India కరోనా మృతుల వివరాలు దాచిపెడుతుంది: Donald Trump

అమెరికా ప్రెసిడెంట్ Donald Trump.. రాబోయే ఎన్నికల్లో పోటీదారుడైన డెమోక్రటిక్ అభ్యర్థి జో బిడెన్ మధ్య చర్చలు వాడివేడీగా జరుగుతున్నాయి. ఆరోగ్యం, న్యాయం, జాతి వివక్ష, ఆర్థిక వ్యవస్థ లాంటి రకరకాల అంశాలపై ప్రత్యర్థులు చర్చిస్తున్నారు. పరస్పరం మాటల యుద్ధం జరిగింది. కొవిడ్-19 మహమ్మారి గురించి అడిగిన ప్రశ్నకు ‘జో బిడెన్ తన స్థానంలో ఉంటే అమెరికాలో ఇంకా ఎక్కువ మరణాలు సంభవించేవని’ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. సమాధానంగా ‘మహమ్మారితో పోరాడేందుకు ట్రంప్ దగ్గర ఎలాంటి ప్లాన్ లేద’ని జో బిడెన్ అన్నారు.

అమెరికాలో 70 లక్షలకు పైగా కరోనా కేసులు ఉన్నాయి. ఈ వ్యాధితో ఇప్పటివరకూ దాదాపు 2 లక్షల మంది చనిపోయారు. కరోనావైరస్ మహమ్మారిని ఎదుర్కోవడంలో ట్రంప్ ప్రభుత్వం విఫలమైందని బైడెన్ విమర్శించారు. సమాధానంగా కరోనాను నియంత్రించడానికి తమ ప్రభుత్వం మెరుగ్గా పనిచేసిందని ట్రంప్ అన్నారు.



‘కరోనావైరస్‌ను ఎదుర్కోడానికి మాస్క్, పీపీఈ కిట్, మందులు తీసుకొచ్చింది. కరోనా వ్యాక్సిన్ కొద్ది వారాల్లోనే రెడీ చేస్తాం. కంపెనీలతో మాట్లాడాను. త్వరలోనే వ్యాక్సిన్ తయారు చేయగలమనే నమ్మకం నాకుంది’ అని ట్రంప్ అన్నారు.

కరోనా మరణాల గురించి మాట్లాడుతూ ‘భారత్, రష్యా, చైనా కరోనావైరస్ వల్ల సంభవించిన మరణాల సంఖ్యను దాస్తున్నాయని..’ ట్రంప్ ఆరోపించారు.

డొనాల్డ్ ట్రంప్, జో బిడెన్ మధ్య ఈ డిబేట్‌కు అమెరికా న్యూస్ చానల్ ఫాక్స్ న్యూస్ యాంకర్ 72 ఏళ్ల క్రిస్ వాలెస్ హోస్ట్‌ గా వ్యవహరించారు. అధ్యక్ష ఎన్నికల డిబేట్ నిర్వహించడం క్రిస్ వాలెస్‌కు ఇది తొలిసారేం కాదు. ఇంతకుముందు 2016లో కూడా ఆయన ఇటువంటి డిబేట్‌కు హోస్టింగ్ చేశారు. అధ్యక్ష ఎన్నికల డిబేట్ హోస్ట్ చేసిన ఫాక్స్ న్యూస్ మొదటి జర్నలిస్ట్ వాలెస్.