Blast Inside Ludhiana Court : లుథియానా కోర్టులో పేలుడు..ఇద్దరు మృతి,నలుగురికి తీవ్ర గాయాలు

పంజాబ్‌లోని లుథియానా కోర్టు కాంప్లెక్స్‌లో పేలుడు సంభవించింది. లుధియానా నగరం నడిబొడ్డున జిల్లా కమీషనర్ కార్యాలయానికి సమీపంలో ఉన్న జిల్లా కోర్టులోని

Blast Inside Ludhiana Court :  పంజాబ్‌లోని లుథియానా కోర్టు కాంప్లెక్స్‌లో పేలుడు సంభవించింది. లుధియానా నగరం నడిబొడ్డున జిల్లా కమీషనర్ కార్యాలయానికి సమీపంలో ఉన్న జిల్లా కోర్టులోని రెండో అంత‌స్తులోని బాత్‌రూమ్‌లో గురువారం మధ్యాహ్నాం 12:22గంటల సమయంలో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి బాత్‌రూమ్ గోడ పూర్తిగా ధ్వంస‌మైంది. స‌మీప గ‌దుల‌కు ఉన్న అద్దాలు ధ్వంస‌మ‌య్యాయి.

ఇక,ఈ పేలుడు ఘటనలో ఇద్దరు మరణించారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హాస్పిటల్ కి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. పేలుడు ఎలా జరిగిందన్న దానిపై ఆరా తీస్తున్నారు. అయితే భారీ శబ్ధంతో పేలుడు సంభవించిందని,అది శక్తివంతమైన బాంబు కావచ్చని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

లూథియానా పోలీస్ కమిషనర్ గురుప్రీత్ సింగ్ భుల్లర్ మాట్లాడుతూ..పేలుడు జరిగిన ఆ ప్రాంతాన్ని సీల్ చేశామని, పేలుడు జరిగిన ప్రదేశం నుండి ఫోరెన్సిక్ బృందాలు నమూనాలను సేకరిస్తాయన్నారు. చండీగఢ్ నుండి బాంబు నిర్వీర్య బృందం మరియు ఫోరెన్సిక్స్ బృందాన్ని పిలిపించామని,ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని భుల్లర్ తెలిపారు.

కాగా, మరికొద్ది నెలల్లో పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో కొన్ని రోజులుగా పంజాబ్‌లో జరుగుతున్న పరిణామాలు దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారాయి. నాలుగు రోజుల క్రితం అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో పవిత్ర గురుగ్రంథ సాహిబ్‌ను అప‌విత్రం చేసేందుకు ప్ర‌య‌త్నించిన యువ‌కుడిని శ‌నివారం భక్తులు, స్థానికులు కొట్టి చంపారు. ఆ తర్వాత కపూర్తలాలోని గురుద్వారాను అపవిత్రం చేసే మరో ఘటన చోటుచేసుకుంది. వాటిని మరవక ముందే ఇప్పడు ఏకంగా కోర్టులో బాంబు పేలడం సంచలనంగా మారింది.

మరోవైపు ఈ ఘటనపై పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ ఛన్ని అనుమానం వ్యక్తం చేశారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కొన్ని సంఘ విద్రోహక శక్తులు కుట్రలు చేశాయని.. వారి పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని తెలిపారు. ఘటనకు కారణమైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తాను లూథియానా వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తానని చెప్పారు.

ALSO READ Women Commandos for VIP: వీఐపీల రక్షణ కోసం మహిళా కమాండోలు..

ట్రెండింగ్ వార్తలు