Pekamedalu : ‘పేకమేడలు’ మూవీ రివ్యూ.. మహిళలు కచ్చితంగా చూడాల్సిన సినిమా..

వినోద్ కిషన్ తెలుగులో హీరోగా పరిచయమవుతూ చేసిన సినిమా పేకమేడలు.

Vinoth Kishan Rakesh Varre Pekamedalu Movie Review and Rating

Pekamedalu Movie Review : తమిళ్ లో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన వినోద్ కిషన్ తెలుగులో హీరోగా పరిచయమవుతూ చేసిన సినిమా పేకమేడలు. నటుడు రాకేష్ వర్రే క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో పేకమేడలు సినిమా తెరకెక్కింది. వినోద్ కిషన్ హీరోగా అనూష కృష్ణ, రితిక శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్.. పలువురు ముఖ్య పాత్రల్లో నటించారు. పేకమేడలు సినిమా నేడు జులై 19న థియేటర్స్ లో రిలీజయింది. ఈ సినిమాకు ప్రమోషన్స్ చాలా కొత్తగా చేశారు.

కథ విషయానికొస్తే.. లక్ష్మణ్(వినోద్ కిషన్) రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా పనిచేస్తూ డబ్బులు రాకపోయినా బాగా సంపాదిస్తాను, రిచ్ లైఫ్ గడపాలి అని కలలు కంటూ భార్య వరాలు(అనూష కృష్ణ) సంపాదనతో బతుకుతూ ఉంటాడు. వరాలు బాగుపడమని, ఏదో ఒక జాబ్ చేయమని ఎన్నిసార్లు చెప్పినా లక్ష్మణ్ పట్టించుకోడు. లక్ష్మణ్ కి ఓ బాగా డబ్బున్న మహిళ శ్వేత(రితిక శ్రీనివాస్) పరిచయం అవ్వడంతో అప్పు చేసి మరీ ఆమె దగ్గర రిచ్ పర్సన్ అని, రియల్ ఎస్టేట్ చేస్తాను అని క్లోజ్ అయి భార్య, పిల్లల్ని పట్టించుకోడు. ఈ విషయం వరాలుకు తెలిసి లక్ష్మణ్ ఇంక మారడు అని వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోతుంది. దీంతో లక్ష్మణ్ ఏం చేసాడు? శ్వేత లక్ష్మణ్ తో ఉంటుందా? వరాలు పుట్టింటి నుంచి తిరిగొచ్చిందా? లక్ష్మణ్ మారాడా తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : The Birthday Boy : ‘ది బర్త్‌డే బాయ్‌’ మూవీ రివ్యూ.. సినిమా చూస్తే బర్త్ డే పార్టీ చేయాలంటే భయపడతారు..

సినిమా విశ్లేషణ.. భర్త కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరుగుతుంటే భార్యే సంసారాన్ని నెట్టుకురావడం గతంలో చాలా సినిమాలో చూశాం. రమ్యకృష్ణ ఆవిడే శ్యామల సినిమాకు ముందు ఆ తర్వాత కూడా ఇలాంటి కథతో బోల్డన్ని సినిమాలు వచ్చాయి. అయితే అన్ని సినిమాల్లో కథనం ఒకటే ఉంటుంది. ఈ పేకమేడలు సినిమాలో మాత్రం కొత్త కథనంతో, కొత్త క్లైమాక్స్ తో మెప్పించారు.

మొదటి హాఫ్ అంతా లక్ష్మణ్, అతని కుటుంబం గురించి, శ్వేత పరిచయం గురించి చూపిస్తారు. ఇంటర్వెల్ సింపుల్ గానే ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ పుట్టింటికి వెళ్లిన వరాలు వస్తుందా? వరాలు, లక్ష్మణ్ మధ్య గొడవలు, వరాలు, లక్ష్మణ్ జీవితాలు ఏమయ్యాయి అని చూపించారు. బస్తీల్లో జరిగే కథగా చాలా రియాలిటీకి దగ్గరగా చూపించారు. కథ పాయింట్ ముందే తెలిసిపోయినా క్లైమాక్స్ మాత్రం ఆశ్చర్యం కలిగించేలా కొత్తగా ట్రై చేశారు. ప్రీ క్లైమాక్స్ లో భార్య భర్తల మధ్య వచ్చే గొడవ సీన్ సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది. ముఖ్యంగా మహిళలను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా తీశారు. మహిళలు ఎలాంటి సపోర్ట్ లేకపోయినా లైఫ్ లో ఎదగాలి అనే పాయింట్ ని దర్శకుడు బలంగా చెప్పాడు.

నటీనటుల పర్ఫార్మెన్స్.. ఇన్నాళ్లు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించిన వినోద్ కిషన్ ఇప్పుడు హీరోగా ఖాళీగా తిరిగే భర్త పాత్రలో అదరగొట్టాడు అని చెప్పొచ్చు. ఇక వరాలు పాత్రలో అనూష కృష్ణ మొదట్నుంచి సైలెంట్ గా ఉండి క్లైమాక్స్ లో శివంగిలా రెచ్చిపోయి నటించింది. డబ్బున్న మహిళ పాత్రలో రితిక శ్రీనివాస్ బాగా నటించింది. జగన్, మురళీధర్ గౌడ్, అనూష, గణేష్, శృతి మెహర్.. మిగిలిన నటీనటులంతా పర్వాలేదనిపించారు.

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగానే ఉన్నాయి. లొకేషన్స్ చాలా న్యాచురల్ గా కథకు తగ్గట్టు పర్ఫెక్ట్ గా ఎంచుకున్నారు. పాటలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొత్తగా బాగానే ఉండి. పాత కథే అయినా కొత్త కథనంతో, కొత్త క్లైమాక్స్ తో డైరెక్టర్ నీలగిరి దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. నటుడు రాకేష్ వర్రే నిర్మాతగా సినిమాకు కావాల్సినంత బాగానే ఖర్చుపెట్టాడు.

మొత్తంగా పేకమేడలు సినిమా కుటుంబాన్ని పట్టించుకోకుండా గాల్లో పేకమేడలు కట్టే భర్త వల్ల ఆ కుటుంబం పరిస్థితి ఏమైంది, భార్య ఏం చేసింది అని కొంచెం ఫన్నీగా కొంచెం ఎమోషనల్ గా చూపించారు. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

ట్రెండింగ్ వార్తలు