Visakhapatnam South Assembly Race Gurralu : సై అంటే సై.. విశాఖ దక్షిణంలో ఉత్కంఠ పోరు

ప్రజాక్షేత్రంలో తలపడే ముందు సొంత పార్టీలో క్యాడర్‌ను దారికి తెచ్చుకోవడానికి ఇద్దరూ ఎక్కువగా కష్టపడాల్సి వచ్చింది.

Visakhapatnam South Assembly Race Gurralu : సై అంటే సై.. విశాఖ దక్షిణంలో ఉత్కంఠ పోరు

Visakhapatnam South Assembly Race Gurralu

Visakhapatnam South Assembly Race Gurralu : ఆ నియోజకవర్గం విశాఖ నగరానికే మణిహారం.. గ్రేటర్‌ విశాఖలో గ్రేట్‌గా చెప్పుకునే ప్రాంతాలన్నీ ఆ నియోజకవర్గం పరిధిలోనే ఉంటాయి. సాగరతీరంలో సర్వమతాల సంగమంగా ఉండే ఆ నియోజకవర్గం రాజకీయం చేయడం మాత్రం చాలా కష్టం. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు.. ఏ పార్టీ అయినా గ్రూపు వార్‌తో నేతలకు ముచ్చెమటలు పట్టించడం అక్కడి క్యాడర్‌ స్పెషాలిటీ… అసలు సిసలు రాజకీయానికి కేరాఫ్‌గా నిలిచే విశాఖ సౌత్‌ పొలిటికల్‌ స్టోరీ..

ఇద్దరూ సొంత పార్టీని వీడిన వారే…
విశాఖ నగరానికే తలమానికమైన ఫిషింగ్ హర్బర్, కేజీహెచ్, విశాఖ పోర్టు, జగదాంబ జంక్షన్‌, ఏవీఎన్‌ కాలేజీ వంటి ప్రముఖ సెంటర్లు.. ఉత్తరాంధ్ర ఇలవేల్పు కనకమహలక్ష్మి దేవాలయం ఉన్న ప్రాంతం విశాఖ దక్షిణ నియోజకవర్గం. 2009లో ఏర్పాటైన ఈ నియోజకవర్గం అంతకు ముందు విశాఖ-1 కింద ఉండేది. ప్రస్తుతం 3 లక్షల ఓటర్లు ఉన్న దక్షిణలో తొలుత కాంగ్రెస్, ఆ తర్వాత రెండుసార్లు టీడీపీ గెలిచింది. ఈ ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే వాసుపల్లి అధికార వైసీపీ తరఫున పోటీ చేస్తుండగా, జనసేన నుంచి మాజీ ఎమ్మెల్సీ వంశీకృష్ణయాదవ్‌ బరిలోకి దిగారు.

ఎమ్మెల్యే అవ్వాలనే జీవితాశయం..
ఈ ఇద్దరు కూడా సొంత పార్టీలను వీడి కొత్త పార్టీల్లో చేరి ఆయా పార్టీల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా నిలవడం విశేషం. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్‌…. కార్పొరేషన్‌ ఎన్నికల సమయంలో వైసీపీ గూటికి చేరారు. ఇక వైసీపీ నగర అధ్యక్షుడిగా, ఎమ్మెల్సీగా పనిచేసిన వంశీకృష్ణయాదవ్‌ ఎమ్మెల్యే అవ్వాలనే తన జీవితాశయాన్ని నెరవేర్చుకునేందుకు జనసేనలో చేరి విశాఖ దక్షిణ సీటు దక్కించుకున్నారు.

ఎయిర్‌ఫోర్స్‌లో పైలట్‌ ఆఫీసర్‌గా పనిచేసిన వాసుపల్లి..
ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో పైలట్‌ ఆఫీసర్‌గా పనిచేసిన వాసుపల్లి గణేశ్‌కుమార్‌ 1994లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత వైజాగ్‌ డిఫెన్స్‌ అకాడమీ అనే విద్య సంస్థను ప్రారంభించి, విద్యావేత్తగా రాణించారు. మత్స్యకార సామాజికవర్గానికి చెందిన గణేశ్‌కుమార్‌ను 2009లో పార్టీలోకి చేర్చుకుని దక్షిణం నుంచి ఎమ్మెల్యేగా టికెట్‌ ఇచ్చింది టీడీపీ. ఆ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాసరావు చేతిలో ఓటమి పాలైన వాసుపల్లి… 2014 ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఇక 2019లోనూ రెండోసారి గెలిచి సత్తా చాటుకున్నారు.

కొత్త పార్టీలోనూ అవే తలనొప్పులతో సతమతం..
గత ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం వైసీపీ హవా నడిచినా.. విశాఖ నగరంలోని నాలుగు నియోజకవర్గాలను టీడీపీ గెలుచుకుంది. ఐతే పార్టీలో విభేదాల వల్ల గణేశ్‌కుమార్‌ రెండోసారి ఎమ్మెల్యే అయిన కొద్దికాలానికే టీడీపీని వీడి వైసీపీలో చేరారు. అయితే అక్కడా ఆయన గ్రూప్‌వార్‌ను ఎదుర్కోవాల్సి వచ్చింది. కార్పొరేటర్లు సాధిక్‌, కందుల నాగరాజు, సీనియర్‌ నేత సీతంరాజు సుధాకర్‌తో పొసగక సతమతమయ్యారు వాసుపల్లి. ఐతే అధిష్టానం అండగా నిలవడంతో ఆ ముగ్గురిలో ఇద్దరు జనసేనలోకి.. మరొకరు టీడీపీలోకి వెళ్లిపోయారు.

టీడీపీని వీడినా కనిపించని వ్యతిరేకత..
వృత్తిరీత్యా డిఫెన్స్‌ సర్వీసులో పని చేయడం వల్ల వాసుపల్లి వ్యక్తిగతంగా క్రమశిక్షణ ఉన్న పొలిటీషియన్‌గా పేరు తెచ్చుకున్నారు. ప్రజా దర్బార్‌ నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకోవడంతోపాటు పేదలు, అభాగ్యులకు ఆర్థిక సహయం చేస్తూ నియోజకవర్గంలో వ్యక్తిగత ఓటు బ్యాంకు పెంచుకున్నారు. ఇందువల్లే టీడీపీలో గెలిచి వైసీపీలోకి వెళ్లినా ప్రజల నుంచి వ్యతిరేకత లేకుండా పోయిందనే విశ్లేషణలు ఉన్నాయి. వైసీపీ అధిష్టానం కూడా గణేశ్‌కుమార్‌ వ్యక్తిగత చరిష్మాను గుర్తించి ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చింది. ఇక వైసీపీలో చేరిన తర్వాత కూడా నియోజకవర్గ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన గణేశ్‌కుమార్‌.. మూడోసారి గెలిచి వైసీపీకి కానుక ఇస్తానంటున్నారు.

టికెట్ దక్కకపోవడంతో వైసీపీకి గుడ్ బై..
ఇక రెండుసార్లు టీడీపీ గెలిచిన విశాఖ దక్షిణ నియోజకవర్గాన్ని ఈ సారి పొత్తుల్లో భాగంగా జనసేనకు కేటాయించారు. ఆ పార్టీ అభ్యర్థిగా వంశీకృష్ణయాదవ్‌కు కేటాయించారు. విశాఖ తూర్పు నియోజకవర్గానికి చెందిన వంశీకృష్ణ 2009 నుంచి ఎమ్మెల్యే అవ్వాలని కలలు కంటున్నారు. ఒకసారి పీఆర్‌పీ నుంచి మరోసారి వైసీపీ నుంచి తూర్పులో పోటీ చేసి ఓడిపోయారు. ఐతే ఈ సారి తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను నియమించి, ఆయనకే టికెట్‌ ఇవ్వడంతో వైసీపీని వీడారు వంశీకృష్ణ యాదవ్‌. అంతేకాకుండా మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ పదవి ఇస్తామని ఆశచూపి కార్పొరేటర్‌గా పోటీ చేయించి వైసీపీ, ఆ హామీ నెరవేర్చకపోవడం వంశీకృష్ణలో అసంతృప్తికి కారణమైంది.

పవన్ పచ్చ జెండా ఊపడంతో సైలెంట్ అయిపోయారు..
ఈ ఏడాది ఆరంభంలో జనసేనలో చేరడం… విశాఖ దక్షిణ నుంచి టికెట్‌ దక్కించుకోవడం చకచకా జరిగిపోయింది. అయితే వంశీకృష్ణ కన్నా ముందు జనసేనలో చేరిన కార్పొరేటర్లు సాధిక్‌, కందుల నాగరాజు వంటివారు ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించినా.. జనసేనాని పవన్‌ నచ్చజెప్పడంతో సైలెంట్‌ అయిపోయారు. కూటమి ఓట్ల బలంతో ఈ సారి ఎమ్మెల్యేగా గెలవడం పక్కా అంటున్నారు వంశీకృష్ణయాదవ్‌.

ఇద్దరూ.. గ్రూప్ వార్‌ను అధిగమించి టికెట్‌ కైవసం చేసుకున్న వారే..
మొత్తానికి ఎమ్మెల్యే అభ్యర్థులుగా తలపడుతున్న ఇద్దరు నేతలు.. కొత్త పార్టీలో గ్రూపు వార్‌ను అధిగమించి టికెట్‌ కైవసం చేసుకున్న వారే. ప్రజాక్షేత్రంలో తలపడే ముందు సొంత పార్టీలో క్యాడర్‌ను దారికి తెచ్చుకోవడానికి ఇద్దరూ ఎక్కువగా కష్టపడాల్సి వచ్చింది. ఇక పదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వాసుపల్లి వ్యక్తిగత ఇమేజ్‌తోపాటు బలమైన సామాజికవర్గ నేపథ్యం, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను నమ్ముకుంటుండగా, తూర్పు నుంచి దక్షిణకు వలస వచ్చిన జనసేన అభ్యర్థి వంశీకృష్ణ పూర్తిగా కూటమి ఓటు బ్యాంకుపైనే ఆధారపడుతున్నారు. ఇక ఓటర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదే ఉత్కంఠ రేపుతోంది.

Also Read : ఢీ అంటే ఢీ అంటున్న పెద్దారెడ్లు.. కాక రేపుతున్న కావలి రాజకీయం