మరో ఛాన్స్ లేనట్లేనా? ఆ ఇద్దరు మహిళా ఎంపీల రాజకీయ భవిష్యత్‌‌పై సందేహాలు

గత ఐదేళ్లలో ఓ వెలుగువెలిగిన ఇద్దరు ఎంపీలు.. ఇకపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? వారిని పార్టీ ఎలా వినియోగించుకుంటుందో చూడాల్సి వుంది.

YSRCP Women MPS

YCP Women MPS : ఇద్దరు మహిళా ఎంపీలు.. ఈసారి ఎమ్మెల్యేలు కావాలని ముచ్చటపడ్డారు. ఒకరికి చాన్స్‌ వచ్చినట్టే వచ్చి చేజారింది.. ఇంకొకరికేమో ఇప్పుడున్న పదవే ఊడిపోయేటట్టుంది. చిన్న వయసులో ఎంపీగా ఎన్నికైన ట్రాక్‌ రికార్డు ఒకరిది అయితే.. పది రూపాయలకే వైద్యం అందించిన చరిత్ర మరొకరిది.. సామాన్యులుగా రాజకీయాల్లోకి వచ్చి.. అసమాన్య విజయం సాధించిన ఆ ఇద్దరు మహిళా ప్రజాప్రతినిధులు ఇప్పుడు అనామకంగా మిగిలిపోతామా? అని మదనపడుతున్నారట.

ఎంపీ మాధవికి.. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దాదాపు లేనట్లే..
అరకు, అనకాపల్లి పార్లమెంట్‌ సభ్యుల రాజకీయ భవిష్యత్‌పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత ఎన్నికల్లో రికార్డు స్థాయి విజయం సాధించిన ఎంపీలు గొడ్డేటి మాధవి, భీశెట్టి సత్యవతి.. ఈ ఎన్నికల నుంచి దాదాపు నిష్క్రమించినట్టేనా? అనే అనుమానాలు ఎక్కువవుతున్నాయి. అరకు ఎంపీ గొడ్డేటి మాధవికి అరకు అసెంబ్లీ సమన్వయకర్తగా నియమించిన వైసీపీ.. స్థానికంగా వ్యతిరేకత రావడంతో మార్చేసింది. ఆమె స్థానంలో పార్లమెంట్‌ సమన్వయకర్తగా పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిని నియమించింది. దీంతో ఎంపీ మాధవి.. ఇటు పార్లమెంట్‌.. అటు అసెంబ్లీకి పోటీ చేసే పరిస్థితి కనిపించడం లేదు. మళ్లీ అనూహ్య మార్పులు చేస్తేగాని ఆమెకు మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దాదాపు లేనట్లేనంటున్నారు.

స్థానిక ఎమ్మెల్యేలలో సమన్వయం చేసుకోలేక..
రాజకీయ కుటుంబమైనా.. సామాన్య జీవితం గడిపిన ఎంపీ మాధవి పొలిటికల్‌ ఎంట్రీ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. చిన్నవయసులో ఎంపీగా పోటీచేసిన మాధవి.. రాజకీయ కురువృద్ధుడు, కేంద్ర మాజీమంత్రి వైరిచర్ల కిశోర్‌ చంద్రదేవ్‌ను ఓడించారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన వైరిచర్ల కిశోర్‌దేవ్‌ను ఓడించిన ఎంపీగా మాధవి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ, ఆమె స్థానిక శాసనసభ్యులతో సమన్వయం చేసుకోలేక వివాదాల్లో కూరుకుపోయారు. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణతో విభేదాలు మాధవికి తలనొప్పిగా మారాయి. అయితే ఈ విభేదాలను చక్కదిద్దాల్సిన పార్టీ.. ఎంపీని అరకు సమన్వయకర్తగా, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిని అరకు ఎంపీ అభ్యర్థిగా నియమించి.. ఇద్దరి మధ్య పంచాయితీకి ఫుల్‌స్టాప్‌ పెట్టింది. ఇక అరకు సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఫాల్గుణకు టికెట్‌ లేదంటూ చెక్‌ పెట్టింది.

Also Read : ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌.. వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యల వెనుక పక్కా ప్లాన్?

ప్రశ్నార్థకంగా ఎంపీ మాధవి రాజకీయ భవిష్యత్‌..
అధిష్టానం అనుగ్రహంతో టికెట్‌ దక్కించుకున్న ఎంపీ మాధవి క్యాడర్‌ను ప్రసన్నం చేసుకోవడంలో మాత్రం విఫలమయ్యారు. నాన్‌లోకల్‌ నినాదంతో అరకులో లీడర్లంతా ఏకమై మాధవి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. పార్టీ సీనియర్‌ నేత వైవీ సుబ్బారెడ్డి సమక్షంలో పంచాయితీ జరిగినా.. స్థానిక నాయకులు వెనక్కి తగ్గకపోవడంతో మాధవిని మార్చేసింది వైసీపీ. ఆమె స్థానంలో హుకుంపేట జడ్‌పీటీసీ సభ్యుడు రాగం మత్స్యలింగంను తీసుకువచ్చింది. దీంతో ఎంపీ మాధవి రాజకీయ భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారింది. రిజర్వడ్‌ నియోజకవర్గాలన్నీ ఫుల్‌ అయిపోవడంతో మాధవికి ఇక ఎక్కడా చాన్స్‌ దక్కే పరిస్థితి కనిపించడం లేదు.

10 రూపాయల డాక్టర్ కు రెండో చాన్స్‌ లేనట్లే..!
ఈ విధంగా అరకు ఎంపీ మాధవి రాజకీయ ప్రయాణానికి ఫుల్‌స్టాప్‌ పడగా, అనకాపల్లి ఎంపీ భీశెట్టి సత్యవతి పొలిటికల్‌ జర్నీ కూడా అర్థాంతరంగా నిలిచిపోయే పరిస్థితే కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. పది రూపాయల డాక్టర్‌గా, లక్ష ప్రసవాలు చేసిన డాక్టరమ్మగా సత్యవతికి అనకాపల్లి ప్రాంతంలో మంచి పేరు ఉంది. ఇదే అర్హతతో ఆమెను గత ఎన్నికల్లో పార్టీలో చేర్చకుని ఎంపీ టికెట్‌ ఇచ్చింది వైసీపీ. తొలి ప్రయత్నంలోనే రికార్డు స్థాయి మెజార్టీతో గెలుపొందిన సత్యవతికి.. రెండో చాన్స్‌ లేనట్లేనన్న టాక్‌ ఎక్కువగా ఉంది. ఈసారి అనకాపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని భావించిన సత్యవతి ఆశలపై నీళ్లుజల్లింది పార్టీ హైకమాండ్‌. సిట్టింగ్‌ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను తప్పించిన పార్టీ.. ఆ స్థానంలో టీడీపీ నుంచి వచ్చిన మలసాల భరత్‌కుమార్‌కు టికెట్‌ ఇచ్చింది.

ఎంపీగా బరిలోకి అమర్నాథ్?
ఇలా అనకాపల్లి అసెంబ్లీకి చేసిన మార్పుతో ఎంపీ సీటు గల్లంతయ్యే పరిస్థితి కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. సీఎం జగన్‌కు సన్నిహితుడైన మంత్రి అమర్‌నాథ్‌కు ప్రత్యామ్నాయం చూపిస్తామని మాటిచ్చినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన గాజువాక, చోడవరం, పెందుర్తి వంటి సెగ్మెంట్లలో ఏదో ఒకటి కేటాయించాలని కోరుతున్నారు. ఐతే గాజువాకకు ఇప్పటికే సమన్వయకర్తను నియమించగా, చోడవరంలో పార్టీకి బలమైన నేత ధర్మశ్రీ ప్రాతినిధ్యం వహిస్తుండటంతో అమర్‌నాథ్‌ను ఎంపీగా బరిలోకి దింపే చాన్స్‌ ఉందంటున్నారు. ఇదే జరిగితే సిట్టింగ్‌ ఎంపీ సత్యవతికి అవకాశం లేనట్లే అంటున్నారు.

Also Read : కృష్ణా జిల్లాలో టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీ.. అభ్యర్థులు వీళ్లే?

ప్రస్తుత రాజకీయ పరిణామాలు పరిశీలిస్తే.. మహిళా ఎంపీలు ఇద్దరి భవిష్యత్‌పై సస్పెన్సే కొనసాగుతోంది. గత ఐదేళ్లలో ఓ వెలుగువెలిగిన ఇద్దరు ఎంపీలు.. ఇకపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? వారిని పార్టీ ఎలా వినియోగించుకుంటుందో చూడాల్సి వుంది.

 

ట్రెండింగ్ వార్తలు