ఎమ్మెల్యే చేరికను జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించడం వెనుక పెద్ద స్కెచ్ ఉందా?

తన పొలిటికల్‌ డ్రామాలో జీవన్‌రెడ్డి తొలి విజయం సాధించనట్లేనని టాక్‌ వినిపిస్తోంది. ఐతే అంతిమ విజయం అధిష్టానందా...? జీవన్‌రెడ్డిదా? అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Mlc Jeevan Reddy : కాంగ్రెస్‌ అంటేనే డిఫరెంట్‌ పాలిటిక్స్‌…. కాంగ్రెస్‌లో రాజకీయం చేయడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. గ్రూపులు, విభేదాలు చాలా కామన్‌ అయిన ది గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీలో చాలాకాలం నుంచి మార్పు వచ్చింది. ఆ మార్పు ఫలితమే అధికారం. కానీ, తాజాగా రాజకీయాలు గమనిస్తే… కాంగ్రెస్‌లో పాత వాసనలు పోలేదా? అనే డౌట్‌ వస్తోంది. ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తుందటే.. గత రెండు రోజులుగా హాట్‌ హాట్‌గా కనిపించిన జగిత్యాల ఎపిసోడే…. సిట్టింగ్‌ ఎమ్మెల్యే చేరికతో రివర్స్‌ అయిన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి టీపీసీసీలో హాట్‌ డిబేట్‌కు తెరలేపారు. అసలు జీవన్‌రెడ్డికి అంత కోపం ఎందుకొచ్చింది? అనేది తెలుసుకోవాలంటే… ఆ సీనియర్‌ నేత పొలిటికల్‌ జర్నీపై ఓ లుక్కేయాల్సిందే…

తొలిసారే ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి..
తాటిపర్తి జీవన్ రెడ్డి అలియాస్ టి.జీవన్ రెడ్డి కాంగ్రెస్‌లో సీనియర్ నేత. పైకి సౌమ్యుడిలా కనిపించే జీవన్ రెడ్డి.. రాజకీయాల్లో ఏ మాత్రం రాజీపడరు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక ఎత్తు పల్లాలు అనుభవించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల శాసనసభ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన జీవన్‌రెడ్డి… ఉమ్మడి రాష్ట్రంలో మూడుసార్లు మంత్రిగా పనిచేశారు. 1983లో టీడీపీలో చేరి పొలిటికల్ కెరీర్ స్టార్ట్ చేసిన జీవన్‌రెడ్డి ఎమ్మెల్యేగా తొలిసారి శాసనసభలో అడుగుపెట్టిన మొదటిసారే ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌పై నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు చేసినప్పుడు.. నాదెండ్ల వైపు నిలిచిన జీవన్‌రెడ్డి…. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. 1985లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడినా, 1989లో మళ్లీ గెలిచి శాసనసభలో అడుగుపెట్టారు.

వైఎస్ఆర్ కు వ్యతిరేకంగా ఉండేవారు..
ఆ తర్వాత 1994లో నాలుగోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన జీవన్‌రెడ్డి 1996 ఉప ఎన్నికలో గెలిచారు. ఆ తర్వాత వరుసగా 1999, 2004లో గెలిచి హ్యాట్రిక్ సాధించారు. కాంగ్రెస్‌లో సహజంగా ఉండే గ్రూప్ పాలిటిక్స్‌లో భాగంగా మొదట్లో వైఎస్సార్‌కు వ్యతిరేకంగా ఉండేవారు జీవన్‌రెడ్డి. సీనియర్‌ నేత డి.శ్రీనివాస్ టీమ్‌లో కీలకంగా వ్యవహరిస్తూ దివంగత నేత, మాజీ సీఎం రాజశేఖర్‌రెడ్డి హవాకు బ్రేక్‌ వేసే వారు. ఈ కారణంగానే 2004లో పార్టీ అధికారంలోకి వచ్చినా వైఎస్ క్యాబినెట్‌లో స్థానం దక్కించుకోలేకపోయారు.

అయితే అదే సమయంలో తెలంగాణ ఉద్యమంతో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేయడం… జీవన్‌రెడ్డిని వైఎస్‌కు దగ్గర చేసింది. ఉద్యమ సమయంలో రెండుసార్లు జరిగిన కరీంనగర్‌ పార్లమెంట్‌ ఉప ఎన్నికల్లో కేసీఆర్‌కు ప్రత్యర్థిగా పోటీ చేసి.. పార్టీలో పట్టు పెంచుకున్నారు జీవన్‌రెడ్డి. అలా వైఎస్ టీమ్‌లోనూ ఓ సభ్యుడిగా మారారు. ఈ క్రమంలోనే వైఎస్‌ మంత్రి వర్గంలో ఆర్‌అండ్‌బీ మినిస్టర్‌ అయ్యారు జీవన్‌రెడ్డి.

2023లో కూడా అదే అస్త్రం ప్రయోగం..
ఇలా తన మార్కు రాజకీయంతో పార్టీలో పట్టుతోపాటు పదవులు తెచ్చుకున్న జీవన్‌రెడ్డి… ఓటర్లు వద్ద అదే పాలిటిక్స్‌ ప్లే చేస్తుంటారు. గత రెండు మూడు ఎన్నికల నుంచి ఇవే చివరి ఎన్నికలంటూ పోటీకి దిగడం, ఆ ఎన్నికల్లో ఫలితాలు చేదుగా వచ్చాయని మరో ఎన్నికకు రెడీ అవడం జీవన్‌రెడ్డి ప్రత్యేకతగా మారింది. 2018లో చివరి ఎన్నికలు అంటూ పోటీచేసిన జీవన్‌రెడ్డి… 2023లో కూడా అదే అస్త్రం ప్రయోగించారు. రెండు ఎన్నికల్లోనూ ఓడినా, తాజాగా జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ సీటు సంపాదించారు. ఈ ఎన్నికల్లో ఓడిన తర్వాత ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటానని ప్రకటించిన జీవన్‌రెడ్డి… గతంలో ఎప్పుడూ లేనంత వాడివేడి రాజకీయం గత రెండు మూడు రోజులుగా పండిస్తున్నారు.

ఎమ్మెల్యే చేరికను వ్యతిరేకించడం వెనుక పెద్ద స్కెచ్?
జగిత్యాల సిట్టింగ్‌ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ కాంగ్రెస్‌లో చేరడాన్ని సాకుగా చూపి.. పార్టీలో తుఫాన్‌ సృష్టించారు. సీనియర్‌ నేతలంతా తన వద్ద క్యూ కట్టేలా చేసుకున్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని హూంకరించడంతో పాటు కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తానని ప్రకటించడం జీవన్‌రెడ్డి మార్కు రాజకీయంగా చెబుతున్నారు కాంగ్రెస్‌ నేతలు. వరుసగా ఓడినా కాంగ్రెస్‌లో తన ఉనికి చాటుకుంటున్న జీవన్‌రెడ్డి… ప్రత్యక్ష రాజకీయాలకు దూరమంటూనే తన నియోజకవర్గ పరిణామాలను వదలకపోవడం… ఎమ్మెల్యే చేరికను వ్యతిరేకిస్తుండటం వెనుక చాలా పెద్ద స్కెచ్చే ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో బెర్త్‌ కోసమే ఈ హైడ్రామా నడిపిస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రెండు రోజులుగా జీవన్‌రెడ్డి సీరియస్‌ యాక్షన్‌ ఎపిసోడ్‌ సక్సెస్‌ కావడంతో కాంగ్రెస్‌ హైకమాండ్‌ కూడా దిగి వచ్చింది. అంటే తన పొలిటికల్‌ డ్రామాలో జీవన్‌రెడ్డి తొలి విజయం సాధించనట్లేనని టాక్‌ వినిపిస్తోంది. ఐతే అంతిమ విజయం అధిష్టానందా…? జీవన్‌రెడ్డిదా? అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Also Read : కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య బూడిద యుద్ధం.. అసలేంటీ వివాదం? ఎందుకింత దుమారం?

ట్రెండింగ్ వార్తలు