Red Saree Flag : ఎర్ర చీరతో ఘోర రైలు ప్రమాదాన్ని తప్పించిన గ్రామీణ మహిళ

ఉత్తరప్రదేశ్ లో ఘోర రైలు ప్రమాదం తప్పింది. దీనికి కారణం ఓ గ్రామీణ మహిళ, ఎర్ర చీర. అవును ఓ మహిళ ఎంతో చాకచక్యంగా..

Red Saree Flag

Red Saree Flag : ఉత్తరప్రదేశ్ లో ఘోర రైలు ప్రమాదం తప్పింది. దీనికి కారణం ఓ మహిళ, ఎర్ర చీర. అవును ఓ మహిళ ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఘోర ప్రమాదాన్ని తప్పించడమే కాదు ఎంతో మంది ప్రాణాలను కాపాడింది. రైలు పట్టా విరిగిపోవడాన్ని గమనించిన మహిళ వెంటనే తన ఎర్ర చీరను ఎగరవేసి అటుగా వస్తున్న రైలును ఆపింది. దీంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్​ ఇటాహ్ జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుస్బా రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది.

ఇటాహ్ జిల్లా అవఘర్ బ్లాక్‌లోని గులేరియా గ్రామానికి చెందిన ఓంవతి(65) పొలం పనులకు వెళ్తుండగా.. రైల్వే ట్రాక్‌ విరిగిపోవడాన్ని గుర్తించింది. ఇంతలో అటు నుంచి రైలు వస్తుండటం గమనించింది. వెంటనే రైలు డ్రైవర్‌ను అప్రమత్తం చేయడానికి ప్రయత్నించింది. జెండా ఎగరవేయడానికి తన దగ్గర ఏమీ లేకపోవడంతో వెంటనే తన ఎర్ర చీరను విప్పి కర్రలకు చుట్టి రైలు పట్టాలకు అడ్డంగా ఎగరేసింది.

ఇటాహ్ నుంచి తుండ్ల వెళ్తున్న ప్యాసింజర్ రైలు డ్రైవర్.. ఎరుపు రంగు చీర గుర్తించాడు. ఏదో ప్రమాదం పొంచి ఉందని గ్రహించి సమయానికి బ్రేకులు వేసి రైలు ఆపేశాడు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది. రైల్వే ట్రాక్ దెబ్బతినడం గమనించిన డ్రైవర్ వెంటనే ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు. ఆ వెంటనే రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్‌కు మరమ్మతులు చేశారు. గంట తరువాత రైలు తన ప్రయాణాన్ని కొనసాగించింది. ప్రమాదం జరగకుండా రైలును ఆపిన మహిళను ట్రైన్ డ్రైవర్ మెచ్చుకున్నాడు. ఆమెకు 100 రూపాయలు బహుమతిగా ఇచ్చాడు. ప్రమాదం సమయంలో ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఘోర ప్రమాదం తప్పించి, ఎంతో మంది ప్రాణాలు కాపాడిన మహిళ తెలివితేటలను, సమయస్ఫూర్తిని అంతా మెచ్చుకుంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు