Sajjala Ramakrishna Reddy : ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడలేదు?- కూటమి నేతలపై సజ్జల పైర్

అధికారంలో ఉన్నాం కనుక అవినీతి చేశాం అంటే ఎలా..? బీజేపీ కూడా కేంద్రంలో అధికారంలో ఉంది అక్కడ కూడా అవినీతి చేశారా..?

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy : టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సభపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. ఏపీలో మూడు పార్టీల కూటమి కొత్తేమీ కాదని, పదేళ్ల క్రితం ఇదే కూటమి అని చెప్పారు. ముగ్గురూ కలిసి ఆరోజు తిరుపతిలో ఆడిన నాటకం.. మళ్ళీ ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ఆనాడు ఇచ్చిన హామీలు గాలికి వదిలేసి ప్రజల్ని మోసం చేశారని మండిపడ్డారు సజ్జల.

”2019లో చంద్రబాబు, పవన్ బీజేపీని తిట్టారు. మోడీని వ్యక్తిత్వ హననం చేశారు చంద్రబాబు. మళ్ళీ అదే చంద్రబాబు మోడీని పొగుడుతున్నారు. ముగ్గురూ కలిసి ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చెయ్యలేదో నిన్నటి మీటింగ్ లో చెప్పాల్సింది. ఎన్డీయే నుండి ఎందుకు విడిపోయారో? మళ్ళీ ఎందుకు కలిశారో చెప్పాల్సింది. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, నిరుద్యోగ భృతి, ఇళ్ళ స్థలాలు వంటివి అమలు చేశారా..? మీరు మీటింగ్స్ పెట్టేది జగన్ ను తిట్టడానికా..? నిన్నటి మీటింగ్ అట్టర్ ప్లాప్ అయ్యింది.

ఆడలేక మద్దెల దరువు అన్నట్టు కూటమి నేతల తీరు ఉంది. మైక్ పని చేయకపొతే పోలీసులు ఏం చేస్తారు..? జనం మధ్యలో మైక్ సిస్టమ్ పెట్టుకోవడం ఏంటి..? మేము భారీ సభలు నిర్వహిస్తున్నాం. మా దగ్గర అలా ఎందుకు జరగడం లేదు..? చిన్న సభను నడపడం చేతకాక పోలీసులపై నెట్టేస్తారా..? ప్రధానికి సన్మానం అంటే శాలువా, పుష్పగుచ్చం తెచ్చుకోలేక పోయారు. జగన్ కి ఓటు వేయవద్దని షర్మిల అంటుంటే.. ఇద్దరూ ఒకటే అని మోడీ అంటున్నారు. ప్రధాని స్థాయి వ్యక్తికి ఆ మాత్రం తెలియదా..?

రాష్ట్ర ప్రజలకు జగన్ ఏంటో.. వైసీపీ ఏంటో తెలుసు.. ప్రధానికి బహిరంగ సభలోనే విశాఖలో స్టీల్ ప్లాంట్ గురించి జగన్ దమ్ముగా అడిగారు. పొత్తులో ఉండి మీరెందుకు ప్రధాని దగ్గర ప్రస్తావించలేకపోయారు…? ప్రత్యేక హోదాతో పాటు మిగిలిన వాటి గురించి ఒక్క మాట చెప్పలేకపోయారు. అధికారంలో ఉన్నాం కనుక అవినీతి చేశాం అంటే ఎలా..? బీజేపీ కూడా కేంద్రంలో అధికారంలో ఉంది అక్కడ కూడా అవినీతి చేశారా..? ” అని సజ్జల ప్రశ్నించారు.

Also Read : ఏపీలో కూటమి ప్రభావం ఎంత? రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోదీ ఇచ్చిన భరోసా ఏంటి? ప్రొ.నాగేశ్వర్ విశ్లేషణ

 

ట్రెండింగ్ వార్తలు