The Birthday Boy : ‘ది బర్త్‌డే బాయ్‌’ మూవీ రివ్యూ.. సినిమా చూస్తే బర్త్ డే పార్టీ చేయాలంటే భయపడతారు..

'ది బర్త్‌డే బాయ్‌' సినిమా అమెరికాలో బర్త్ డే పార్టీలో అనుకోకుండా బర్త్ డే బాయ్ చనిపోతే ఏం చేశారు అని సస్పెన్స్ థ్రిల్లర్ కథతో ఆసక్తిగా చూపించారు.

New Suspense Thriller The Birthday Boy Movie Review and Rating

The Birthday Boy Movie Review : ర‌వికృష్ణ‌, స‌మీర్ మ‌ళ్లా, రాజీవ్‌ క‌న‌కాల ముఖ్య‌పాత్ర‌ల్లో పలువురు కొత్తవాళ్లతో తెరకెక్కిన సినిమా ‘ది బర్త్‌డే బాయ్‌’. ఈ సినిమా బొమ్మ బొరుసా బ్యానర్ పై ఐ.భరత్‌ నిర్మాణంలో విస్కీ దాసరి దర్శకత్వంలో తెరకెక్కింది. ది బర్త్‌డే బాయ్‌ సినిమా నేడు జూలై 19న థియేటర్స్ లో రిలీజయింది. ఇప్పటికే పలు ప్రీమియర్ షోలతో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది ఈ సినిమా. అమెరికాలో జరిగిన ఓ రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించినట్టు మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో తెలిపారు.

కథ విషయానికొస్తే.. బాలు(విక్రాంత్), అర్జున్(మణి), వెంకట్(రాజా అశోక్), సాయి(రాహుల్), సత్తి(అరుణ్) అయిదుగురు ఒకే ఊరికి చెందిన ఫ్రెండ్స్ అమెరికాలో ఒకే ఇంట్లో ఉండి చదువుకుంటూ ఉంటారు. బాలు పుట్టిన రోజు నాడు పీకల దాకా తాగి బర్త్ డే బంప్స్ పేరుతో అతనిపై దాడి చేసి శృతిమించిన అల్లరి చేస్తారు. ఈ క్రమంలో అనుకోకుండా బాలు చనిపోతాడు. దీంతో ఏం చేయాలో తెలియక ఆ నలుగురు అమెరికాలో వాళ్ళ దగ్గర్లోనే ఉండే అర్జున్ అన్నయ్య భరత్(రవికృష్ణ)కు ఫోన్ చేసి పిలిపిస్తారు.

అమెరికాలో స్ట్రిక్ట్ రూల్స్, బాడీని ఇండియాకు కూడా తీసుకెళ్ళలేము అని, తెలిస్తే అందరి జీవితను పోతాయి అని ఇండియాలో ఉన్న బాలు పేరెంట్స్ కి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్తారు. అయితే ఆ ఇంటి రెస్పాన్సిబిలిటీ చూసుకుంటున్న ప్రవీణ్(సమీర్ మళ్ల) ఇది అనుకోకుండా జరిగిన దానిలా లేదు మర్డర్ లా ఉందని అనుమానిస్తాడు. అసలు బాలు ఎలా చనిపోయాడు? బాలుది హత్య లేకా అనుకోకుండా బర్త్ డే పార్టీలో జరిగిందా? బాలు పేరెంట్స్ ఏం చేసారు? అసలు బాలు కథేంటి? ప్రవీణ్, భరత్ కలిసి ఆ నలుగురు ఫ్రెండ్స్ ని కాపాడటానికి ఏం చేసారు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Darling : ‘డార్లింగ్’ మూవీ రివ్యూ.. అపరిచితురాలు అయిన భార్యతో భర్త కష్టాలు..

సినిమా విశ్లేషణ.. ఇటీవల బర్త్ డే పార్టీలు, బర్త్ డే బంప్స్ అని శృతిమించి సెలబ్రేషన్స్ చేసుకోవడం, బంప్స్ పేరుతో బర్త్ డే చేసుకునే వాళ్ళని కొట్టడం, ఇబ్బంది పెట్టడం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మనం రోజు చూస్తూనే ఉన్నాం. అయితే అలా శృతిమించిన సెలబ్రేషన్స్ లో బర్త్ డే బాయ్ చనిపోతే, అది కూడా అమెరికాలో జరిగితే ఏం చేసారు అని ది బర్త్‌డే బాయ్‌ ని ఆసక్తిగా తెరకెక్కించారు. మొదటి పావుగంట అమెరికాలో ఫ్రెండ్స్ అల్లరి, బర్త్ డే పార్టీ సాగుతుంది. సినిమా మొదలైన పావుగంటకే బాలు చనిపోవడంతో అసలు కథ మొదలయి తర్వాత ఏం జరుగుతుంది అని సస్పెన్స్ క్రియేట్ చేసారు.

ఇంటర్వెల్ కి ఇది హత్య లేక ఇంకేంటి అనే అనుమానం క్రియేట్ చేసి మరింత ఆసక్తి పెంచారు. మొదట్నుంచి కథ కొత్తగా ఆసక్తిగా సాగుతుంది అనుకునే సమయంలో సెకండ్ హాఫ్ చివర్లో ఓ ఫ్లాష్ బ్యాక్ పెట్టి మళ్ళీ రొటీన్ కథే అనిపిస్తారు. అక్కడ్నుంచి వచ్చే ట్విస్టులు మనం ఊహించేయొచ్చు. అయితే స్ట్రిక్ట్ రూల్స్ ఉండే అమెరికాలో శవాన్ని ఎలా మాయం చేసారు, అసలు భవిష్యత్తులో కూడా వీళ్ళు దొరక్కుండా ఉండేందుకు ఏం చేసారు? బాలు పేరెంట్స్ కి ఏం చెప్పారు అనేది మాత్రం ఆసక్తిగానే చూపించారు.

అయితే అమెరికా కథే అయినా షూటింగ్ మాత్రం అమెరికా లుక్స్ కనపడేలా ఇండియాలోనే తీశారు అని సినిమా చూస్తుంటే అర్థమయిపోతుంది. అమెరికాలో ఓ బర్త్ డే పార్టీలో ఒకరు చనిపోయిన ఇన్సిడెంట్ ని తీసుకొని ఈ సినిమాని తెరకెక్కించామని ప్రమోషన్స్ లో మూవీ యూనిట్ తెలిపారు. అయితే సినిమాలోని సన్నివేశాలు చూస్తే ఇది నిజమేనా అనే అనుమానం కలగక మానదు. నిజంగా జరిగిన ఓ సంఘటనకు కొంచెం కల్పిత కథ జతచేసి తెరకెక్కించారని తెలుస్తుంది.

నటీనటుల పర్ఫార్మెన్స్.. ఈ సినిమాలో నటించిన మెయిన్ పాత్రలు అందరూ కొత్తవాళ్లే. మణి, విక్రాంత్, రాజా ఆశోక్, అరుణ్, రాహుల్.. ఇలా అందరూ చాలా న్యాచురల్ గా నటించారు. రవికృష్ణ, సమీర్ మళ్ల అదరగొట్టారనే చెప్పొచ్చు. రాజీవ్ కనకాల, ప్రమోదిని తమ పాత్రల్లో మెప్పిస్తారు.

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగుంటాయి. అమెరికా సెటప్ ని ఇండియాలోనే సెట్ చేయడానికి ఆర్ట్ డిపార్ట్మెంట్ బాగా కష్టపడ్డారు. ఎమోషనల్ సాంగ్ మాత్రం చాలా బాగుంది. ఇంకో పాట యావరేజ్. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొత్తగా ఇచ్చారు. సింక్ సౌండ్ యూజ్ చేయడంతో ఆడియో పరంగా కూడా న్యాచురాలిటీ ఉంది. ఓ కొత్త కథని తీసుకొని సస్పెన్స్ థ్రిల్లర్ గా కొత్తగా చెప్పడంలో దర్శకుడు విస్కీ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. నిర్మాణ పరంగా కూడా చిన్న సినిమా అయినా కావాల్సినంత బాగానే ఖర్చుపెట్టారు.

మొత్తంగా ‘ది బర్త్‌డే బాయ్‌’ సినిమా అమెరికాలో బర్త్ డే పార్టీలో అనుకోకుండా బర్త్ డే బాయ్ చనిపోతే ఏం చేశారు అని సస్పెన్స్ థ్రిల్లర్ కథతో ఆసక్తిగా చూపించారు. ఈ సినిమాని కచ్చితంగా థియేటర్స్ లో చూడాలి. ఇటీవల బర్త్ డే పార్టీలు అంటూ శృతిమించుతున్న వాళ్ళు కచ్చితంగా ఈ సినిమా చూడాలి. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

ట్రెండింగ్ వార్తలు