Nandyala Lok Sabha Constituency : నంద్యాలలో రగులుతున్న రాజకీయం… గతవైభవాన్ని సాధించేదిశగా పావులుకదుపుతున్న తెలుగుదేశం

ఫ్యాక్షన్ గడ్డగా పేరొందిన ఆళ్లగడ్డలో గంగుల బిజేంద్ర రెడ్డి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. పార్టీల సంగతి ఎలా ఉన్నా.. టికెట్‌ ఫైట్ ఇక్కడ ఆసక్తికరంగా కనిపిస్తోంది. ప్రస్తుతం గంగుల ఫ్యామిలీ నుంచి గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా.. గంగుల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు.

Nandyala Lok Sabha Constituency : ఆధ్యాత్మికానికి కేంద్రం.. ప్రశాంతత నిలయం అయిన నంద్యాల పార్లమెంట్‌లో రాజకీయం ఎప్పుడూ రగులుతూనే ఉంటుంది. నంద్యాల ఓటర్ నాడి పట్టుకోవడం అంత ఈజీ కాదు.. పక్క ప్రాంతం వ్యక్తిని పార్లమెంట్‌కు పంపినా.. రాష్ట్రపతిని అందించిన చరిత్ర.. నవనందుల కోట నంద్యాల సొంతం. ఉప ఎన్నికల హోరుతో తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపిన పార్లమెంట్ స్థానం ఇది. అలాంటి నంద్యాల రాజకీయాల్లో ప్రతీ పరిణామం క్లైమాక్స్‌లానే కనిపిస్తోంది. ఇంతకీ నంద్యాల కేంద్రంగా పార్టీల వ్యూహాలు ఏంటి.. వైసీపీ మళ్లీ సత్తా చాటుతుందా.. టీడీపీ గత వైభవాన్ని చాటుకుంటుందా.. ఏ స్థానంలో ఎవరు బరిలోకి దిగబోతున్నారు.. సిట్టింగ్‌ల్లో ఎవరిని పక్కనపెట్టబోతున్నారు.. ఒకప్పటి కంచుకోటలో కాంగ్రెస్‌ పడుతున్న కష్టం ఏంటి.. జనసేనను నంద్యాల ఓటర్లు ఆదరిస్తారా… పార్లమెంట్‌లో ఏడు అసెంబ్లీల్లో సీన్ ఏంటి..

ఫ్యాక్షనిస్టుల గడ్డలో ఫలితం ఎలా ఉండబోతోంది… వైసీపీ దూకుడు మంత్రం ఈసారి ఫలిస్తుందా?
నంద్యాలలో జరిగేది రాజకీయమే కాదు.. అంతకుమించి ! రాయలసీమ రాజసానికి ప్రతీకగా ఇక్కడి విజయాన్ని భావిస్తాయ్‌ అన్నిపార్టీలు. ఆధ్యాత్మిక కేంద్రం, ప్రశాంతతకు నిలయం అయిన నంద్యాలలో రాజకీయం ఎప్పుడూ రగులుతూనే ఉంటుంది. విలక్షణమైన తీర్పు ఇవ్వడంలో నంద్యాల ఓటర్లకు ప్రత్యేకత ఉంది. తెలంగాణ వ్యక్తిని తమ నియోజకవర్గంలో గెలిపించి ప్రధానమంత్రిని చేసిన ఘనత నంద్యాల జనాలది ! 1952 నుంచి ఇప్పటివరకు మొత్తం 17సార్లు పార్లమెంట్‌కు ఎన్నికలు జరగగా.. కాంగ్రెస్ పదిసార్లు, టీడీపీ మూడుసార్లు, వైసీపీ రెండుసార్లు విజయం సాధించాయ్. 1991లో కాంగ్రెస్ తరపున నంద్యాల నుంచి పోటీ చేసిన పీవీ నరసింహరావు.. గెలిచి ప్రధాని అయ్యారు. ఇంతటి చరిత్ర ఉన్న నంద్యాల పార్లమెంట్‌లో విజయాన్ని పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయ్. అందుకే రాజకీయం ఎప్పుడూ కాక మీద కనిపిస్తుంటుంది.

READ ALSO : Chittoor Lok Sabha Constituency : చిత్తూరులో ఫ్యాన్ పార్టీ పట్టునిలుపుకుంటుందా?..అధికార పార్టీని ఎదుర్కొనేందుకు టీడీపీ వ్యూహాలేంటి?

nandyal

నంద్యాల సిట్టింగ్ ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డికి పనితీరుపై అసంతృప్తి… టీడీపీ నుంచి మాండ్ర శివారెడ్డి బరిలో
నంద్యాలలో వైసీపీ నుంచి గెలిచిన పోచా బ్రహ్మానందరెడ్డి సిట్టింగ్‌ ఎంపీగా ఉన్నారు. ఐతే ఈసారి ఆయనకు టికెట్ దక్కపోవచ్చని వైసీపీలో చర్చ జరుగుతోంది. ఎంపీ పనితీరు మీద నంద్యాల జనాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో పోచా ఫెయిల్ అయ్యారని జనాలు గుర్రుగా ఉన్నారు. ప్రజాసంక్షేమం కంటే తన సీడ్ వ్యాపారాల మీదే.. ఎక్కువ దృష్టి సారిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయ్. వైసీపీ సర్వేలోనూ పోచా బ్రహ్మానందరెడ్డికి నెగిటివ్ ఫలితాలు రావడంతో.. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ కొత్త అభ్యర్థిని తెరమీదకు తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి ఎంపీ బరిలో నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి, గంగుల ప్రతాప్‌రెడ్డి కూడా ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఐతే పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చి లోక్‌సభకు పంపాలన్నది జగన్ ఆలోచనగా కనిపిస్తోందనే టాక్ నడుస్తోంది. టీడీపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన ఓడిన మాండ్ర శివనందారెడ్డి.. మరోసారి బరిలో నిలవబోతున్నారు. ఓటమిని విశ్లేషించుకుంటూ.. కేడర్‌ను బలోపేతం చేసుకుంటున్నారు. అటు రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా.. టీడీపీ టికెట్ ఇస్తే ఎంపీగా పోటీ చేసేందుకు రెడీగా ఉన్నారు. ఐతే ఈయన బైరెడ్డి శబరి బీజేపీ నుంచి నంద్యాల ఎంపీ బరిలో నిలిచేందుకు సిద్ధం అవుతున్నారు. దీంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది.

నంద్యాల పార్లమెంట్‌ పరిధిలో నంద్యాల అసెంబ్లీతో పాటు.. ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు, పాణ్యం, బనగానపల్లె, డోన్‌ సెగ్మెంట్‌లు ఉన్నాయ్. నందికొట్కూర్‌ ఎస్సీ రిజర్వ్‌డ్‌ కాగా.. మిగినవి జనరల్‌.

READ ALSO : Anakapalle Lok Sabha Constituency : పేరు మాత్రం సాఫ్ట్…రాజకీయం మాత్రం మస్త్ హాట్…అనకాపల్లిలో పోటాపోటీగా పొలిటికల్ వార్

kishore reddy, akhilapriya,brahamandareddy

నంద్యాల అసెంబలో వైసీపీకి కలిసిరానున్న టీడీపీ గ్రూప్ తగాదాలు.. టీడీపీలో భారీగా టికెట్ పోటీ
నంద్యాల అసెంబ్లీలో పాగా వేసేందుకు పార్టీలన్నీ ఇప్పటినుంచే పావులు కదుపుతున్నాయ్. ముస్లీంలు, బలిజలు, వైశ్య ఓటర్లు.. ఇక్కడ గెలుపోటములను డిసైడ్ చేస్తారు. వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లోనూ ఈయనే బరిలో దిగబోతున్నారు. టికెట్‌కు సంబంధించి వైసీపీ అధిష్టానం ఎప్పుడో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. టీడీపీ నుంచి టికెట్ పోటీ భారీగా కనిపిస్తోంది. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి, మాజీమంత్రి ఎన్‌ఎండీ ఫారూక్‌.. పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. దీంతో సైకిల్ పార్టీలో గ్రూప్‌లు పెరిగిపోయి.. వర్గవిభేదాలు పీక్స్‌కు చేరాయ్‌. చంద్రబాబు ఆశీస్సులు ఉన్నాయని.. పోటీ చేయబోయేది తానే అని.. నంద్యాలలో ఆఫీస్‌ కూడా ఏర్పాటు చేసుకున్నారు అఖిలప్రియ. టీడీపీ గ్రూప్‌ తగాదాలు.. వైసీపీకి కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయ్. జనసేన, బీజేపీకి ఇక్కడ ఇంచార్జిలు కూడా లేని పరిస్థితి.

rambhupalreddy,charitha

పాణ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసానికి మంచి పట్టు… పాణ్యం నుంచిపోటీకి ఆసక్తి చూపిస్తున్న బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డి
పాణ్యంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. నియోజకవర్గంలో కాటసానికి మంచి పట్టుంది. పాణ్యం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి డబుల్‌ హ్యాట్రిక్ సాధించిన రికార్డు ఉంది. సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న కాటసానికి.. వచ్చే ఎన్నికల్లోనూ టికెట్ ఖాయం అని అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఐతే పాణ్యం నుంచి కాకుండా బనగానపల్లె అసెంబ్లీకి కానీ.. నంద్యాల ఎంపీగా కానీ బరిలో దించాలని వైసీపీ అధిష్టానం భావిస్తోందని సమాచారం. నంద్యాల పార్లమెంట్‌కు వెళ్లాల్సి వస్తే.. తన కుమారుడు కాటసాని నరసింహ రెడ్డిని పాణ్యం నుంచి బరిలో దింపేందుకు రాంభూపాల్ రెడ్డి రెడీగా ఉన్నారు. బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డి కూడా పాణ్యం నుంచి బరిలో నిలుస్తారని.. సోషల్ మీడియాలో తన అనుచరులతో ప్రచారం చేయించుకుంటున్నారు. టీడీపీ నుంచి గౌరు చరిత రేసులో ఉన్నారు. ఆమెకు టికెట్ కన్ఫార్మ్ అయిందని.. పార్టీ కేడర్‌లో టాక్ నడుస్తోంది. ఐతే ఒక్కసారైనా పాణ్యం టికెట్ బీసీలకు ఇస్తే బాగుంటుందని టీడీపీలో చర్చ జరుగుతోంది. దీంతో మాజీ జడ్పీ చైర్మన్‌ మల్లెల రాజశేఖర్, టీడీపీ మహిళా జిల్లా అధ్యక్షురాలు కుమ్మరి పార్వతమ్మ.. బీసీ కోటాలో టికెట్‌ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

READ ALSO : Araku Lok Sabha Constituency : రాజకీయాలకు వార్ జోన్‌గా మారిన అరకు….ఆంధ్రా ఊటీ లో హాట్ హాట్ గా రాజకీయాలు

Buggana Rajendranath Reddy, subbareddy

డోన్‌ వైసీపీకి కంచుకోటగా డోన్… బుగ్గన తీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి
డోన్‌ నియోజకవర్గం వైసీపీకి కంచుకోటలాంటిది. ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. ఐతే బుగ్గన తీరుపై నియోజకవర్గ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన అనుచరులు కబ్జాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయ్. మైనింగ్, గ్రావెల్ దందా జరుగుతున్న పట్టించుకోవడం లేదని మంత్రిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయ్. ఈ ఆరోపణలు, విమర్శలు.. వైసీపీకి సవాల్‌గా మారే చాన్స్ ఉంది. టీడీపీ నుంచి ధర్మవరం సుబ్బారెడ్డి బరిలో దిగబోతున్నారు. బాదుడేబాదుడు కార్యక్రమంలో సుబ్బారెడ్డి పేరును చంద్రబాబు ప్రకటించారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో ఆయన విస్తృత్తంగా పర్యటిస్తూ.. తన బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఐతే ధర్మరం సుబ్బారెడ్డిపై సొంతపార్టీలోనే వ్యతిరేక రాగం వినిపిస్తోంది. డోన్‌ నుంచి కేఈ కుటుంబం పోటీ చేసేందుకు పావులు కదుపుతోంది. వార్డ్‌ మెంబర్‌గా కూడా గెలవలేని వ్యక్తికి… ఎమ్మెల్యే టికెట్ ఎలా ఇస్తారని మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌ పార్టీపై విమర్శలు కురిపించారు. టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు.. వైసీపీకి కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయ్.

chakrapanireddy,rajasekharareddy

శ్రీశైలంలో గెలుపోటములను డిసైడ్ చేసే ముస్లీంలు, మైనారిటీవర్గాలు…
శ్రీశైలం అసెంబ్లీలో శిల్పా చక్రపాణిరెడ్డి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. ముస్లీంలు, మైనారిటీవర్గాలు.. ఇక్కడ గెలుపోటములను డిసైడ్ చేసే స్థాయిలో ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో బలిజలు, యాదవులు ఉన్నారు. శ్రీశైలం అసెంబ్లీలో బుడ్డా ఫ్యామిలీ, ఏరాసు ప్రతాప్‌ రెడ్డి కుటుంబానికి మంచి పట్టు ఉంది. ఐతే శిల్పా కుటుంబం ఎంట్రీతో ఈ రెండు కుటుంబాల హవా పూర్తిగా తగ్గిపోయింది. వచ్చే ఎన్నికల్లోనూ శిల్పా చక్రపాణిరెడ్డి బరిలో నిలవబోతున్నారు. శ్రీశైలం కోటపై మరోసారి వైసీపీ జెండా ఎగరేస్తామని శిల్పా చక్రపాణి ధీమాగా ఉన్నారు. తనయుడు శిల్పా కార్తిక్ రెడ్డిని బరిలో దించేందుకు అధిష్ఠానం పెద్దలతో చక్రపాణి రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. కేడర్ కూడా కార్తిక్ రెడ్డికి ఇస్తే బాగుంటుందని చర్చించుకుంటున్నారు. ఐతే బుడ్డా శేషారెడ్డి, బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డి.. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. టీడీపీ నుంచి బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి టికెట్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. బుడ్డా రాజశేఖర్ రెడ్డి ప్రస్తుతం టీడీపీ ఇంచార్జిగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. జనాల మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఐతే ఇద్దరు నేతలు ఎవరికి వారు టికెట్ తమకే అనే ధీమాతో కనిపిస్తున్నారు.

READ ALSO : Nellore Lok Sabha Constituency : సింహపురిలో వైసీపీ పట్టు నిలుపుకుంటుందా ? నెల్లూరు టీడీపీలో కనిపిస్తున్న కొత్త జోష్

katasani ramireddy, janardhanreddy

బనగానపల్లిలో కాటసాని రామిరెడ్డి, చల్లా వర్గాల మధ్య ఆధిపత్య పోరు
బనగానపల్లిలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. విజయం కోసం వైసీపీ, టీడీపీ పోటాపోటీ వ్యూహాలు రచిస్తున్నాయ్. కాటసాని రామిరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఐతే ఆయన పనితీరుపై జనాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రశాంతంగా ఉన్న పల్లెసీమలో రామిరెడ్డి అనుచరుల బీభత్సంతో.. జనాలు వణికిపోతున్నారని విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయ్. ఇక అటు వైసీపీలో వర్గపోరు పీక్స్‌కు చేరింది. కాటసాని రామిరెడ్డి, చల్లా వర్గాల మధ్య ఆధిపత్య పోరుతో.. ఫ్యాన్‌ పార్టీకి భారీ నష్టం జరిగే సంకేతాలు కనిపిస్తున్నాయ్. వచ్చే ఎన్నికల్లో కాటసాని రామిరెడ్డితో పాటు.. మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసారథిరెడ్డి కూడా వైసీపీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. టీడీపీ నుంచి బీసీ జనార్ధన్ రెడ్డి ఎన్నికల బరిలో నిలవబోతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ..ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. వైసీపీలో వర్గపోరు పీక్స్‌కు చేరుకున్న వేళ.. ఈసారి టీడీపీకే విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే చర్చ నియోజకర్గంవలో వినిపిస్తోంది.

brijendra reddy,akhilapriya

ఆళ్లగడ్డ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా బిజేంద్ర రెడ్డి… టీడీపీ నుంచి పోటీ చేయనున్న భూమా అఖిలప్రియ
ఫ్యాక్షన్ గడ్డగా పేరొందిన ఆళ్లగడ్డలో గంగుల బిజేంద్ర రెడ్డి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. పార్టీల సంగతి ఎలా ఉన్నా.. టికెట్‌ ఫైట్ ఇక్కడ ఆసక్తికరంగా కనిపిస్తోంది. ప్రస్తుతం గంగుల ఫ్యామిలీ నుంచి గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా.. గంగుల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలని భావిస్తున్న గంగుల ప్రతాప్ రెడ్డి.. ఏ పార్టీ టికెట్ ఇచ్చినా పోటీ చేసేందుకు సిద్ధమని అంటున్నారు. ఇక వైసీపీ నుంచి ఇరిగేల రాంపుల్లారెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. దీంతో ఆళ్లగడ్డ వైసీపీలో ఇప్పటినుంచే టికెట్ల లొల్లి మొదలైంది. టీడీపీ నుంచి పోటీ చేస్తున్నట్లు భూమా అఖిలప్రియ ప్రకటించుకుంటున్నారు. తాను పోటీ చేయకపోతే.. తమ కుటుంబం నుంచి ఒకరు బరిలో దిగడం ఖాయం అని చెప్తున్నారు. ఏవీ సుబ్బారెడ్డి కూడా ఆళ్లగడ్డ టికెట్ ఆశిస్తున్నారు. ఇక బీజేపీ నుంచి భూమా కిషోర్ రెడ్డి పోటీకి సిద్ధం అవుతున్నారు. టీడీపీ అవకాశం ఇచ్చినా పోటీ చేసేందుకు భూమా కిషోర్ రెడ్డి సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. పార్టీలు ఏవైనా టికెట్ రేసులో మాత్రం భూమా, గంగుల కుటుంబాల పేర్లే ప్రముఖంగా వినిపిస్తున్నాయ్.

READ ALSO : Guntur Lok Sabha Constituency : ఆంధ్రా రాజకీయాలకు సెంటర్ పాయింట్…గుంటూరు రాజకీయం మిర్చి కన్నా ఘాటు గురూ…

arthur

నందికొట్కూరులో నుంచి కొత్త అభ్యర్థిని ఫ్యాన్‌ పార్టీ బరిలో దించుతుందా… సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆర్థర్‌కు టిక్కెటల్ లేనట్టేనా?
ఎస్సీ రిజర్వ్‌డ్‌ అయిన నందికొట్కూరులో వైసీపీ నుంచి గెలిచిన ఆర్థర్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఐతే ఫ్యాన్‌ పార్టీ నుంచి ఈసారి కొత్త అభ్యర్థి బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయ్. ఎమ్మెల్యే ఆర్థర్, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డి మధ్య ఉన్న వర్గపోరు అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఇద్దరి మధ్య అధిపత్య పోరు తారాస్థాయికి చేరడంతో.. కొత్తవారికే టికెట్ ఇవ్వడం బెటర్ అని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో కస్టమ్స్ ఆఫీసర్ వెల్లుపుల ఆనంద్, మాజీ ఎమ్మెల్యే ఇజయ్య కుమారుడు చంద్రమౌళి, మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి పేర్లు వైసీపీ నుంచి టికెట్ రేసులో వినిపిస్తున్నాయ్. టీడీపీ నుంచి మాండ్ర శివానందరెడ్డి, గౌరు వెంకటరెడ్డి సూచించిన నేత… ఎమ్మెల్యే బరిలో దిగేందుకు సిద్ధంగా ఉన్నారట. సైకిల్ పార్టీ నుంచి బండి జయరాజుతో పాటు మరికొందరు నేతలు టికెట్ ఆశపడుతున్నారు.

READ ALSO : Bapatla Lok Sabha Constituency : సాగరతీరంలో కాక రేపుతున్నరాజకీయాలు.. బాపట్ల రాజకీయాలు చాలా హాట్ గురూ !

నంద్యాల రాజకీయం రోజుకో రకంగా మారుతోంది. ఎన్నికలకు ఏడాదికి పైగా సమయం ఉన్నా.. పార్టీలన్నీ ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నాయ్. ఓటర్ మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నాయ్. దీంతో నంద్యాల ఓటర్లు.. ఈసారి ఎటు వైపు ఉంటారన్నది ఆసక్తికరంగా మారింది. సర్వేలకు అర్థం కాని.. అంచనాలకు అందని.. నంద్యాల ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో అన్న భయం.. పార్టీల్లోనూ.. నేతల్లోనూ కనిపిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు