Jana Reddy: మళ్లీ రేసులోకి జానారెడ్డి.. సీఎం పీఠంపైనే పెద్దాయన గురి!

పెద్దాయ‌న ఇలా మాట మార్చడం వెన‌క పెద్ద వ్యూహ‌మే ఉంద‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. పార్టీ ఊపు మీద ఉందని సర్వేలు చెబుతుండటం.. ఈ సారి అధికారంలోకి వ‌స్తుంద‌న‌నే ఆశ‌లు క‌ల‌గ‌డంతో జానారెడ్డి మ‌న‌సు మారింద‌నీ వ్యాఖ్యానిస్తున్నాయి గాంధీభవన్‌ వర్గాలు.

congress senior leader jana reddy likely to contest assembly

Congress Leader Jana Reddy: మళ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయనని నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల తర్వాత ప్రమాణం చేసిన సీనియర్‌ నేత జానారెడ్డి.. ఓట్టు తీసి గట్టు మీద పెట్టాలని అనుకుంటున్నారట. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్న జానారెడ్డి.. ముఖ్యమైన పదవిపై గురిపెట్టి ఎన్నికల్లో పోటీపై సమాలోచనలు జరుపుతున్నారు. గతంలో పోటీచేయనని చెప్పిన పెద్దాయన.. ఇప్పుడు అధిష్టానమే తనను పోటీ చేయమని బలవంత పెడుతోందని చెప్పడం.. టార్గెట్‌ కూడా భారీగా ఉండటంతో కాంగ్రెస్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది..

కాంగ్రెస్ పార్టీలో సీనియర్‌ నేత జానారెడ్డి అంటే పెద్దరికం.. హుందాతనం అంటారు. వివాదాలు.. వర్గాలకు అతీతంగా నడుచుకునే జానారెడ్డి అంటే రాష్ట్ర కాంగ్రెస్‌లో ఎంతో గౌరవం.. ఢిల్లీ పెద్దలు సైతం జానారెడ్డి మాట‌కు విలువిస్తారు. ఆయన మాటంటే మాటేనంటూ అందరికీ ఎంతో నమ్మకం.. కాంగ్రెస్‌లో కచ్చితమైన మాటకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా గుర్తింపు పొందిన జానారెడ్డి ఈ మధ్య మాట మారుస్తున్నారనే టాక్‌ వినిపిస్తోంది. నాగార్జున‌సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు జానారెడ్డి.

అప్పటి నుంచి కాంగ్రెస్‌ పాలిటిక్స్‌తోసహా రాజకీయంగా అంటీముట్టన‌ట్లుగా వ్యవ‌హ‌రిస్తూ వ‌చ్చారు జానారెడ్డి. కానీ, రేవంత్‌రెడ్డిని పీసీసీ చీఫ్‌గా నియమించినప్పట్నుంచి కాంగ్రెస్‌ రాజకీయాల్లో తిరిగి యాక్టివ్‌ అయ్యారు జానారెడ్డి. పార్టీలో రేవంత్ ఇబ్బందుల్లో ప‌డిన‌ ప్రతిసారి వెనకేసుకొచ్చేవారు. సీనియ‌ర్ల మ‌ధ్య వ‌చ్చే భేదాభిప్రాయాలను చక్కదిద్ది పెద్దన్న పాత్ర పోషించేవారు. పార్టీ వ్యవహారాల్లో యాక్టివ్‌గా ఉన్నా.. ఎన్నిక‌ల్లో పోటీ విష‌యంలో మాత్రం విముఖతే వ్యక్తం చేసేవారు. ఆఖ‌రికి టికెట్ కోసం ద‌ర‌ఖాస్తు కూడా చేసుకోలేదు. త‌న ఇద్దరు కుమారుల‌తో పోటీ చేయించాలని నిర్ణయించి రెండు నియోజకవర్గాలకు టికెట్లు ఇవ్వాలని దరఖాస్తు చేయించారు.

జానారెడ్డి చిన్న కుమారుడు జైవీర్ రెడ్డిని నాగార్జున‌సాగ‌ర్ నుంచి.. పెద్ద కుమారుడు ర‌ఘువీర్‌రెడ్డి మిర్యాల‌గూడ నుంచి పోటీ చేయించాల‌ని భావించారు. ఈ విష‌యంలోనే ఢిల్లీ పార్టీ పెద్దల‌తో మంతనాలు చేశారు. ఏఐసీసీ నేత‌ల‌తో సంప్రదింపుల త‌ర్వాత ఢిల్లీలో తాను న‌ల్లగొండ పార్లమెంట్‌కు పోటీ చేస్తాన‌ని.. త‌న కుమారుల్లో ఒక‌రు నాగార్జున‌సాగ‌ర్ నుంచి పోటీ చేస్తార‌ని చెప్పారు. కానీ ఢిల్లీ నుంచి హైద‌రాబాద్.. ఆ త‌ర్వాత సాగ‌ర్వె ళ్లాక జానారెడ్డి మ‌నసు మారింద‌ట‌. సాగ‌ర్ నుంచి తననే పోటీ చేయమని అధిష్టానం పెద్దలు ఒత్తిడి చేస్తున్నారని అనుచరులతో చెబుతున్నారు జానారెడ్డి.. ఇన్నాళ్లూ పోటీకి ససేమిరా అన్న పెద్దాయ‌న యూటర్న్‌ తీసుకోవడంపై కాంగ్రెస్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Also Read: తండ్రి కోసం ఎమ్మెల్యే సీటు వదులుకున్న కొడుకు.. ముషిరాబాద్ అసెంబ్లీ బరిలో అంజన్న!

పెద్దాయ‌న ఇలా మాట మార్చడం వెన‌క పెద్ద వ్యూహ‌మే ఉంద‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. పార్టీ ఊపు మీద ఉందని సర్వేలు చెబుతుండటం.. ఈ సారి అధికారంలోకి వ‌స్తుంద‌న‌నే ఆశ‌లు క‌ల‌గ‌డంతో జానారెడ్డి మ‌న‌సు మారింద‌నీ వ్యాఖ్యానిస్తున్నాయి గాంధీభవన్‌ వర్గాలు. రాష్ట్రంలో ఎన్నో ప‌ద‌వులు అనుభ‌వించిన జానారెడ్డి ఒక్క ముఖ్యమంత్రి పదవి మాత్రం అందుకోలేకపోయానని త‌ర‌చూ చెబుతుంటారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే ఆ ఒక్క కోరిక తీర్చుకోవాల‌నే ఆశ‌లో ఉవ్విళ్లూరుతున్నారు జానారెడ్డి. పార్టీ అధికారంలోకి వ‌స్తే త‌న‌కు ఛాన్స్ ద‌క్కవ‌చ్చనే ఆలోచ‌న‌తో అసెంబ్లీకి పోటీ చేయాల‌నే తన మ‌న‌సులోని కోరిక‌ను బ‌య‌ట‌పెడుతున్నార‌ని అంటున్నారు. మొత్తానికి ఇన్నాళ్లు పోటీకి నై..నై.. అన్న జానారెడ్డి మళ్లీ రేసులోకి రావడం.. ఏకంగా సీఎం పీఠంపైనే గురిపెట్టడం ఆసక్తి రేపుతోంది.

ట్రెండింగ్ వార్తలు