Darling : ‘డార్లింగ్’ మూవీ రివ్యూ.. అపరిచితురాలు అయిన భార్యతో భర్త కష్టాలు..

డార్లింగ్ లో అపరిచితురాలు అయిన భార్యతో భర్త ఎలా వేగాడు అనే కథని ఫన్నీగా, ఎమోషనల్ గా చూపించారు.

Priyadarshi Nabha Natesh Darling Movie Review and Rating

Darling Movie Review : ప్రియదర్శి, నభా నటేష్ జంటగా అశ్విన్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా డార్లింగ్. హనుమాన్ సినిమా నిర్మాతలు ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ డార్లింగ్ సినిమాను తెరకెక్కించగా నేడు జులై 19న థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఆల్రెడీ టీజర్, ట్రైలర్స్ తో కథేంటో ఇండైరెక్ట్ గా చెప్పేసి సినిమాపై ఆసక్తిని పెంచారు.

కథ విషయానికొస్తే.. రాఘవ్(ప్రియదర్శి) చిన్నప్పట్నుంచి బాగా చదివి, సంపాదించి మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని హానీమూన్ కి పారిస్ వెళ్లాలని జీవిత లక్ష్యంగా పెట్టుకుంటాడు. ఈ క్రమంలో సైకాలజిస్ట్ నందిని(అనన్య నాగళ్ళ)తో పెళ్లి ఫిక్స్ అయినా పెళ్లి రోజు నందిని ప్రేమించిన అబ్బాయితో వెళ్లిపోవడంతో దీంతో రాఘవ్ చనిపోవాలని డిసైడ్ అయి సూసైడ్ చేసుకోవడానికి వెళ్తే అక్కడ ఆనంది(నభా నటేష్) పరిచయమయి తన ఆలోచనలు మార్చి రాఘవ్ సూసైడ్ చేసుకోకుండా ఆపుతుంది. దీంతో రాఘవ్ ఆనందికి ప్రపోజ్ చేసి వెంటపడి ఆమెని అదే రోజు పెళ్లి చేసుకుంటాడు.

పెళ్లి అయిన మొదటి రాత్రే ఆనందిని ముద్దుపెట్టుకోవడానికి ట్రై చేస్తే చితక్కొడుతుంది. ఆ తర్వాత రోజూ భార్య చేతిలో దెబ్బలు తింటున్న రాఘవ్ నందిని సాయంతో ఆనందికి స్ప్లిట్ పర్సనాలిటీ ఉందని తెలుసుకుంటాడు. అయితే అది పోగొట్టే క్రమంలో ఆనంది సూసైడ్ చేసుకోవాలనుకుంటుంది. కానీ తృటిలో తప్పి హాస్పిటల్ లో చేరగా ఆమెకు మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ ఉందని తెలియడంతో రాఘవ్ మరింత షాక్ అవుతాడు. అసలు ఆనంది ఎవరు? ఆనంది లోపల ఉన్న స్ప్లిట్ పర్సనాలిటీస్ ఎవరు? వాళ్ళు ఎందుకొచ్చారు? రాఘవ్ ప్యారిస్ కల నెరవేరిందా? నందిని రాఘవ్ కి ఎలా సహాయం చేసింది? తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Janhvi Kapoor hospitalised : ఆస్ప‌త్రిలో చేరిన ‘దేవ‌ర’ భామ‌.. ఆందోళ‌న‌లో అభిమానులు..!

సినిమా విశ్లేషణ.. ఆల్రెడీ అపరిచితుడు సినిమాతో స్ప్లిట్ పర్సనాలిటీలు ఒక మనిషిలో ఉంటే ఎలా ఉంటుంది అని సీరియస్ సినిమా మనం చూసాం. డార్లింగ్ సినిమా ట్రైలర్, టీజర్, ప్రమోషన్స్ లోనే ఈ సినిమా మెయిన్ పాయింట్ కూడా అదే అని చూపించేసారు. డార్లింగ్ లో అపరిచితురాలు అయిన భార్యతో భర్త ఎలా వేగాడు అనే కథని ఫన్నీగా, ఎమోషనల్ గా చూపించారు.

ఫస్ట్ హాఫ్ అంతా రాఘవ్ లైఫ్, అతని పారిస్ కల, పెళ్లి పెటాకులవడం, ఆనంది పరిచయం, పెళ్లి, ఆమెలో ఉన్న స్ప్లిట్ పర్సనాలిటీస్ తో రాఘవ్ పడే బాధలతో కామెడీగా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ గా నవ్వుకుంటారు. ఇంటర్వెల్ కి ఆమెలో మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీస్ ఉన్నాయని షాక్ ఇస్తారు. ఇక సెకండ్ హాఫ్ లో ఆమెలో ఉన్న అయిదుగురు స్ప్లిట్ పర్సనాలిటీస్ కలిసి రాఘవ్ కి పెట్టె ఇబ్బందులు, మధ్యలో రాఘవ్ ఫ్యామిలీ.. ఇలా కామెడీగా సాగిస్తూనే తన భార్యని ఎలా అయినా కాపాడుకోవాలని రాఘవ్ పడే తపనని ఎమోషనల్ గా చూపించారు. క్లైమాక్స్ లో ఇంకో ట్విస్ట్ ఇచ్చి మళ్ళీ షాక్ ఇస్తారు. అయితే కామెడీతో ఫుల్ గా ప్రేక్షకులని నవ్వించిన డైరెక్టర్ ఎమోషన్ లో మాత్రం కాస్త తడబడ్డాడు. అలాగే సెకండ్ హాఫ్ లో కొంచెం సాగదీసినట్టు ఉంటుంది.

నటీనటుల పర్ఫార్మెన్స్.. ప్రియదర్శి తన కామెడీ, ఎమోషన్ నటనతో ఇప్పటికే అందర్నీ మెప్పించి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతున్నాడు. ఈ సినిమాలో కూడా భార్య పెట్టే బాధలు భరించే భర్తగా ఫుల్ గా నవ్విస్తూనే పాపం రాఘవ్ అనేలా ఎమోషనల్ గా కూడా మెప్పించాడు. ఈ సినిమాకు నభా నటేష్ చాలా ప్లస్ అయింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాకు హీరో నభా నటేషే. అయిదు స్ప్లిట్ పర్సనాలిటీలతో అయిదుగురిలా మార్చి మార్చి నటించి నభా అదరగొట్టేసింది. యాక్సిడెంట్ తర్వాత కంబ్యాక్ ఇస్తూ ఇంత ఎనర్జిటిక్ సినిమా చేయడం నభా గ్రేట్ అని చెప్పొచ్చు.

ఇక అనన్య నాగళ్ళ సైకాలజిస్ట్ గా బాగానే నటించింది. గెస్ట్ పాత్రల్లో సుహాస్, నిహారిక మెప్పిస్తారు. బ్రహ్మానందం, రఘుబాబు, విష్ణు, కృష్ణ తేజ, మురళి గౌడ్.. ఇలా చాలా మంది నటీనటులు వారి పాత్రల్లో మెప్పిస్తారు.

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. తన మ్యూజిక్ తో ప్రతి సినిమాలోనూ మెప్పించే వివేక్ సాగర్ ఈ సినిమాలో కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో అదరగొట్టాడు. పాటలు మాత్రం యావరేజ్ అనిపిస్తాయి. ఎడిటింగ్ లో సెకండ్ హాఫ్ లో కొంచెం ఎడిట్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. ఇక దర్శకుడిగా తమిళ డైరెక్టర్ అయిన అశ్విన్ రామ్ ప్యూర్ తెలుగు సినిమాతో మెప్పించి సక్సెస్ అయ్యాడు. నిర్మాణ పరంగా కూడా డార్లింగ్ సినిమాని బాగానే ఖర్చుపెట్టి రిచ్ గా తెరకెక్కించారు.

మొత్తంగా డార్లింగ్ సినిమా మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీస్ ఉన్న భార్యతో భర్త ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, వాటి నుంచి ఎలా బయటపడ్డాడు అని ఫుల్ కామెడీతో కొంచెం ఎమోషన్ తో చూపించారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

ట్రెండింగ్ వార్తలు