ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌.. వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యల వెనుక పక్కా ప్లాన్?

ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ ఈ దిశగా మరింత రాజకీయం దట్టించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు.

AP Capital Issue

Hyderabad Joint Capital : రాజధాని వివాదం మరో మలుపు తిరుగుతుందా? ఇన్నాళ్లు మూడు రాజధానుల రాగం ఆలపించిన అధికార వైసీపీ.. ఇప్పుడు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను మరికొన్నాళ్లు కొనసాగించాలని కోరుకోవడానికి కారణమేంటి? వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి కామెంట్లను ఎలా చూడాలి? హైదరాబాదే రాజధాని అన్న సెంటిమెంట్‌తో ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారా? రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల ఇష్యూ నడుస్తున్న వేళ.. సుబ్బారెడ్డి వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఈ వివాదం ఎటువంటి మలుపులు తిరగనుంది?

వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలు వెనుక పక్కా ప్లాన్‌?
ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను కొనసాగించాలని వైసీపీ సీనియర్‌ నేత వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. తెలుగు వారి రాజధాని నగరం హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని అన్న విషయం అందరూ మరిచిపోతున్న దశలో.. వైవీ చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. మరికొద్దిరోజుల్లో ఏపీ అసెంబ్లీతోపాటు పార్లమెంట్‌కు ఎన్నికలు జరుగుతాయనగా, వైవీ చేసిన వ్యాఖ్యలు వెనుక పక్కా ప్లాన్‌ ఉందని ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు.

తెరపైకి మూడు రాజధానులు..
2014లో రాష్ట్ర విభజన సమయంలో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. పదేళ్ల పాటు ఏపీ రాజధానిగా హైదరాబాద్‌ నుంచి కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని విభజన చట్టంలో చాలా స్పష్టంగా తెలియజేసింది. ఈ ఏడాది జూన్‌ వరకు ఈ గడువు ఉంది. కానీ, 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం.. 2015లోనే అమరావతిని రాజధానిగా ప్రకటించింది. ఆ తర్వాత కొద్ది నెలల్లోనే హైదరాబాద్‌ నుంచి అమరావతికి మకాం మార్చేసింది. ఇక 2019లో టీడీపీ ప్రభుత్వం గద్దె దిగిన వెంటనే అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూడా అమరావతి స్థానంలో మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఇదే సమయంలో హైదరాబాద్‌ నగరంలో ఉన్న ఏపీ భవనాలను అన్నింటినీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది జగన్‌ సర్కార్‌.

Also Read : నర్సాపురం వైసీపీలో ఆసక్తికర రాజకీయం.. ఏం జరుగుతుందో తెలుసా?

సరిగ్గా ఎన్నికల ముందు ఎందుకిలా?
2019లో తెలంగాణ మంత్రివర్గం కోరిక మేరకు హైదరాబాద్‌పై హక్కులన్నీ వదులుకున్న జగన్‌ సర్కార్‌.. తాజాగా మరికొన్నాళ్లు హైదరాబాద్‌ రాజధానిగా ఉండాలని కోరుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఏపీకి సంబంధించిన ఒక్క కార్యాలయమూ లేదు. గత ఐదేళ్లలో హైదరాబాద్‌పై ఉన్న ఉమ్మడి హక్కును ఎప్పుడూ వినియోగించుకోని వైసీపీ.. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగుతాయనగా, ఏపీలో రాజధాని లేనందున హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కోరడం దుమారం రేపుతోంది.

ఎన్నికల ఎత్తుగడ?
గత ఐదేళ్లుగా అమరావతి రాజధానిపై అనేక వివాదాలు కొనసాగుతున్నాయి. అధికార వికేంద్రీకరణ పేరుతో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించింది. గత రెండేళ్లుగా విశాఖ నుంచి పాలన సాగిస్తామని సీఎం జగన్‌తో సహా మంత్రులు ధర్మాన, బొత్స, గుడివాడ అమర్‌నాథ్‌ వంటివారు చాలా ప్రకటనలు చేశారు. ముఖ్యమంత్రి విశాఖ వచ్చేస్తున్నారని, ముహూర్తం తీసేశామని చెప్పుకొచ్చారు. కానీ, న్యాయ చిక్కులతో అమరావతి దాటి ఒక్క అడుగు కూడా వేయలేకపోయారు. ఇక మరో 60 రోజుల్లో ఎన్నికలు జరుగుతాయనగా, ఇప్పుడు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని తెరపైకి తేవడం కేవలం ఎన్నికల ఎత్తుగడగా అనుమానిస్తున్నారు పరిశీలకులు. తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్‌ కూడా ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

వైసీపీ ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోడానికేనా?
అమరావతి అద్భుతంగా తీర్చిదిద్దుతామంటూ గొప్పలు చెప్పిన టీడీపీ ప్రభుత్వం.. అన్ని వసతులు ఉన్న హైదరాబాద్‌ను వదిలేసి వచ్చేసింది. ఇక ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్‌ కూడా హైదరాబాద్‌పై ఏ హక్కు లేకుండా పూర్తిగా ధారాదత్తం చేసేసింది. ఇప్పుడు ఏపీ గుర్తుగా ఏమీ లేని హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేయాలని ప్రతిపాదన చేయడం విడ్డూరంగా ఉందంటున్నాయి విపక్షాలు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోడానికే ఇటువంటి ప్రతిపాదనలు చేస్తున్నారని ఆరోపించింది బీజేపీ.

కొద్దిరోజుల్లో రాజ్యసభ సభ్యుడు కాబోతున్న వైవీ సుబ్బారెడ్డి.. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వెనుక రాజకీయ వ్యూహామే ఎక్కువగా కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. చంద్రబాబు అమరావతి పేరుతో భ్రమలు కల్పించారని విమర్శించిన వైసీపీ.. అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో అమరావతి అభివృద్ధికి చేసిందేమీ లేదన్న విమర్శలు ఎదుర్కొంటోంది. అంతేకాకుండా మూడు రాజధానుల పేరుతో అమరావతి ప్రాధాన్యాన్ని తగ్గించిందనే ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటోంది. ఇదే సమయంలో మూడు రాజధానులకు తగ్గట్టు ఒక్క అడుగు వేయలేకపోయింది.

ప్రజల్లో సెంటిమెంట్‌ రగిలించాలనే వ్యూహం
మొత్తానికి ఏపీకి రాజధానే లేకుండా చేసిందనే అప్రతిష్ట మూటగట్టుకుంది. ఎన్నికల్లో ఈ దిశగా విమర్శలు వచ్చే పరిస్థితి ఉన్నందున.. హైదరాబాద్‌పై ఏపీకి హక్కు ఉందన్న విషయాన్ని ఎత్తిచూపి.. ప్రజల్లో సెంటిమెంట్‌ రగిలించాలనే వ్యూహం రెడీ చేస్తున్నదని అనుమానిస్తున్నాయి ప్రతిపక్షాలు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాలపై పంచాయితీ నడుస్తోంది. ఇటువంటి తరుణంలో హైదరాబాద్‌ను కూడా వివాదం చేయడం ద్వారా ప్రజల్లో భావోద్వేగం రగిల్చి.. ఓట్లుగా మల్చుకోవాలని చూస్తోందని విపక్షం ఆరోపిస్తోంది. ఇందులో నిజనిజాలు ఎలా ఉన్నా, వైవీ వ్యాఖ్యలను సమర్ధిస్తున్నట్లుగా సీనియర్‌ మంత్రి పెద్దిరెడ్డి కూడా హైదరాబాద్‌ రాజధానిగా ఉంటే మంచిదే అన్నట్లు వ్యాఖ్యలు చేశారు.

ఇవన్నీ పరిశీలిస్తే… ఓ వ్యూహం ప్రకారం హైదరాబాద్‌ కేంద్రంగా రాజకీయం చేయాలనే ఆలోచనకు వైసీపీ వచ్చినట్లు భావిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ ఈ దిశగా మరింత రాజకీయం దట్టించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు.

Also Read : కృష్ణా జిల్లాలో టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీ.. అభ్యర్థులు వీళ్లే?

 

ట్రెండింగ్ వార్తలు