Tirupati Assembly Constituency: తిరుపతి అసెంబ్లీ సీటుపై పవన్ కల్యాణ్ కన్ను పడిందా?

తిరుపతి సీటుపై.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కన్ను కూడా పడిందా? రాబోయే ఎన్నికల్లో.. తిరుపతిని గెలిచే నాయకుడెవరు?

Tirupati Assembly Constituency: సాక్షాత్తూ.. ఆ కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ తిరుపతి. అలాంటి చోటుకి.. ఎమ్మెల్యేగా ఎన్నికవ్వాలని.. ఎవరికి మాత్రం ఉండదు? అందుకే.. జిల్లాలోనే తిరుపతి హాట్ సీటు. గత ఎన్నికల్లో.. వైసీపీ వేవ్‌లో ఈ స్థానం కూడా ఫ్యాన్ పార్టీ ఖాతాలో పడింది. మరి.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. తిరుపతి ఎలా మారింది? రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన భూమన కరుణాకర్ రెడ్డి పనితీరు ఎలా ఉంది? వచ్చే ఎన్నికల్లో.. ఏ పార్టీ నుంచి ఎవరెవరు బరిలో దిగబోతున్నారు? తిరుపతి సీటుపై.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కన్ను కూడా పడిందా? రాబోయే ఎన్నికల్లో.. తిరుపతిని గెలిచే నాయకుడెవరు?

ఆధ్యాత్మికతకు, ప్రశాంత వాతావరణానికి నిలయం తిరుపతి. ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికైతే చాలు.. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులతో ఇట్టే పరిచయాలు ఏర్పడతాయ్. దేశంలోనూ, రాష్ట్రంలోనూ అత్యంత గుర్తింపు పొందిన అసెంబ్లీ సెగ్మెంట్ తిరుపతి. అందువల్ల.. ఇక్కడ గెలవడం అన్ని పార్టీలకు సెంటిమెంట్‌గా మారింది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్లు కూడా తమ పొలిటికల్ ఎంట్రీ కోసం తిరుపతిని ఎంచుకున్న ఘట్టాలున్నాయ్. సుమారు 35 వేల మందితో 1952లో ఏర్పడిన తిరుపతి నియోజకవర్గంలో.. ప్రస్తుతం 4 లక్షలకు పైనే జనాభా ఉంది. నియోజకవర్గంలో.. రెండున్నర లక్షలకు పైనే ఓటర్లు ఉన్నారు. ఇక.. తిరుపతి కార్పొరేషన్ పరిధిలో.. 50 డివిజన్లు ఉన్నాయి. తిరుపతి నియోజకవర్గంలో.. తిరుపతి అర్బన్, రూరల్ మండలాలు మాత్రమే ఉన్నాయి. భౌగోళికంగా తిరుపతి చిన్నదిగానే కనిపించినా.. ఇక్కడ 46 స్లమ్ ఏరియాలు ఉన్నాయి. వాటిలో.. లక్ష మందికి పైగా జనం నివసిస్తున్నారు. ఈ సెగ్మెంట్‌లో బలిజ సామాజికవర్గం ఓట్ బ్యాంక్ గెలుపోటములను నిర్ణయించేదిగా ఉంది. దాంతో.. అన్ని పార్టీలు వాళ్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటాయి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన 20 వేల మంది ఉద్యోగుల ఓట్లు కూడా ప్రభావం చూపుతాయి.

Bhumana Karunakar Reddy (Fb Pic)

తిరుపతి వైసీపీపై భూమన పట్టు
ప్రస్తుతం తిరుపతి సిట్టింగ్ ఎమ్మెల్యేగా భూమన కరుణాకర్ రెడ్డి కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో జగన్ వేవ్‌లో.. తిరుపతి సీటు కూడా వైసీపీ ఖాతాలో పడింది. కేవలం.. 7 వందల ఓట్ల తేడాతో.. భూమన గెలిచారు. ఆయనకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని భావించినా.. రాజకీయ సమీకరణాల్లో ఆయనకు పరాభవం ఎదురైంది. ఈ విషయంలో ఆయన కాస్త మనస్తాపానికి కూడా గురయ్యారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని.. ఆ మధ్య సంచలన ప్రకటన చేశఆరు. అర్హతలు నిరూపించుకుంటే.. తన కుమారుడు అభినయ్ రెడ్డి పోటీలో ఉంటారని చెప్పారు. అయితే.. సీఎం జగన్ వారించడంతో.. వచ్చే ఎన్నికల్లోనూ కరుణాకర్ రెడ్డే.. వైసీపీ తరఫున బరిలో ఉంటారనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే.. వైసీపీకి భూమన తప్ప మరో అభ్యర్థి కనిపించడం లేదు. తిరుపతి వైసీపీపై.. భూమనకు మంచి పట్టుంది. గ్రూప్ పాలిటిక్స్ లేకుండా.. ఆయన పార్టీని తన గుప్పిట్లో పెట్టుకున్నారు. పార్టీ నాయకుల్లో, క్యాడర్‌లో ఆయన మాటకు తిరుగులేదు.

Bhumana Karunakar Reddy, Bhumana Abhinay Reddy (Pic: Twitter)

కష్టపడుతున్న అభినయ్ రెడ్డి
ఇక.. భూమన కుమారుడు అభినయ్ రెడ్డి.. తిరుపతి డిప్యూటీ మేయర్ పదవిలో ఉన్నారు. ప్రతి డివిజన్‌లో ఆయన సొంత అనుచరగణాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తిరుపతిలో మరోసారి వైసీపీ జెండా ఎగరేసేందుకు.. అభినయ్ రెడ్డి కష్టపడుతున్నారు. ఇక.. తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లలో.. 49 స్థానాలు వైసీపీవే. ఈ కార్పొరేటర్లే తనకు గట్టి బలమని భూమన భావిస్తున్నారు. కానీ.. ఆ కార్పొరేటర్లపై పెద్ద ఎత్తున విమర్శలు, అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాళ్ల తీరు వల్ల.. కరుణాకర్ రెడ్డికి కొంత నష్టం జరిగే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. అయితే.. విపక్షాల ఆరోపణలను భూమన కొట్టిపారేస్తున్నారు. మరో 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని.. తిరుపతిని అభివృద్ధి చేస్తున్నామంటున్నారు. తాము చేసిన పనులే.. తమను గెలిపిస్తాయనే నమ్మకంతో ఉన్నారు ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి.

Sugunamma (Pic: Google)

సుగుణమ్మకు టికెట్ దక్కుతుందా?
ఇక.. తిరుపతి టీడీపీలో క్లారిటీ కరువైంది. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ సుగుణమ్మకు.. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కుతుందా? లేదా? అనేది ఆసక్తిగా మారింది. తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలు, కో-ఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కోవడంలో సుగుణమ్మ సక్సెస్ కాలేకపోయారన్న భావన పార్టీ నాయకత్వంలో ఉంది. కానీ.. తిరుపతిలో వైసీపీని ఎదుర్కొనే నాయకులు.. టీడీపీలో కరువయ్యారు. నారా లోకేశ్ కూడా.. తన పాదయాత్రలో సుగుణమ్మ పోటీలో ఉంటారని కూడా చెప్పలేదు. ఈ మధ్య ఒకరిద్దరి పేర్లు కొత్తగా ప్రచారంలోకి వచ్చినా.. అంతే వేగంగా వెనక్కి వెళ్లిపోయాయ్. అయితే.. 2019 ఎన్నికల్లో స్టేట్ మొత్తం వైసీపీ ప్రభంజనం కనిపించినా.. తిరుపతిలో సుగుణమ్మ కేవలం 708 ఓట్ల తేడాతో మాత్రమే ఓటమిపాలయ్యారు. వచ్చే ఎన్నికల నాటికి బలమైన అభ్యర్థి దొరకకపోతే.. తెలుగుదేశం టికెట్ మళ్లీ సుగుణమ్మకే దక్కొచ్చనే వాదన వినిపిస్తోంది. తిరుపతిలో టీడీపీకి గెలిచేందుకు అవసరమైనంత ఓట్ బ్యాంక్ ఉన్నా.. సరైన లీడర్ లేరనే భావన క్యాడర్‌లో ఉందనే టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా.. వచ్చే ఎన్నికల్లో తిరుపతిలో పసుపు జెండా ఎగరడం ఖాయమని.. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Also Read: దెందులూరులో వైసీపీ హవాకు చింతమనేని చెక్ పెడతారా?

Pawan Kalyan (Pic: Janasena Twitter)

తిరుపతి సీటుపై జనసేన గురి
జనసేన విషయానికొస్తే.. ఈసారి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తిరుపతి నుంచే పోటీ చేస్తారనే ప్రచారం చాలాకాలంగా నడుస్తోంది. అయితే.. జనసేన నాయకత్వం మాత్రం ఇందులో వాస్తవం లేదంటున్నారు. కానీ.. తెలుగుదేశంతో గనక పొత్తు కుదిరితే.. తిరుపతి సీటు తప్పనిసరిగా జనసేన అడుగుతుందనే ప్రచారం నడుస్తోంది. గత ఎన్నికల్లో జనసేన తరఫున బరిలోకి దిగిన చదలవాడ కృష్ణమూర్తి 12 వేలకు పైనే ఓట్లు సాధించారు. అందువల్ల.. తెలుగుదేశం-జనసేన తరఫున ఉమ్మడి అభ్యర్థి బరిలోకి దిగితే.. విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పవన్ గనక పట్టుబడితే.. తిరుపతి సీటుని జనసేనకి ఇచ్చేందుకు చంద్రబాబు వెనుకాడకపోవచ్చు. తిరుపతి ఇంచార్జ్‌గా ఉన్న కిరణ్ రాయల్ లాంటి నేతలు జనసేన టికెట్ రేసులో ఉన్నారు. ఈ సీటు విషయంలో జనసేనాని నిర్ణయం కోసం తాము ఎదురుచూస్తున్నట్లు.. పార్టీ నేతలు చెబుతున్నారు. పవన్ కల్యాణ్ గనక తిరుపతి బరిలో నిలిస్తే.. లక్ష మెజారిటీకి తగ్గకుండా గెలిపిస్తామంటున్నారు. టీడీపీతో పొత్తు విషయం.. పార్టీ అధినేత నిర్ణయం మేరకే ఉంటుందని.. ఆయనెలా చెబితే అలా నడచుకుంటామని చెబుతున్నారు.

Also Read: ఏపీ పాలిటిక్స్‌లో హీట్ రేపుతోన్న రాజోలు రాజకీయం.. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే..

NV Prasad (Pic: Google)

జనసేన టికెట్ రేసులో ఎన్వీ ప్రసాద్
ఇక.. మెగా ఫ్యామిలీకి దగ్గర వ్యక్తి, ప్రముఖ నిర్వాత అయిన ఎన్వీ ప్రసాద్ కూడా జనసేన టికెట్ రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అనూహ్యంగా.. ఆఖరి నిమిషంలో కొత్త వాళ్ల పేర్లు కూడా తెరమీదికొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం – జనసేన కలిసి ఉమ్మడి అభ్యర్థిని బరిలో దించితే.. గెలుపు అవకాశాలున్నాయి. అలా కాకుండా విడివిడిగా పోటీ చేస్తే మాత్రం.. వైసీపీ అభ్యర్థి మళ్లీ గెలవడం ఖాయమంటున్నారు. ఇక.. బీజేపీ విషయానికొస్తే.. భాను ప్రకాశ్ రెడ్డి లాంటి నాయకులు ఉన్నప్పటికీ.. కమలదళానికి ఇక్కడ చెప్పుకోదగ్గ ఓట్ బ్యాంక్ లేదు. ఏదేమైనా.. వచ్చే ఎన్నికల్లో తిరుపతి పోరు రసవత్తరంగా ఉండబోతోందనే విషయం అర్థమవుతోంది. మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచేందుకు.. భూమన కరుణాకర్ రెడ్డి సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.

Also Read: అందుకే మా వాడిని తెరపైకి తీసుకొచ్చా.. వెల్లడించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

TDP Janasena Flags (Pic: Google)

హాట్ టాపిక్‌గా టీడీపీ-జనసేన పొత్తు
టీడీపీ-జనసేన పొత్తు కూడా తిరుపతి నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. ఇది.. హిట్ కాంబినేషన్ అనే టాక్ నడుస్తున్నా.. సిట్టింగ్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వర్గం మాత్రం గెలుపుపై ధీమాగానే ఉంది. జనసేన – టీడీపీ పొత్తు ఖాయమని.. తిరుపతిలోని రెండు పార్టీల కార్యకర్తలు ఇప్పటికే మానసికంగా సిద్ధమై ఉన్నారు. ప్రకటన రావడమే లేటు.. ఎలక్షన్ బ్యాటిల్ గ్రౌండ్‌లోకి దిగిపోతామన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది. అందువల్ల.. తిరుపతిలో ట్రయాంగిల్ ఫైట్ ఉంటుందా? ద్విముఖ పోరే కనిపిస్తుందా? అన్నది.. ఆ రెండు పార్టీల పొత్తు మీదే ఆధారపడి ఉంది. ఓవరాల్‌గా.. ఈసారి జిల్లాలో హాట్ సీటుగా ఉన్న తిరుపతిని.. ఎవరు గెలుచుకుంటారన్నది.. ఆసక్తి రేపుతోంది.

ట్రెండింగ్ వార్తలు