BRS: రాజ్యసభ బరిలో కారు పార్టీ? అసలు బీఆర్ఎస్ స్కెచ్ ఏంటి.. ఈక్వేషన్స్ ఎలా ఉండబోతున్నాయి
రాజకీయాల్లో ఎప్పుడూ ఎవరికి శత్రువులుగా ఉంటారో..ఎవరు మిత్రువులుగా మారుతారో చెప్పలేం. అందుకే క్యాండిడేట్‌ను బరిలోకి దింపితే ఎవరు ఎవరితో కలుస్తారో మరోసారి క్లారిటీ వస్తుందన్న వాదన కూడా ఉందట.
Representative Image (Image Credit To Original Source)
- ఇంట్రెస్టింగ్గా మారిన రాజ్యసభ ఎన్నికల రాజకీయం
- రెండు రాజ్యసభ సీట్లపై ఫుల్ హోప్స్‌తో ఉన్న హస్తం పార్టీ
- బీఆర్ఎస్ రాజ్యసభ బరిలోకి దిగితే సీన్ మారబోతోందా.?
- ఎంఐఎం, బీజేపీ తీరును ఎక్స్పోజ్ చేసే స్కెచ్ వేస్తోందా.?
- జంపింగ్ ఎమ్మెల్యేలను ఇరకాటంలో పెట్టేలా ప్లాన్
BRS: ఖాళీ అయింది రెండు సీట్లు. హస్తం పార్టీ నుంచి ఇద్దరు అభ్యర్థులు. యునానిమస్ అయితే నో ప్రాబ్లమ్. కారు పార్టీ క్యాండిడేట్‌ను బరిలోకి దింపితేనే ఇష్యూ. అయితే గెలుపు ఓటములను పక్కన బెట్టి ఇటు జంపింగ్ ఎమ్మెల్యేలను..అటు ఎంఐఎం, బీజేపీ తీరును ఎక్స్పోజ్ చేసేందుకు దీన్ని వాడుకుంటే ఎలా ఉంటుందన్న చర్చ గులాబీదళంలో జోరుగా సాగుతోందట. సీటు దక్కేంత బలం లేకున్నా రేసులో నిలిచేందుకు కారు పార్టీ ప్లాన్ చేస్తోందన్న ప్రచారం ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ రాజ్యసభ బరిలో నిలవడం ఖాయమా? గులాబీ పార్టీ రంగంలోకి దిగితే ఈక్వేషన్స్ ఎలా ఉండబోతున్నాయి?
తెలంగాణలో రాజ్యసభ సీట్ల ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. రాష్ట్రం నుంచి ఖాళీ అయిన రెండు రాజ్యసభ సీట్లు..ఎమ్మెల్యేల సంఖ్యా బలం ప్రకారం తామే దక్కించుకుంటామని అధికార కాంగ్రెస్ పార్టీ ధీమాతో ఉంది. ఇప్పటికే అభ్యర్థులను కూడా దాదాపు ఖరారు చేసిందని అంటున్నారు. అయితే ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వ్యూహత్మక అడుగులు హాట్ టాపిక్ అవుతున్నాయి. రాజ్యసభ సీటుకు కావాల్సిన బలం లేకున్నా..సరికొత్త ప్లాన్‌కు తెరలేపుతుందట కారు పార్టీ. గెలుపోటముల మాట పక్కన పెడితే పొలిటికల్ ఎక్సపరిమెంట్గా చూస్తోందట కారు పార్టీ.
ప్రస్తుతం తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా ఒక్క రాజ్యసభ సీటు గెలుచుకునేందుకు 41 మంది సభ్యుల మద్దతు కావాలి. ఆ లెక్కన కాంగ్రెస్‌కు సొంతంగా 82 మంది సభ్యులుంటేనే రెండు సీట్లు గెలవడం సాధ్యం. అయితే ఆ పార్టీకి సొంతంగా అంత బలం లేకపోవడంతో పోటీ అంటూ జరిగితే ఎంఐఎం, ఫిరాయింపు ఎమ్మెల్యేల మద్దతు అనివార్యమవుతుంది. ఒకవేళ 8మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు దూరంగా ఉంటే..అప్పుడు ఒక్కో రాజ్యసభ సీటు గెలవాలంటే 38 ఓట్లు అవసరం కానున్నాయి. రెండు రాజ్యసభ స్థానాలకు 76 మంది మద్దతు తెలపాల్సి ఉంటుంది. కాంగ్రెస్‌కు 66 మంది ఎమ్మెల్యేలు ఉండగా..ఏడుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఒక సీపీఐ సభ్యునితో కలిపి 74 మంది అవుతారు.
ఎంఐఎం, కాంగ్రెస్ మధ్య పెరిగిన గ్యాప్..
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎంఐఎం హస్తం పార్టీకి సపోర్ట్ చేస్తుందా లేదా అన్న డైలమా నెలకొంది. ఈ మధ్య ఎంఐఎం, కాంగ్రెస్ మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యనేతలతో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు..ఆ తర్వాత అక్బరుద్దీన్ ఓవైసీ సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి చేసిన కామెంట్స్ తర్వాత దూరం మరింత పెరిగిందన్న గుసగుసలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికల వేళ పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్గా మారాయి. దీంతో కాంగ్రెస్ చేతిలో చెయ్యేసి నడుస్తున్న 9 మంది ఎమ్మెల్యేల మద్దతే కీలకం కానుంది.
అయితే రాజ్యసభ రేసులో నిలిచే విషయంపై బీఆర్ఎస్ పార్టీలో డైలమా కొనసాగుతోందట. కొందరు నేతలు మాత్రం బలం లేకుండా ఎన్నికల బరిలోకి దిగి ఏం లాభమంటుంటే..మరికొందరు మాత్రం ప్రతిపక్షంగా అప్పుడప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరించాలని సజెస్ట్ చేస్తున్నారట. రాజకీయాల్లో ఎప్పుడూ ఎవరికి శత్రువులుగా ఉంటారో..ఎవరు మిత్రువులుగా మారుతారో చెప్పలేం. అందుకే క్యాండిడేట్‌ను బరిలోకి దింపితే ఎవరు ఎవరితో కలుస్తారో మరోసారి క్లారిటీ వస్తుందన్న వాదన కూడా ఉందట.
రికార్డుల ప్రకారం బీఆర్ఎస్ బలం 37గా ఉంది. ఇందులో 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్‌లోకి చేరిపోయారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హస్తం పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. మహిపాల్ రెడ్డిని మినహాయిస్తే మిగతా 9 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీతోనే కొనసాగుతున్నారు. అంటే ప్రస్తుతం బీఆర్ఎస్కు గూడెం మహిపాల్‌రెడ్డితో కలిపి 28 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు.
అయితే 28 మంది ఎమ్మెల్యేలున్న బీఆర్ఎస్ పార్టీ..మైనార్టీ అభ్యర్థిని బరిలోకి దించే ఆలోచన చేస్తుందన్నది ఓ టాక్. మైనార్టీ క్యాండిడేట్‌ను పెడితే..ఎంఐఎం మద్దతు తెలుపుతుందా.? లేక కాంగ్రెస్ వెంట నడుస్తుందా.? అనేది క్లారిటీ రానుంది. ఇక మున్సిపల్ ఎన్నికల తర్వాత బీజేపీలో కుతకుత మొదలైంది. బీఆర్ఎస్, కాంగ్రెస్‌తో కలిసి వైస్ ఛైర్మన్ పదవులను పంచుకోవడం..పలు చోట్ల ఎక్స్ అఫీషియో ఓట్లు అధికార, ప్రధాన ప్రతిపక్షానికి వేయడంపై జాతీయ నాయకత్వం సీరియస్‌గా ఉందని వార్తలు వచ్చాయి. దీంతో రాజ్యసభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఉన్న ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎవరికీ సపోర్ట్ చేయకుండా న్యూట్రల్‌గా ఉండే అవకాశం ఉంది. దీంతో తమకు, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్న క్లారిటీ కూడా ఇచ్చినట్లు అవుతుందన్నది బీఆర్ఎస్ వ్యూహంగా తెలుస్తోంది.
జంపింగ్ ఎమ్మెల్యేలు ఎవరికి ఓటేస్తారో క్లారిటీ..
ఇక జంపింగ్ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేస్తే..వారు ఎవరికి ఓటేస్తారో మరోసారి స్పష్టం కానుందని..వాళ్లను కూడా ఇరకాటంలో పెట్టేలా ప్లాన్ చేస్తోందట బీఆర్ఎస్ పార్టీ. ఒకవేళ ఎంఐఎం సపోర్ట్ చేసినా బీఆర్ఎస్ గెలిచే అవకాశం లేదు. మరో ముగ్గురి మద్దతు అవసరం ఉంటుంది. అయితే పోటీకి దిగితే ఎలా ఉంటుందనే దానిపై బీఆర్ఎస్ పార్టీ చర్చోపచర్చలు జరుపుతోందట. గెలిచే ఛాన్స్ లేకపోయినా..కారు పార్టీ స్ట్రాటజీ ఏంటన్నది మాత్రం తెలంగాణ పాలిటిక్స్ సస్సెన్స్‌గా మారింది.
