్నారు. కారణాలు ఏవైనా.. కొద్ది రోజులుగా ఉద్ధవ్‭ను దెబ్బ మీద దెబ్బ కొడుతూ వచ్చిన షిండే, ఫడ్నవీస్‭లు అంధేరీ ఈస్ట్ ఉప ఎన్నికలో మాత్రం మద్దతు ఇస్తుండడం గమనార్హం.

Shaukat Ali: ఒకర్నే పెళ్లి చేసుకుంటారు, కానీ ముగ్గురితో సంబంధం ఉంటుంది.. హిందువులను ఉద్దేశించి ఎంఐఎం నేత వివాదాస్పద వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు