Tdp Manifesto : 600 హామీల్లో అమలైనవి ఎన్ని? చంద్రబాబుని ఇరుకున పెట్టేలా సీఎం జగన్ వ్యూహం

ఇద్దరూ కలిసే జనానికి హామీలిచ్చి మోసం చేశారని.. పీఠమెక్కాక ముసుగు తొలగించి, అసలు రూపాన్ని బయటపెట్టుకున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.

Tdp Manifesto : 600 హామీల్లో అమలైనవి ఎన్ని? చంద్రబాబుని ఇరుకున పెట్టేలా సీఎం జగన్ వ్యూహం

Tdp Manifesto

Tdp Manifesto : ఎన్నికలు అనగానే ప్రధాన పార్టీలు ప్రకటించే వరాలపైనే ఎక్కువగా ఫోకస్‌ ఉంటుంది. అధికారం కోసం హామీలు గుప్పించే పార్టీలు.. గెలిచాక ఏం చేస్తాయో తెలుసుకోడానికి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. గత ఎన్నికల్లో వైసీపీ హామీలకు ఆకర్షితులై ఆ పార్టీని గెలిపించిన ఓటర్లు…. అంతకు ముందు 2014లో టీడీపీని ఆదరించారు. అప్పట్లో 600 హామీలిచ్చిన టీడీపీ ఈ ఎన్నికల్లో సిక్స్‌ గ్యారెంటీలపైనే ఎక్కువ ప్రచారం చేస్తోంది. అసలు అప్పటి హామీలు అమలయ్యాయా? లేదా? టీడీపీ వాదన ఏంటి? అధికార వైసీపీ విమర్శలేంటి?

హామీల అమలుపై లోపించిన చిత్తశుద్ధి..
వచ్చే ఎన్నికల్లో విజయం కోసం పోరాడుతున్న టీడీపీ.. సిక్స్‌ గ్యారెంటీ పథకాలను ప్రకటించింది. దీనికి జనసేన కూడా మరో ఆరు పథకాలను చేర్చి ఉమ్మడి మ్యానిఫెస్టో ప్రకటిస్తామని ప్రచారం చేస్తోంది. ఐతే 2014 ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమవడంతోనే ఆ పార్టీని ఓడించారని వైసీపీ ఆరోపిస్తోంది. ఇందుకు అనేక ఉదాహరణలు చూపుతోంది. ఆ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమిగా పోటీ చేస్తే.. జనసేన బయట నుంచి మద్దతు పలికింది.

ఎన్నికలు అయ్యాక ఆ హామీలు అమలు చేయలేదనే విమర్శలు చేస్తూ కూటమికి టాటా చెప్పి.. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసింది. కానీ, మళ్లీ ఈ ఎన్నికల ముందు ఆ రెండు పార్టీలతోనూ జట్టుకట్టింది జనసేన.. టీడీపీతో పొత్తుకు బీజేపీ వెనకడుగు వేసినా.. తనకున్న పరిచయాలతో బీజేపీ పెద్దలపై ఒత్తిడిచేసి మరీ పొత్తు పెట్టుకునేలా చేశారు పవన్‌. ఐతే ఇలా పొత్తు కోసం వెంపర్లాడిన కూటమి పార్టీలు 2014లో ఇచ్చిన హామీల అమలుపై చిత్తశుద్ధి చూపకపోవడంపై వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది.

రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ.. హామీలు ఏమయ్యాయి?
2019లో ఎన్నికలు ముంచుకొస్తున్నాయనగా హడావుడిగా కొన్ని హామీలను ఇచ్చిన కూటమి అరకొరగానైనా అమలు చేశామని చూపించుకోవటానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చిందని విమర్శలు గుప్పిస్తోంది వైసీపీ. ముఖ్యంగా రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీపై అప్పట్లో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదని నిలదీస్తోంది వైసీపీ. ఇక నిరుద్యోగ భృతి పేరుతో కొద్దిమంది ఖాతాల్లో రూ.1000 చొప్పున జమచేసి నిరుద్యోగులనూ మోసం చేసిందని ఆరోపిస్తోంది. పసుపు కుంకుమ కింద మహిళల ఖాతాల్లో నగదు జమ చేయటం.. రాష్ట్రానికి తీరప్రాంతమే మణిహారమంటూ రకరకాల గ్రాఫిక్‌లు చూపించి.. ఎన్నికలకు కేవలం 20 రోజుల ముందు పోర్టులకు శంకుస్థాపన చేసి హడావుడి చేశారని చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేస్తోంది.

భోగాపురం విమానాశ్రయంపైనా అదే డ్రామా..
భోగాపురం విమానాశ్రయానికి భూ సేకరణ పూర్తి కాకుండా భూమి పూజ చేయడంపైనా విమర్శలు ఎదుర్కొంటున్నారు చంద్రబాబు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తన ఎన్నికల మేనిఫెస్టోను పార్టీ వెబ్‌సైట్లో కూడా తొలగించారని ఆరోపిస్తోంది వైసీపీ. వందలకొద్దీ హామీలనిచ్చిన చంద్రబాబు.. తొలి నాలుగున్నరేళ్లూ ఒక్క హామీని కూడా పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి.

ప్రజలను నిలువునా మోసం చేశారని వైసీపీ ప్రచారం..
2014 ఎన్నికల్లో ఉమ్మడిగా కలిసి పోటీ చేసిన చంద్రబాబు, పవన్‌.. అప్పట్లో ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చకుండా ప్రజలను నిలువునా మోసం చేశారని ఈ ఎన్నికల్లోనూ ప్రచారం చేస్తోంది అధికార వైసీపీ. ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడిగా అభ్యర్థుల ప్రకటన, ఉమ్మడి కార్యక్రమాలు అంటూ హడావుడి చేయటాన్ని తప్పుపడుతున్న వైసీపీ.. గతంలో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదో ముందుగా ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేస్తోంది. మేమంతా సిద్ధం సభల్లో కూడా సీఎం జగన్‌ ఇదే అంశంపై ఎక్కువగా ఫోకస్‌ పెట్టారు. తాను ఐదేళ్లలో చేసిన మంచిని.. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో చేశారా? అంటూ నిలదీస్తున్నారు. చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే పథకం ఒక్కటైనా ఉందా? అన్న ప్రశ్నతో ప్రజల్లో ఆలోచనలు రేకెత్తిస్తున్నారు.

600కు పైగా హామీల పేరుతో మోసం..
2014 ఎన్నికల్లో చంద్రబాబు, పవన్‌ కలిసే పోటీ చేశారని…. 600కు పైగా హామీలతో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేశారని చెబుతున్న సీఎం…. ఆ మేనిఫెస్టోలో చంద్రబాబుతోపాటు పవన్‌ ఫొటో కూడా ముద్రించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అప్పుడు ఇద్దరూ కలిసే జనానికి హామీలిచ్చి మోసం చేశారని.. పీఠమెక్కాక ముసుగు తొలగించి, అసలు రూపాన్ని బయటపెట్టుకున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజలను నిలువునా మోసగించారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. రుణమాఫీ పేరుతో రైతులను, డ్వాక్రా మహిళలను దారుణంగా వంచించారంటున్నారు. అధికారంలోకి వచ్చాక మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుందని, మీరు పైసా కట్టకండి అని చెప్పడంతో రైతులు, మహిళలు ముప్పుతిప్పలు ఎదుర్కొన్నారని గుర్తు చేస్తోంది వైసీపీ…

పెన్షన్లు, ఇళ్ల స్థలాల విషయంలో మోసగించారన్న వైసీపీ..
ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడం వల్ల రైతులు వడ్డీతో సహా రుణాలు చెల్లించుకోవాల్సి వచ్చిందని చెబుతోంది. ఇక జాబు రావాలంటే బాబు రావాలంటూ యువతనూ నిలువునా ముంచిన విషయాన్ని ప్రచారం చేస్తోంది వైసీపీ. పింఛన్ల పేరుతో వృద్ధులు, దివ్యాంగులను అవస్థలకు గురిచేశారని, తమ పాలనలో వలంటీర్లతో అవ్వాతాతలకు బాసటగా నిలిచామని చెబుతోంది. ఇండ్లు, ఇళ్ల స్థలాల పేరుతో టీడీపీ అందరినీ మోసం చేస్తే.. జగన్‌ ప్రభుత్వం 31 లక్షల ఇళ్లు మంజూరు చేసిందని గుర్తుచేస్తోంది. చివరకు తాము ఇచ్చిన హామీలు ప్రజలకు కనపడకుండా పార్టీ వెబ్‌సైట్‌ నుంచి మేనిఫెస్టోనే తొలగించేసిన అంశాన్ని వైసీపీ హైలెట్‌ చేస్తోంది.

Also Read : అనర్ధమే..! దేశంలో ఉచితాలపై ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు కీలక వ్యాఖ్యలు