E20 Petrol : వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఏప్రిల్1 నుంచి బంకుల్లో E-20 పెట్రోల్ మాత్రమే.. దీనివల్ల మీ వాహనాలకు ఉపయోగం ఏమిటంటే?
E20 Petrol : దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏప్రిల్ 1వ తేదీ నుంచి అన్ని పెట్రోల్ బంకుల్లో 20శాతం వరకు ఇథనాల్ కలిపిన పెట్రోల్ (E20), కనీసం రీసెర్చ్ ఆక్టేన్ నవంబర్ (ఆర్ఓఎన్) 95 కలిగిన ఇంధనాన్ని మాత్రమే విక్రయించాలని కేంద్రం ఆశించింది.
E20 Petrol
E20 Petrol : దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏప్రిల్ 1వ తేదీ నుంచి అన్ని పెట్రోల్ బంకుల్లో 20శాతం వరకు ఇథనాల్ కలిపిన పెట్రోల్ (E20), కనీసం రీసెర్చ్ ఆక్టేన్ నవంబర్ (ఆర్ఓఎన్) 95 కలిగిన ఇంధనాన్ని మాత్రమే విక్రయించాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు చమురు మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే, ప్రత్యేక పరిస్థితుల్లో, కొన్ని నిర్దిష్ట ప్రాంతాలకు పరిమిత కాలంపాటు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చే అధికారం కేంద్రానికి ఉంటుందని స్పష్టం చేసింది. కేంద్రం తాజా నిర్ణయంతో అసలు E20 పెట్రోల్ అంటే ఏమిటి.. దీనివల్ల ప్రస్తుతం మీరు వాడే వాహనాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
E20 పెట్రోల్ అంటే ఏమిటి..?
ఏప్రిల్ 1 నుంచి భారతదేశ ఇంధన స్టేషన్లలో ఈ20 పెట్రోల్ ను మాత్రమే విక్రయిస్తారు. అంటే.. సాధారణ పెట్రోల్ (100శాతం పెట్రోలు) ఇకపై లభించదు. E20 పెట్రోల్‌లో 20శాతం ఇథైల్ ఆల్కహాల్, 80శాతం పెట్రోల్ కలిపి ఉన్న ఒక బ్లెండెడ్ పెట్రోల్. ఇథనాల్ అనేది ప్రధానంగా చెరకు, మొక్కజొన్న, బియ్యం వంటి ధాన్యాల నుండి తయారయ్యే ఆల్కహాల్. ఇది దేశీయంగా ఉత్పత్తి చేయబడుతుంది. స్వచ్ఛమైన పెట్రోల్ కంటే నాణ్యతగా ఉంటుంది. E20ని మొదట ఏప్రిల్ 2023లో ఎంపిక చేసిన అవుట్లెట్లలో ప్రవేశపెట్టారు. ఏప్రిల్ 2025 నుండి, ఇది దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది, చాలా పాత వాహనాలు ఉపయోగించడానికి రూపొందించబడిన E10 (10 శాతం ఇథనాల్) స్థానంలో ఉంది. ఇథనాల్ మిశ్రమం ముడిచమురు దిగుమతులు, కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని ప్రభుత్వం చెబుతోంది. పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ప్రకారం.. పెట్రోల్ ప్రత్యామ్నాయం కారణంగా భారతదేశం 2014-15 నుండి రూ.1.40 ట్రిలియన్లకు పైగా విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేసింది. E20కి మారడం వల్ల గత సంవత్సరం దాదాపు 5 బిలియన్ డాలర్లు ఆదా అయింది. చెరకు, మొక్కజొన్న వంటి పంటలకు డిమాండ్ పెరగడం ద్వారా రైతుల ఆదాయానికి దాదాపు 4.6 బిలియన్ డాలర్లకు పెంచుతుందని భావిస్తున్నారు.
దీని వల్ల ఉపయోగం ఏమిటి?
ఇథనాల్ ను చెరుకు, మొక్కజొన్న, ఇతర ధాన్యాల నుంచి తయారు చేయడం వల్ల దీనిని పునరుత్పాదక ఇంధన వనరు అని పేర్కొనవచ్చు. అంతేకాదు.. ఇది దేశీయంగానే తయారు చేసుకోవచ్చు. ప్రస్తుతం మనం వాడే పెట్రోల్ కంటే ఈ20 పెట్రోల్ తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తుంది. దేశంలో చమురు దిగుమతులు తగ్గించడంతోపాటు.. కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ బ్లెండింగ్ ను తప్పనిసరి చేసింది.
ఆర్ఓఎన్ 95 ఎందుకు కలపాలి?
ఆర్ఓఎన్ (RON) అంటే రీసెర్చ్ ఆక్టేన్ నంబర్. ఇది ఇంధనం ‘ఇంజిన్ నాకింగ్’ను ఎంత వరకు తట్టుకోగలదో తెలియజేస్తుంది. నాకింగ్ అంటే ఇంజిన్ లోపల ఇంధన అసమానంగా మండటం వల్ల వచ్చే శబ్దం, శక్తి కోల్పోవడం, కాలక్రమేణా ఇంజిన్ పాడవ్వడానికి నాకింగ్ అని అన్నారు. అక్టేన్ నంబర్ ఎంత ఎక్కువగా ఉంటే, ఇంధనం అంత స్థిరంగా ఉంటుంది. అంటే.. అధిక ఒత్తిడిలో కూడా ఇంధనం అదుపు తప్పకుండా స్థిరంగా ఉండడమే హై ఆక్టేన్. ఇథనాల్ సహజంగానే అధిక్ ఆక్టేన్ విలువను (సుమారు ఆర్ఓఎన్ 108) కలిగి ఉంటుంది. కనుక పెట్రోల్ లో 20శాతం ఇథనాల్ కలపడం వల్ల ఇంజిన్ నాకింగ్ ను తట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది.
పాత వాహనాల పరిస్థితి ఏమిటి..?
2023 – 25 నుంచి భారతదేశంలో తయారయ్యే చాలా వాహనాలు ఈ20 ఇంధనంతో నడిచేలా రూపొందించబడ్డాయి. దీంతో ఎటువంటి తీవ్రమైన సమస్య ఉండదని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. నివేదికల ప్రకారం.. 2011 నుంచి 2023 వరకు 250 మిలియన్లకుపైగా వాహనాలు అమ్ముడయ్యాయి. వీటిలో 234 మిలియన్లు పెట్రోల్ వాహనాలు. అంటే ఈ వాహనాల్లో ఏవీ ఈ20 ఇంధనానికి సిద్ధంగా లేవు. ఈ234 మిలియన్ వాహనాలు రిస్కులో ఉన్నాయి. అయితే, ఈ వాహనాల విషయంలో ఈ20 పెట్రోలు వాడితే మైలేజీ (3-7శాతం) స్వల్పంగా తగ్గే ఛాన్స్ ఉంటుంది. రబ్బరు, ప్లాస్టిక్ బాగాలు త్వరగా అరిగిపోయే అవకాశం ఉంది. అంతేకాదు.. ఇతర ఇంజిన్ భాగాలు దెబ్బతినవచ్చు. అయితే, గత సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా ఈ20 పెట్రోల్ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఈ5, ఈ10 వాహనాలను తీసేసేందుకు చాలామంది వాహనదారులకు అవకాశం లభించింది.
తరువాత కేంద్ర ప్లాన్ ఏమిటి..?
ప్రభుత్వం ఇప్పుడు అధిక ఇథనాల్ మిశ్రమానికి సిద్ధమవుతోంది. E27 ఇంధనం కోసం నిబంధనలను రూపొందించాలని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్‌ను కోరగా, ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధిక మిశ్రమాలకు అవసరమైన ఇంజిన్ మార్పులను అధ్యయనం చేస్తోంది. డీజిల్‌లో బయోఫ్యూయల్ మిశ్రమాన్ని కూడా అధికారులు అన్వేషిస్తున్నారు, ఇందులో 10 శాతం ఐసోబుటనాల్ మిశ్రమం కూడా ఉంటుంది. ప్రస్తుతానికి ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆర్ఓఎన్ 95తో కూడిన ఈ20 పెట్రోల్ ను దేశంలోని పెట్రోల్ బంకులలోకి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానుంది.
