Posani Krishna Murali : అంత కాలజ్ఞానం ఉంటే 2019లో ఎలా ఓడిపోయారు? ఆయన రాజకీయాల్లోకి వచ్చాకే ఈ రోత- చంద్రబాబుపై పోసాని ఫైర్

ఎవరు గెలవాలో, ఎవరు గెలవకూడదో? ప్రజలు చెప్పాలి. ఎవరు గెలిస్తే మనం బాగుంటామో అనేది ప్రజలు చెబుతారు..

Posani Krishna Murali : టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు ఏపీ ఎఫ్ డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి. 10టీవీ ఓపెన్ డిబేట్ లో ఆయన చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికల్లో జగన్ ఓడిపోతారని, కూటమి గెలిచి అధికారంలోకి వస్తుందని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై పోసాని ఘాటుగా స్పందించారు. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో అని చెప్పేటంత కాలజ్ఞానం చంద్రబాబుకి ఉంటే.. మరి 2019లో ఎలా ఓడిపోయారు? అని చంద్రబాబును ప్రశ్నించారు పోసాని.

”ఎవరికి ఓటు వేయాలి? అనేది ప్రజలు ఇంకా నిర్ణయించుకోక ముందే.. వాళ్లు ఓటు వేయక ముందే.. జగన్ ఓడిపోతాడు, నేను గెలుస్తా అని చంద్రబాబు ఎలా చెప్తారు. అంత కాలజ్ఞానం నీకుంటే 2019లో ఎలా ఓడిపోయావ్ బాబూ? ప్రజలు ఎవరికి ఓటు వేస్తున్నారు? అనేది చూసేందుకు బాబు దగ్గర ఏమైనా మిషన్ ఉందా? ఎవరు గెలవాలో, ఎవరు గెలవకూడదో? ప్రజలు చెప్పాలి. ఎవరు గెలిస్తే మనం బాగుంటామో అనేది ప్రజలు చెబుతారు” అని పోసాని అన్నారు.

”చంద్రబాబు రాజకీయాల్లోకి రాకముందు.. చాలా బాగుండేది. విమర్శలు హద్దుల్లో ఉండేవి. ఎప్పుడైతే చంద్రబాబు అనే వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చాడో, రాజకీయాలను రోత పట్టించాడు. మానసిక రోగాలన్నీ వచ్చాయి. రాగానే ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతిని తిట్టించడం, చిరంజీవి ఇంట్లో ఆడవాళ్లను తిట్టించడం చేశారు. రాజకీయాల్లో రాజకీయంగా ఫైట్ చేయాలి” అని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు పోసాని.

”నన్ను గిల్లనంత వరకే నేను పోసాని. నన్ను గిల్లితే 100 రకాలుగా ఉంటా. నేను ఎవరినీ అనను. 38ఏళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నా. 38ఏళ్లు ఖాళీ లేకుండా చేశాను. మరి, నేను వెధవని అయితే, నన్ను పక్కన పెట్టేవారు కదా. వాళ్లు చెప్పింది చేస్తా, డబ్బు తీసుకుంటా. ఎక్స్ ట్రా ఏమీ చెయ్యను. ఇంతమందితో సవ్యంగా ఉన్న పోసాని.. చిరంజీవి, పవన్ కల్యాణ్ ని ఎందుకు పొగొట్టుకుంటాడు?” అని పోసాని అన్నారు.

Also Read : తప్పు చేస్తే.. జగన్‌ అయినా ప్రశ్నిస్తా- పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు

 

ట్రెండింగ్ వార్తలు