Kavali Assembly Race Gurralu : ఢీ అంటే ఢీ అంటున్న పెద్దారెడ్లు.. కాక రేపుతున్న కావలి రాజకీయం

కావలిలో ప్రధాన పోటీ వైసీపీ-టీడీపీ మధ్యే ఉందనే విశ్లేషణలే ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ హోరాహోరీ సమరంలో విజేత ఎవరన్నది ఓటర్లే తేల్చాలి.

Kavali Assembly Race Gurralu : నెల్లూరు అంటేనే పెద్దారెడ్ల అడ్డా.. ఎన్నిక ఏదైనా ఇద్దరు రెడ్లు పోటీ పడుతున్నారంటే.. ఆ కిక్కే వేరు. దీనికి కావలి నియోజకవర్గమే పెద్ద ఉదాహరణ. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కూటమి మధ్య హోరాహోరీగా జరుగుతున్న పోరులో ఇద్దరు పెద్దారెడ్లు ఢీ అంటే ఢీ అంటున్నారు. అంగ, అర్థ బలాల్లో ఒకరికి ఒకరు తీసిపోని ఈ ఇద్దరు నేతల మధ్య పోటీ హైటెన్షన్‌గా మారింది. హ్యాట్రిక్‌ కోసం ఒకరు, ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలని మరొకరు పోటీకి సిద్ధమవుతుంటే.. ఈ ఇద్దరికి చికాకు పెట్టేందుకు స్వతంత్రుడూ రంగంలోకి దిగాడు. మరి కావలిలో పోటీ ఏ ఇద్దరి మధ్య ఉంటుంది? ఇండిపెండెంట్‌ ఎఫెక్ట్‌ ఎంత?

ఆర్థిక బలంలో తిరుగులేని ముగ్గురు నేతల పోటీ..
ఇంట్రెస్టింగ్ రాజకీయాలకు కేరాఫ్ నెల్లూరు జిల్లా. ఎప్పుడూ పొలిటికల్‌ ట్విస్టులతో కాక మీదుండే ఇక్కడి రాజకీయాలు ‘చాలా హాట్ గురూ’ అనాల్సిందే.. జిల్లాలో పది నియోజకవర్గాలు ఉంటే ఒకదానికికొకటి తీసిపోని విధంగా పాలిటిక్స్‌ నడుస్తాయి. ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో ఈ పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. ఆర్ధిక బలంలో తిరుగులేని ముగ్గురు నేతలు పోటీ పడుతుండటంతో అసెంబ్లీ సమరం హోరాహోరీగా మారింది. ఈ ముగ్గురిలో కావలి కింగ్ ఎవరనేది ఆసక్తి రేపుతోంది.

హ్యాట్రిక్ కొట్టాలని పట్టుదల..
హోరాహోరీగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మరోసారి పోటీ చేస్తుండగా.. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి, ఇండిపెండెంట్‌గా పసుపులేటి సుధాకర్ బరిలో నిలిచారు. ముగ్గురు నియోజకవర్గంలో విస్తృత ప్రచారంతో దూసుకుపోతున్నారు. వైసిపి అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి వరుసగా రెండు సార్లు గెలుపొందారు. ఇప్పుడు మూడో సారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ప్రయత్నిస్తున్నారు.

తొలి నుంచి కాంగ్రెస్ కు కంచుకోట..
కావలి నియోజకవర్గం తొలి నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్‌ అడ్రస్‌ గల్లంతు అయితే.. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి అండగా నిలుస్తోంది కావలి. ఇక ఇప్పటికే రెండుసార్లు గెలిచిన ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి… హ్యాట్రిక్‌ విజయం కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన మేమంతా సిద్ధం సభ సక్సెస్‌ కావడంతో మంచి ఊపుమీద కనిపిస్తున్నారు ఎమ్మెల్యే.

గెలుపుపై ఎమ్మెల్యే ధీమా..
అదే విధంగా టీడీపీ నేత విష్ణువ‌ర్ధన్‌రెడ్డి ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలోకి రావడం, మాజీ ఏఎంసీ చైర్మన్ సుకుమార్ రెడ్డితో విభేదాలు సమసిపోవడం ఎమ్మెల్యేకు సానుకూలంగా మారిందంటున్నారు. ఇక రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్‌రావు అండదండలు, ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి చరిష్మా కావలిలో వైసీపీకి అదనపు బలం చేకూరుస్తున్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో తన ప్రచారానికి ప్రజల నుంచి మంచి ఆదరణ
లభిస్తోందని.. సీఎం జగన్ పాలన, సంక్షేమం, అభివృద్దే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి.

ఆర్థిక, అంగ బలాల్లో ఎమ్మెల్యేకు తీసిపోని కావ్య కృష్ణారెడ్డి..
సంస్థాగత బలం, బలగంతో వైసీపీ మంచి ఊపుమీద కనిపిస్తుంటే.. టీడీపీ తరఫున పోటీచేస్తున్న కావ్య కృష్ణారెడ్డి గట్టిపోటీనిస్తూ సవాల్‌ విసురుతున్నట్లు చెబుతున్నారు. గతంలో వైసీపీలో పనిచేసిన కావ్య కృష్ణారెడ్డి ఈసారి అనూహ్యంగా టీడీపీ టికెట్‌ దక్కించుకున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్తగా కావ్య కృష్ణారెడ్డికి నియోజకవర్గంలో మంచి గుర్తింపు ఉంది. ఆర్థిక, అంగ బలాల్లో ఎమ్మెల్యేకు తీసిపోని కావ్య కృష్ణారెడ్డి.. తన ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.

వ్యతిరేకతే గెలిపిస్తుందని ధీమా..
ఇతర పార్టీల కార్యకర్తలు, నాయకులను తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకుంటూ పార్టీని బలోపేతం చేస్తున్నారు. వాస్తవానికి గత ఎన్నికల్లో ఉదయగిరి టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డారు కావ్య కృష్ణారెడ్డి. కానీ ఈ సారి మాత్రం పట్టుదలతో టికెట్ మిస్ కాకుండా జాగ్రత్తపడ్డారు. అన్ని వర్గాలను ఆకట్టుకుంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ ఎక్కడికక్కడ టిడిపి శ్రేణులతో మమేకమవుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే వ్యతిరేకతే తనను గెలిపిస్తుందని ధీమాగా ఉన్నారు కావ్యా కృష్ణారెడ్డి.

బరిలో సుధాకర్.. టీడీపీ, వైసీపీ అభ్యర్థుల్లో కలవరం..
ఇక అధికార ప్రతిపక్ష పార్టీలు రెండూ హోరాహోరీగా తలపడుతుంటే.. వ్యాపారవేత్త పసుపులేటి సుధాకర్‌ ఇండిపెండెంట్‌గా రంగంలో దిగడం రెండు పార్టీలనూ కలవరానికి గురిచేస్తోంది. గత ఎన్నికల్లో జనసేన అభ్యర్ధిగా పోటీ చేసిన సుధాకర్ 10 వేల ఓట్లు తెచ్చుకున్నారు. జనసేనలో ఇమడలేక బీజేపీలో చేరి అతికొద్ది కాలానికే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరారు. కావలి టీడీపీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. కానీ చివరికి అధిష్టానం కావ్య కృష్ణారెడ్డికి టికెట్ కేటాయించడంతో తిరుగుబాటు చేస్తున్నారు. ఓ విధంగా సుధాకర్‌ పోటీ ఎన్‌డీఏ కూటమికి మైనస్‌గా చెబుతున్నా.. అధికార వైసీపీ కూడా తన ఓటు బ్యాంకు జారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. వైసీపీ, టీడీపీ అభ్యర్థులపై వ్యతిరేకతే తనను గెలిపిస్తుందని అంటున్నారు పసుపులేటి.

ప్రధాన పోటీ ఆ రెండు పార్టీల మధ్యే..
మొత్తానికి కావలి నియోజకవర్గంలో ఎన్నికల సమరం రసవత్తరంగా మారింది. సంస్థాగతంగా గట్టపట్టున్న వైసీపీ మూడోసారి విజయం కోసం విశ్వప్రయత్నం చేస్తోంది. పార్టీ నేతల మధ్య విభేదాలు తగ్గడం ఆ పార్టీకి పెద్ద ఉపశమనంగా చెబుతున్నారు. ఇక టీడీపీలో ఉంటూ టికెట్‌ దక్కకపోవడంతో తిరుగుబాటు చేసిన పసుపులేటి సుధాకర్‌ చీల్చే ఓట్లు కీలకంగా మారాయి. ఏదిఏమైనా కావలిలో ప్రధాన పోటీ వైసీపీ-టీడీపీ మధ్యే ఉందనే విశ్లేషణలే ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ హోరాహోరీ సమరంలో విజేత ఎవరన్నది ఓటర్లే తేల్చాలి.

Also Read : సై అంటే సై.. విశాఖ దక్షిణంలో ఉత్కంఠ పోరు

 

ట్రెండింగ్ వార్తలు