Tdp Manifesto : ఆ 600 హామీలను టీడీపీ ఎందుకు అమలు చేయలేకపోయింది? వైసీపీ విమర్శలపై ఎందుకు మౌనంగా ఉంది?

Tdp Manifesto : 600 హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదని వైసీపీ ఫైర్‌ అవుతుంటే.. టీడీపీ మాత్రం సిక్స్‌ గ్యారెంటీలపైనే ప్రచారం చేస్తోంది. అసలు 2014 హామీలతో తమకు పనేలేదన్నట్లు టీడీపీ కూటమి సైలెంట్‌ అయిపోవడం హాట్‌ డిబేట్‌గా మారింది. అసలు ఆ 600 హామీల్లో ప్రధాన అంశాలేంటి? టీడీపీ ఎందుకు అమలు చేయలేకపోయింది? వైసీపీ విమర్శలను కవర్‌ చేసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదెందుకు?

రైతు రుణమాఫీపై ప్లేట్ ఫిరాయించిందని విమర్శలు..
2014 ఎన్నికల్లో వ్యవసాయ రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామన్న ప్రధాన హామీతో అధికారంలోకి వచ్చారు చంద్రబాబు. అప్పటికే 9 ఏళ్లు సీఎంగా చేసి ఉండటం, రాష్ట్ర విభజన వల్ల అనుభవశాలి సీఎంగా ఉంటే మంచిదని జనం టీడీపీకి పట్టం కట్టారు. ఐతే అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే టీడీపీ ప్లేట్‌ ఫిరాయించిందని విమర్శలు ఎదుర్కొంది. 87వేల కోట్లకు పైబడి రైతు రుణాలు ఉన్నాయని.. ఒక్కసారి మాఫీ చేయడం కుదరదని మెలిక పెట్టింది టీడీపీ ప్రభుత్వం.

వడ్డీలు పెరిగి తీవ్ర ఇబ్బందులు పడ్డ మహిళలు..
ఐదు విడతల్లో ఇస్తానని చెప్పి మూడు విడతలు కూడా ఇవ్వలేకపోయింది. దీంతో రుణాలకు వడ్డీలు పెరిగి.. కొత్తగా రుణాలు మంజూరు కాక రైతులు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. ఇక డ్వాక్రా, చేనేత రుణాల మాఫీ విషయంలోనూ మాట తప్పారనే ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో కోటయ్య కమిటీని నియమించిన ప్రభుత్వం…. ఆ కమిటీ నివేదిక ప్రకారం డ్వాక్రా రుణాల మాఫీని పట్టించుకోలేదని ఆరోపణలు ఎదుర్కొంది. రుణాలు మాఫీ చేయకపోవడంతో వడ్డీలు పెరిగిపోయి బ్యాంకుల నుంచి మహిళలు నోటీసులు అందుకుని తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సంఘాలు ఎన్‌పీఏలుగా అంటే నిరర్థక ఆస్తులు మారాయి. క్రెడిట్‌ రేటింగ్‌ను కోల్పోయి రుణాలకు అనర్హులయ్యారు.

ఒక్కొక్కరి ఖాతాలో 30వేలు అన్నారు.. ఏమైంది?
ఇక అప్పట్లో టీడీపీ ఇచ్చిన ప్రధాన హామీల్లో ఇంకొకటి బెల్టు షాపులు రద్దు చేస్తామనే వాగ్దానం. మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా బెల్టు షాపులు రద్దు చేయకపోగా ప్రతి గల్లీకి వాటిని విస్తరించారనే విమర్శలు ఉన్నాయి. 5 వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానని చెప్పినా.. అధికారంలో ఉన్న ఐదేళ్లు ఆ ఊసే ఎత్తలేదని వైసీపీ ఆరోపిస్తోంది. పుట్టిన ప్రతి బిడ్డకు మహాలక్ష్మి పథకం కింద 30 వేల రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్‌ చేస్తానని ఇచ్చిన హామీ బుట్టదాఖలైందని అంటోంది.

రూ.2వేల నిరుద్యోగ భృతి హామీని నీరుగార్చారు..
ఇంటికో ఉద్యోగం ఇస్తామని.. లేకపోతే ప్రతి నెల రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీని నీరుగార్చారు. ఎన్నికలకు మూడు నెలలు ఉందనగా కొద్దిమందికి మాత్రం వెయ్యి రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి విదిల్చి మభ్యపెట్టారని ఇప్పటికీ ఆరోపిస్తోంది వైసీపీ. పేద మహిళలకు ఉచితంగా స్మార్ట్‌ ఫోన్లు ఇస్తానని ఇవ్వలేదని.. పేదలకు 3 సెంట్ల స్థలంలో ఇల్లు ఇస్తానని చెప్పి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని గుర్తు చేస్తోంది. అదే సమయంలో తమ ప్రభుత్వం మూడు లక్షల ఇళ్లు మంజూరు చేసినట్లు గుర్తు చేస్తోంది వైసీపీ.

ఆ భయంతో మేనిఫెస్టో తొలగింపు..
అదే విధంగా బీసీలకు 10 వేల కోట్ల రూపాయల బడ్జెట్‌ వెచ్చిస్తామని.. కాపులకు ఏటా వెయ్యి కోట్ల చొప్పున 5 వేల కోట్లు ఇస్తానని గతంలో హామీలిచ్చింది టీడీపీ.. కానీ, ఐదేళ్ల పాలనలో కాపులకు కేవలం 1500 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నట్లు ఆరోపిస్తోంది వైసీపీ. నిరుద్యోగుల స్వయం ఉపాధికి 50 లక్షల రూపాయల వరకు రుణం ఇస్తాననే హామీని పట్టించుకోలేదని విమర్శలు ఎదుర్కొంటోంది. అదేవిధంగా కాలేజీ విద్యార్థులకు ఉచితంగా టాబ్లెట్‌ కంప్యూటర్లు, బీసీలకు విద్య, ఉద్యోగాల్లో 33.5 శాతం రిజర్వేషన్లు, 500 కోట్లతో బ్రాహ్మణుల సంక్షేమ నిధి వంటి హామీలను నెరవేర్చకపోగా వాటి గురించి ప్రజలు అడుగుతారని భయంతో మేనిఫెస్టోను తెలుగుదేశం వెబ్‌సైట్‌ నుంచే తొలగించారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది వైసీపీ…

ఇక వైసీపీ ఆరోపణలకు సమాధానం చెప్పలేక… కూటమి ఎదురుదాడినే నమ్ముకున్నట్లు చెబుతున్నారు. మరి ఈ హామీలపై జరుగుతున్న మాటల యుద్దాన్ని ప్రజలు ఎంతవరకు విశ్వసిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గత హామీలను అమలు చేయని టీడీపీ… ఇప్పుడు వైసీపీ అమలు చేస్తున్న పథకాలను విమర్శిస్తూనే… అంతకుమించి వ్యయమయ్యే హామీలను ఇవ్వడాన్ని ఎలా సమర్ధించుకుంటుందో చూడాలి..

Also Read : 600 హామీల్లో అమలైనవి ఎన్ని? చంద్రబాబుని ఇరుకున పెట్టేలా సీఎం జగన్ వ్యూహం

ట్రెండింగ్ వార్తలు