Kcr : కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే, నేను బతికుండగా అలా జరగనివ్వను- కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

కేంద్రమంత్రి అమిత్ షా దేవుడి ఫొటో పట్టుకొని ప్రచారం చేస్తే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తోంది? 5 నెలల క్రితం రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉండేది? ఇప్పుడెలా తయారైంది?

Kcr : కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే అని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ ఎంపీల గెలుపుతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం అన్నారు కేసీఆర్. మన సింగరేణిని కాపాడుకోవాలంటే మన బిడ్డ ఈశ్వర్ ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు గులాబీ బాస్.

పెద్దపల్లి జిల్లా రామగుండంలో కేసీఆర్ మాట్లాడారు. ”ఎలక్షన్ కమిషన్ విధించిన 48 గంటల నిషేధం తర్వాత మళ్లీ నా గొంతు మాట్లాడుతోంది. చేనేత కార్మికులపై మాట్లాడినందుకు నా గొంతు నొక్కారు. కేసీఆర్ బస్సు యాత్రను నిలువరించేందుకు కక్ష కట్టారు. దిక్కుమాలిన బ్యాన్ ఉన్నందునే మాట్లాడలేకపోయా. కేంద్రమంత్రి అమిత్ షా దేవుడి ఫొటో పట్టుకొని ప్రచారం చేస్తే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తోంది?

5నెలల క్రితం రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉండేది? ఇప్పుడెలా తయారైంది? పెద్ధపల్లి జిల్లాలో 50వేల ఎకరాలు ఎండిపోయిన పరిస్థితి. పదేళ్లలో ఎన్నడూ కూడా విద్యుత్ కోతలు లేవు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీ పథకాలలో ఎన్ని హామీలు అమలయ్యాయి. ఆటో కార్మికులు కదం తొక్కాలి. తులం బంగారం తుస్సు. ముఖ్యమంత్రి ఎక్కడికి వెళితే అక్కడ దేవుడి మీద ఒట్టు అంటున్నారు. 2లక్షల రుణమాఫీ ఏమైంది? ఈ ఎన్నికల్లో ఆగం అవ్వదు. ఆలోచించి ఓటు వెయ్యాలి.

సింగరేణిని ముంచిందే కాంగ్రెస్ పార్టీ. సింగరేణి మన ఆస్తి. 49శాతం వాటాను కేంద్రానికి అప్పజెప్పింది కాంగ్రెస్ పార్టీ. నష్టాల్లో ఉన్న సింగరేణిని తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ. సీపీఐ, సీపీఎం.. ఎందుకు కాంగ్రెస్ కి మద్దతిస్తున్నాయి? కేసీఆర్ బతికుండగా గోదావరి జలాలను తరలించలేరు. రేవంత్ రెడ్డి దావోస్ వెళ్లి చేసిందేమీ లేదు. సింగరేణి బొగ్గు ఉండగా అదానీ కంపెనీ బొగ్గును ఎందుకు కొనుగోలు చేయాలి? తెలంగాణ కొంగు బంగారం సింగరేణి. సింగరేణిని విస్తరించాలి. ముఖ్యమంత్రి రేవంత్.. అదానీ బొగ్గు కొనుగోలు చేస్తే మన సింగరేణి నోట్లో మట్టి కొట్టినట్టే.

మీ గోదావరిఖని కార్మిక బిడ్డ కొప్పుల ఈశ్వర్. ఎన్నికలు వస్తాయి పోతాయి. మన సింగరేణిని కాపాడుకోవాలంటే మన బిడ్డ ఈశ్వర్ ను గెలిపించుకోవాలి. పదేళ్లలో మోదీ సబ్ కా సాత్ సబ్ కా వికాస్ సత్య నాష్ అయింది. కార్మికులు రోడ్డున పడుతున్నారు. అన్ని రంగాలను ప్రైవేట్ పరం చేస్తున్నారు. మత విద్వేషాలను బీజేపీ రెచ్చగొడుతోంది. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతోంది. బీఆర్ఎస్ ఎంపీల గెలుపుతోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపిస్తుంది. మా ప్రభుత్వ హయాంలోనే ముస్లింలు సంతోషంగా ఉన్నారు. దళితులు, మైనార్టీలను కాంగ్రెస్ పార్టీ విస్మరిస్తోంది. ప్రజల దీవెనలతో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి” అని కేసీఆర్ పిలుపునిచ్చారు.

Also Read : రిజర్వేషన్లు కాపాడుకోవాలంటే కాంగ్రెస్ గెలవాలి, రాహుల్ ప్రధాని కావాలి- సీఎం రేవంత్

ట్రెండింగ్ వార్తలు