Corona Second Wave: దయనీయం.. ఢిల్లీలో మృతదేహాల దహనానికి కట్టెల కొరత!

గత ఏడాది తొలి విడతలో కరోనా మహమ్మారి దెబ్బకు హడలెత్తిపోయిన ఢిల్లీ ఈసారి సెకండ్ వేవ్ లో కూడా దారుణాతి దారుణమైన పరిస్థితులను చవిచూస్తోంది. పేరుకే దేశరాజధాని అయిన ఢిల్లీ ఇప్పుడు ప్రాణాలను అరచేతిన పెట్టుకొని వణికిపోతోంది. ఒకవైపు పెరిగిపోతున్న పాజిటివ్ కేసులు.. ఆసుపత్రులలో బెడ్లు, ఆక్సిజన్, మందుల కొరతతో ప్రభుత్వాలకు దిక్కుతోచని స్థితి

Corona Second Wave: గత ఏడాది తొలి విడతలో కరోనా మహమ్మారి దెబ్బకు హడలెత్తిపోయిన ఢిల్లీ ఈసారి సెకండ్ వేవ్ లో కూడా దారుణాతి దారుణమైన పరిస్థితులను చవిచూస్తోంది. పేరుకే దేశరాజధాని అయిన ఢిల్లీ ఇప్పుడు ప్రాణాలను అరచేతిన పెట్టుకొని వణికిపోతోంది. ఒకవైపు పెరిగిపోతున్న పాజిటివ్ కేసులు.. ఆసుపత్రులలో బెడ్లు, ఆక్సిజన్, మందుల కొరతతో ప్రభుత్వాలకు దిక్కుతోచని స్థితి. ఆసుపత్రులలో గుట్టలుగా పేరుకుపోతున్న శవాల దహనానికి శ్మశానాల వద్ద క్యూలో పెట్టిన పాడి వెక్కిరిస్తుంటే.. ఇప్పుడు శవాల దహనానికి కావాల్సిన కలప కూడా దొరకడం లేదంటే ఎంతటి దయనీయ స్థితి ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఢిల్లీలో వందల సంఖ్యలో లెక్కకు మించిన భౌతికకాయాలు మరుభూములకు వరుస కడుతుండడంతో కాటికాపరులు సైతం చేతులెత్తేస్తున్నారు. ఇప్పటివరకు శ్మశానాల్లో చితి పేర్చడానికి స్థలం దొరక్క ఇబ్బందులు పడుతుంటే.. ఇప్పుడు దేహాలను కాల్చడానికి కట్టెలు సైతం దొరకని దుర్భరమైన పరిస్థితి నెలకొంది. ఢిల్లీలో అతిపెద్ద నిగంబోధ్‌ ఘాట్‌ శ్మశానవాటికలో ఏప్రిల్‌ 1-23 తేదీల మధ్య 2,526 మందిని దహనం చేసినట్లు అధికార లెక్కలు చెబుతుండగా.. ఇందుకోసం 8,000 క్వింటాళ్లకుపైగా కలపను ఉపయోగించారు. ఈ కలప అంతా ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి దిగుమతి అయ్యేది.

కాగా, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో కూడా మరణాల సంఖ్య పెరగడంతో ఆ రాష్ట్ర అధికారులు కలప ఎగుమతికి ఆర్డర్లు తీసుకోవడం లేదు. దాంతో ఢిల్లీ అధికారులు హరియాణా అటవీశాఖను సంప్రదించి క్వింటాల్‌కు రూ.450 లెక్కన 7వేల క్వింటాళ్ల కలపను ఆర్డర్ చేశారు. అంతకుమించి కావాలంటే క్వింటాల్‌కు రూ.750 చెల్లించాల్సిందేనని హరియాణా అధికారులు తెగేసి చెప్తున్నారు. కాగా.. ఆర్డర్ చేసిన కలప ఢిల్లీకి వచ్చేలోగా ఇప్పుడు అక్కడ ప్రస్తుతానికి కలప కొరత ఏర్పడింది. దీంతో భౌతిక కాయల కుటుంబసభ్యులే బ్లాక్ లో కట్టెలు కొని చితి పేర్చుకోవాల్సి వస్తుంది.

ఒకవైపు స్మశానంలో స్థలం దొరకక.. దహనానికి కట్టెలు దొరకక.. భౌతికకాయల కుటుంబ సభ్యులే స్వయంగా స్థలాన్ని వెతుక్కొని కట్టెలు పేర్చి దహన సంస్కారాలను పూర్తి చేసుకుంటున్నారు. ఇక, మరో రెండు వారాలు ఇదే పరిస్థితి కొనసాగితే.. కలప బ్లాక్ మార్కెట్ కూడా తీవ్రంగా రెచ్చిపోతుందని ఢిల్లీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కలప కొరతను ఎదుర్కోవడానికి ఆవు పిడకలను ఉపయోగించాలని తూర్పు ఢిల్లీ నగరపాలక సంస్థ ఉత్తర్వులు జారీచేసింది.

ట్రెండింగ్ వార్తలు