Yellareddy Constituency: హ్యాండిచ్చిన ఎమ్మెల్యేపై రగిలిపోతోన్న కాంగ్రెస్.. సత్తాచాటాలని చూస్తున్న బీజేపీ

కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఎమ్మెల్యే హ్యాండిచ్చి పార్టీ మారారని... ఆయనపై ప్రతీకారం తీర్చుకోడానికి కాంగ్రెస్ క్యాడర్.. ప్రజలు ఎదురుచూస్తున్నారని అంటున్నారు సుభాశ్‌రెడ్డి.

Yellareddy Assembly Constituency Ground Report

Yellareddy Assembly constituency ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాజకీయం అంతా ఒక ఎత్తు.. ఎల్లారెడ్డి అసెంబ్లీ పాలిటిక్స్ మరో ఎత్తు. విలక్షణ తీర్పుతో ప్రత్యేకత చాటుకునే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఊహించని మలుపులే ఎక్కువ.. కాంగ్రెస్ కంచుకోట అయిన ఈ నియోజకవర్గంలో గులాబీ గుబాళిస్తే.. గత ఎన్నికల్లో మాత్రం హస్తం పార్టీ హవా చూపింది. కానీ, ఆ విజయం మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. గెలిచిన ఎమ్మెల్యే పార్టీకి హ్యాండిచ్చి గులాబీ గూటికి చేరిపోయారు. ఇప్పుడు మరోసారి బీఆర్‌ఎస్ తరఫున పోటీకి రెడీ అవుతున్నారు. హ్యాండిచ్చిన ఎమ్మెల్యేపై ప్రతీకారంతో కాంగ్రెస్ రగిలిపోతోంది.. ఈ రెండు పార్టీల మధ్య బీజేపీ కూడా గట్టిగానే పోరాటం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ముక్కోణ పోటీలో ఈసారి కనిపించబోయే సీనేంటి?

జాజుల సురేందర్ (Photo: Twitter)

ఎల్లరెడ్డి పాలిటిక్స్ హాట్‌హాట్‌గా మారాయి. కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టున్న ఈ సెగ్మెంట్‌లో 2009 నుంచి గులాబీ జెండా రెపరెపలాడుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తిరిగి పట్టు సాధించినా.. ఆ పార్టీ తరపున గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే జాజుల సురేందర్ (Jajala Surender) 2019 పార్లమెంట్ ఎన్నికల ముందు గులాబీ గూటికి చేరారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉంటే 8 స్థానాల్లో బీఆర్ఎస్ విజయబావుట ఎగురవేసింది. కానీ, ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన జాజుల సురేందర్ 35 వేల 148 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డి (Eanugu Ravinder Reddy)పై గెలిచారు. అనంతరం ఈ ఇద్దరూ పార్టీలు మారారు. సురేందర్ గులాబీ గూటికి చేరగా.. రవీందర్ రెడ్డి కారును దిగి కమల దళంలో చేరారు. ఈ సెగ్మెంట్లో కాంగ్రెస్ బలంగా ఉంది. ప్రస్తుతం త్రిముఖ పోరు నడుస్తోంది. ఎవరికి వారే తగ్గేదేలే.. అంటూ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు విస్తృతంగా పర్యటిస్తున్నారు. అధికార పార్టీకి దీటుగా బీజేపీ, కాంగ్రెస్ నేతలు వివిధ సామాజిక సేవా కార్యక్రమాలతో పోటీ పడుతున్నారు.

ఏనుగు రవీందర్ రెడ్డి (Photo: Facebook)

కాంగ్రెస్ నుంచి గెలిచి ప్రస్తుతం టీఆర్ఎస్ తో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే జాజుల సురేందర్ కు మాత్రం రాబోయే ఎన్నికల్లో ఇక్కడ విజయం నల్లేరుపై నడకనే ప్రచారం ఉంది. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఉన్న మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి కొన్ని కారణాలతో బీజేపి తీర్థం పుచ్చుకున్నారు. ఈసారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో తన ఉనికి చాటుకోవాలని ప్రయత్నిస్తున్నారు రవీందర్‌రెడ్డి. కాంగ్రెస్ పార్టీకీ నియోజకవర్గంలో మంచి క్యాడర్ ఉంది. మూడు పార్టీల నుంచి పోటీ తీవ్రంగా ఉండటంతో రాబోయే ఎన్నికలు రసవత్తరంగా జరిగే అవకాశం కనిపిస్తోంది.

మదన్ మోహన్ రావు (Photo: Facebook)

సిట్టింగ్ ఎమ్మెల్యే సురేందర్ కాంగ్రెస్ తరఫున గెలిచి బీఆర్ఎస్ లోకి వెళ్లడంపై కొంత వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని ధీమాగా ఉన్నారు ఎమ్మెల్యే. ఈ సెగ్మెంట్లో కాంగ్రెస్ బలంగా ఉన్నా.. నేతల్లో ఆధిపత్య పోరు క్యాడర్ ను అయోమయానికి గురిచేస్తోంది. కాంగ్రెస్ నేతలు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి (Vaddepally Subhash Reddy), మదన్ మోహన్ వేర్వేరుగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ గ్రూప్ పాలిటిక్స్ కాంగ్రెస్ పుట్టి ముంచేలా ఉన్నాయని క్యాడర్‌లో ఆందోళన వ్యక్తమవుతోంది.

వడ్డేపల్లి సుభాష్ రెడ్డి (Photo: Twitter)

గత ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలైన మదన్ మోహన్ రావు (Madan Mohan Rao) ప్రస్తుతం ఎల్లారెడ్డి కాంగ్రెస్ టిక్కెట్ ఆశిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం ఇక్కడ ఇన్‌చార్జిగా ఉన్న సుభాష్ రెడ్డికి రుచించడంలేదు. టిక్కెట్ కోసం పోటీతో సుభాష్‌రెడ్డి, మదన్ మోహన్ రావుకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ మధ్య అనేక సందర్భాల్లో మదన్ మోహన్, సుభాష్ రెడ్డి వర్గీయులు బాహాబాహీకి దిగిన సంఘటనలు కాంగ్రెస్‌లో పరిస్థితికి అద్దం పడుతున్నాయి. అయితే ఎల్లారెడ్డి వేదికగా పీసీసీ చీఫ్ రేవంత్ నిర్వహించిన సభ సక్సెస్ కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఆశలు రేపుతోంది.

బాణాల లక్ష్మారెడ్డి (Photo: Facebook)

ఈ సెగ్మెంట్లో ప్రస్తుతం త్రిముఖ పోరు కనిపిస్తోంది. టీఆర్ఎస్ లో ఉద్యమకాలం నుంచి ఉన్న మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి ఇప్పుడు బీజేపీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో కమలం పార్టీ తరఫున పోటీచేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈయనకు బాణాల లక్ష్మారెడ్డి (Banala Laxmareddy) నుంచి పోటీ ఉంది. లక్ష్మారెడ్డి గత ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీచేసి ఓటమి చవిచూశారు. కానీ, రవీందర్‌రెడ్డి ఇప్పటికే మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేయడంతో ఆయన అనుభవం మళ్లీ ఎన్నికల్లో పనికొస్తుందనే ఆలోచనలో ఉంది కమలం పార్టీ.

Also Read: ధర్మపురిలో వివేక్ పోటీ చేస్తే ట్రయాంగిల్ ఫైట్.. హీటెక్కుతోన్న ధర్మపురి రాజకీయం!

నియోజకవర్గంలో రెండు లక్షల ఏడు వేల 675 ఓట్లు ఉండగా, మున్నూరుకాపు, రెడ్డి సామాజికవర్గం ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. 8 మండలాల పరిధిలో విస్తరించిన నియోజకవర్గంలో ఇప్పటికే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. మూడు పార్టీల నేతలు ఎన్నికల రణరంగంలో దిగిపోయినట్లే కనిపిస్తున్నారు. ప్రత్యేక వ్యూహాలతో పోటీకి సిద్ధమవుతున్నారు. క్యాడర్‌ను సమాయత్తం చేసుకుంటున్నారు. ఏదిఏమైనా వచ్చే ఎన్నికల్లో తన గెలుపు ఎవరూ ఆపలేరని.. 90 శాతం పనులు పూర్తి చేశానని.. 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసినట్లు ఎమ్మెల్యే సురేందర్ చెబుతున్నారు.

Also Read: బాన్సువాడలో ప్రచారంలోకి దిగిపోయిన పోచారం.. ఆ సెంటిమెంట్ నుంచి గట్టెక్కుతారా?

కాంగ్రెస్ టిక్కెట్ రేసులో ఉన్న సురేందర్ సైతం విజయంపై గట్టి నమ్మకంతో ఉన్నారు. గతంలో కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఎమ్మెల్యే హ్యాండిచ్చి పార్టీ మారారని… ఆయనపై ప్రతీకారం తీర్చుకోడానికి కాంగ్రెస్ క్యాడర్.. ప్రజలు ఎదురుచూస్తున్నారని అంటున్నారు సుభాశ్‌రెడ్డి. ఎల్లారెడ్డిలో ఏలాంటి అభివృద్ధి చేయలేదని.. ఎమ్మెల్యే చేసిన పనులపై శ్వేత పత్రం విడుదల చేయాలని సవాల్ విసురుతున్నారు సుభాశ్‌రెడ్డి. తాడ్వాయిలో భీమేశ్వర ప్రాజెక్టు పనులు అసంపూర్తిగా వదిలేశారని విమర్శిస్తున్నారు. ఇక బీజేపీ కూడా ఈ సారి సత్తాచాటాలని చూస్తోంది. మొత్తానికి ముక్కోణ పోటీలో విజయం ఎవరికి వరిస్తుందోగాని.. ప్రస్తుతానికి అయితే రాజకీయం రసవత్తరంగానే కనిపిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు