Gorantla Butchaih Chowdary : టీడీపీ కంచుకోటలో ఫలిస్తున్న వైసీపీ వ్యూహం..! ఎమ్మెల్యేకి ఎదురుతిరుగుతున్న జనం

ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న బుచ్చయ్యచౌదరిని మరింత ఇరుకున పెట్టేలా ప్రచార పర్వంలో అన్నివర్గాలను కలుపుకొనిపోతున్న మంత్రి వేణు.. బీసీ ఓటర్లే టార్గెట్‌గా దూసుకుపోతున్నారు.

Gorantla Butchaih Chowdary : టీడీపీ కంచుకోట రాజమండ్రి. ముఖ్యంగా ఆ పార్టీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి తిరుగులేదని భావిస్తోన్న రూరల్‌ నియోజకవర్గంలో పరిస్థితులు తారుమారు అవుతున్నాయి. గత రెండు ఎన్నికల్లో విజయబావుటా ఎగరేసిన బుచ్చయ్య చౌదరికి ప్రస్తుత ఎన్నికల సమయంలో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ బుచ్చయ్యకి బ్రేక్‌ వేయాలని భావించిన వైసీపీ వ్యూహాలు ఫలిస్తున్నట్లే కనిపిస్తోంది. టీడీపీ తిరోగమనానికి.. వైసీపీలో కొత్త ఉత్సహానికి కారణమేంటి? రాజమండ్రి రూరల్‌ పోరు ఎలా ఉంది?

బుచ్చయ్యచౌదరి జోరుకు బ్రేకులు..
టీడీపీ సీనియర్‌ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి సొంత నియోజకవర్గంలో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వరుసగా రెండుసార్లు రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గం నుంచి గెలిచిన బుచ్చయ్యచౌదరి జోరుకు ఆయన ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ బ్రేకులు వేస్తున్నారు. గత ఎన్నికల్లో రామచంద్రపురం ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న వేణును రాజమండ్రి రూరల్‌ నుంచి బరిలోకి దింపాలన్న వైసీపీ వ్యూహం ఫలిస్తున్నట్లే కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు.

టీడీపీ ప్రచారంలో ఓటర్ల తిరుగుబాటు..
4 నెలల క్రితం రాజమండ్రి రూరల్‌ బాధ్యతలు తీసుకున్న మంత్రి వేణు నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉంటూ దూసుకుపోతుండటంతో ఓటర్ల నుంచి ఆదరణ లభిస్తోంది. ఇదే సమయంలో పదేళ్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బుచ్చయ్యచౌదరి తమకు అందుబాటులో ఉండటం లేదని, ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఓటర్లు ఎదురుతిరుగుతున్నారు. బుచ్చయ్యచౌదరి ప్రచారంలో ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.

ఒకేరోజు వైసీపీలోకి 500 కుటుంబాలు..
రాజమండ్రి నియోజకవర్గ ఇన్‌చార్జిగా వేణు వచ్చిన నాటి నుంచి పరిస్థితులు అన్నీ మారిపోయాయి. అప్పటివరకు టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్న వారు సైతం వేణు నాయకత్వానికి జైకొడుతున్నారు. టీడీపీకి పట్టున్న ధవళేశ్వరంలో సుమారు 500 కుటుంబాలు ఒకేరోజు వైసీపీలో చేరడం వేణు నాయకత్వం వల్లనే అని చెబుతున్నారు. నియోజకవర్గంలో తన దృష్టికి వచ్చిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తూ వేణు తన పట్ల సానుకూలత పెంచుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అన్నివర్గాలను కలుపుకుంటూ రూరల్‌లో పైచేయి సాధించేలా పావులు..
మరోవైపు రూరల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించిన జనసేన నేత కందుల దుర్గేశ్‌కు మొండిచేయి చూపడం.. ఆయనను నిడదవోలు నియోజకవర్గానికి మార్చడం కూడా వైసీపీకి సానుకూలంగా మారిందనేది లోకల్‌ టాక్‌. మరోవైపు కాపు నేత జక్కంపూడి రామ్మోహనరావు ప్రధాన అనుచరుడిగా రాజకీయాల్లోకి వచ్చిన మంత్రి వేణుకు.. కాపుల్లోనూ సానుకూలత ఉంది.. దీంతో అన్నివర్గాలను కలుపుకుంటూ రూరల్‌లో పైచేయి సాధించేలా పావులు కదుపుతున్నారు మంత్రి వేణు.

కాపులు, బీసీల మద్దతుతో వైసీపీ జోరు..
ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న బుచ్చయ్యచౌదరిని మరింత ఇరుకున పెట్టేలా ప్రచార పర్వంలో అన్నివర్గాలను కలుపుకొనిపోతున్న మంత్రి వేణు బీసీ ఓటర్లే టార్గెట్‌గా దూసుకుపోతున్నారు. బీసీల్లోని శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన మంత్రి వేణు.. తన సామాజిక వర్గంతోపాటు ఇతర బీసీ వర్గాలను మచ్చిక చేసుకుంటూ ప్రచారంలో దూసుకుపోతుండటంతో వైసీపీకి అవకాశాలు మెరుగయ్యాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Also Read : ఏపీ ఎన్నికల్లో లేడీస్ స్పెషల్.. ఆ 5 నియోజకవర్గాల్లో మహిళల మధ్య రసవత్తర పోరు

ట్రెండింగ్ వార్తలు