Ayodhya: శరవేగంగా అయోధ్య రామాలయ నిర్మాణం.. దీపావళికి తొలి అంతస్తు సిద్ధం

దేశవ్యాప్తంగా ఉన్న రామభక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అయోధ్య రామాలయ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది.

Ayodhya Ram Temple Construction

Ayodhya Ram Temple: అయోధ్య రామాలయం శరవేగంగా నిర్మాణమవుతోంది. సుదీర్ఘ వివాదాల తర్వాత 2020లో ప్రారంభమైన నిర్మాణ పనులు చకచకా సాగిపోతున్నాయి. మూడు అంతస్తుల్లో నిర్మిస్తున్న ఆలయంలో మొదటి దశ.. తొలి అంతస్తు (First Floor) ఈ ఏడాది అక్టోబర్‌ నాటికి సిద్ధం కానుంది. వచ్చే జనవరి ఫస్ట్ కల్లా మిగిలిన పనులు పూర్తిచేసి సంక్రాంతి (Sankranti) నాటికి గర్భగుడి (Garba gudi)లో దేవుడిని ప్రతిష్టించాలని పట్టుదలగా ఉంది రామాలయ ట్రస్ట్ (Ramalay Trust).

దేశవ్యాప్తంగా ఉన్న రామభక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అయోధ్య రామాలయ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. వచ్చేఏడాది జనవరి ఫస్ట్ నాటికి నిర్మాణం పూర్తిచేయాలనే లక్ష్యంతో పనులను పరుగు తీయిస్తోంది రామజన్మభూమి తీర్థ ట్రస్ట్. మూడు అంతస్తుల్లో నిర్మిస్తున్న ఆలయంలో మొదటి అంతస్తు చాలా వరకు పూర్తయింది. ఈ ఏడాది అక్టోబర్ నాటికి తొలి అంతస్తు నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తోంది ఆలయ నిర్మాణ సమితి. దీపావళికి తొలి అంతస్తు సిద్ధం చేసి.. మిగిలిన పనులు డిసెంబర్ నెలాఖరుకు పూర్తి చేస్తామని చెబుతున్నారు. అంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి అయోధ్య రామమందిర నిర్మాణం పూర్తవడం ఖాయం.

దేశప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రామాలయ నిర్మాణానికి అధికార బీజేపీ తీవ్రంగా కృషిచేస్తోంది. 2024 ఎన్నికల్లో విజయ ఢంకా మోగించాలని కోరుకుంటున్న బీజేపీ.. రామాలయ నిర్మాణం పూర్తిచేశామని చెప్పి ఓట్లు అడగాలని అనుకుంటోంది. అయోధ్యలో రామాలయం నిర్మాణం బీజేపీ ప్రధాన అజెండా.. ఆ పార్టీ స్థాపించిన నుంచి ఇదే ప్రధాన అజెండాగా పనిచేసింది. ఎన్నో పోరాటాలు చేసింది. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అయోధ్యలో ఆలయ నిర్మాణంపై కదలిక వచ్చింది. దశాబ్దాలుగా పరిష్కారం కాని వివాదాలను సంప్రదింపులతో కొలిక్కి తెచ్చింది. వివాదాలన్నీ ముగియడంతో 2020 ఆగస్టులో రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ప్రధాని మోదీ (PM Modi).

అందరిలో ఎంతో ఆసక్తి రేకెత్తిస్తున్న రామాలయం ఎలా ఉండబోతుందోననే చర్చ జరుగుతోంది. రామాలయ నిర్మాణంపై సమాచారం బయటకు వచ్చిన ప్రతిసారి నిర్మాణ విశిష్టతలు.. విశేషాలపై విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు భక్తులు. రాజస్థాన్ నుంచి ప్రత్యేక పాలరాతిని తీసుకువచ్చి ఆలయ గోడలను రమణీయంగా తీర్చిదిద్దుతున్నారు శిల్పులు. ఇక నేపాల్ నుంచి తెచ్చిన శాలగ్రామంతో దేవతా విగ్రహాలను తయారుచేస్తున్నారు. ఒకవైపు దేవుడి విగ్రహాలు.. మరోవైపు ఆలయ నిర్మాణాలు చకచక సాగుతుండటంతో.. అయోధ్యలో సందడి కనిపిస్తోంది. దీపావళి నాటికి తొలి అంతస్తు పూర్తిచేస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది రామ జన్మభూమి ట్రస్ట్.

Also Read: బీహార్ సీఎం నితీష్ కుమార్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం.. పుట్‌పాత్‌పైకి దూకి తప్పించుకున్న సీఎం

సుమారు వెయ్యి కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న రామాలయం పనులను రామజన్మభూమి ట్రస్టుతోపాటు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లోగా నిర్మాణాలు పూర్తికావాలనే లక్ష్యంతో ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు బీజేపీ పెద్దలు. 380 అడుగుల పొడవు.. 250 అడుగుల వెడల్పు.. 160 అడుగుల ఎత్తులో అత్యంత ఆకర్షణీయంగా ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఐదు మండపాలు, శివాలయం కూడా రామాలయంలో భాగంగా ఉంటాయి. 46 ద్వారాలు ఏర్పాటు చేస్తున్నారు. గర్భాలయానికి బంగారు తలుపులు.. మిగిలిన ద్వారబంధాలకు టేకు కలపతో తలుపులు తయారు చేస్తున్నారు.

Also Read: పేటీఎం సీఈవో హైస్కూల్ నుంచి 2 పుస్తకాలు మాత్రమే చదివారట.. అవేంటంటే..

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతోనే ఆలయ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. భక్తుల మనోభావాలతోపాటు రాజకీయంగా బీజేపీకి కీలకం. ఆలయ నిర్మాణం పూర్తి చేయడం ద్వారా ఎవరికీ సాధ్యం కానిది.. మోదీ నాయకత్వంలో బీజేపీ సాధించిన ఘనతగా చాటుకోవాలని చూస్తోంది కమలం పార్టీ.

ట్రెండింగ్ వార్తలు