2024 Tollywood Movies : ‘హనుమాన్’ నుంచి ‘కల్కి’ వరకు.. 2024 టాలీవుడ్ ఫస్ట్ హాఫ్ రిపోర్ట్.. ఏవి హిట్టు? ఏవి ఫట్టు?

మొత్తం ఈ ఆరు నెలల్లో ఎన్ని సినిమాలు ప్రేక్షకులని మెప్పించి హిట్ కొట్టాయి, ఎన్ని కలెక్షన్స్ సాధించాయి అని నెల వారిగా చూద్దాం..

2024 First Half Tollywood Movies : 2024 మొదలయి అప్పుడే ఆరు నెలలు అయిపొయింది. ఈ ఆరు నెలల్లో బాగానే సినిమాలు వచ్చాయి. ప్రతి సమ్మర్ పెద్ద సినిమాలతో బిజీగా ఉండే సినీ పరిశ్రమ థియేటర్లు, ఈ సారి ఎన్నికలు, ఐపీఎల్ తో ఖాళీగానే ఉంది. మొత్తం ఈ ఆరు నెలల్లో ఎన్ని సినిమాలు ప్రేక్షకులని మెప్పించి హిట్ కొట్టాయి, ఎన్ని కలెక్షన్స్ సాధించాయి అని నెల వారిగా చూద్దాం..

జనవరిలో నూతన సంవత్సరం జనవరి 1 సింగర్ సునీత కొడుకు ఆకాష్ హీరోగా పరిచయమవుతూ వచ్చిన సినిమా సర్కారు నౌకరి. ఇది ఎమోషనల్ గా ప్రేక్షకులని మెప్పించిన కమర్షియల్ గా వర్కౌట్ అవ్వలేదు. దీంతో పాటు మరో మూడు చిన్న సినిమాలు కూడా రిలీజ్ అయ్యి పరాజయం పాలయ్యాయి. జనవరి 5న ఏకంగా 5 చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో చెప్పుకోడానికి ఒక్క సినిమా కూడా ఆడకుండా రిలీజ్ అయి వెళ్లిపోయాయి. ఇక సంక్రాంతి రేసులో జనవరి 12న మహేష్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జ హనుమాన్ సినిమాలు రిలీజ్ అయి రెండు భారీ హిట్స్ కొట్టాయి. గుంటూరు కారం సినిమా 200 కోట్లు కలెక్ట్ చేస్తే హనుమాన్ ఎవ్వరూ ఊహించని పెద్ద హిట్ అయి 300 కోట్లు కలెక్ట్ చేసి 50 రోజుల లాంగ్ రన్ నడిచింది. జనవరి 13న వెంకటేష్ సైంధవ్ సినిమా రిలీజయింది. ఈ సినిమా నిరాశపరిచింది. జనవరి 14న నాగార్జున నా సామిరంగ రిలీజయి డీసెంట్ హిట్ కొట్టి బ్రేక్ ఈవెన్ అయింది. జనవరి 26న హన్సిక 105 మినిట్స్ సినిమాతో పాటు మరో 5 చిన్న సినిమాలు రిలీజయ్యాయి. ఇవేవి థియేటర్స్ వద్ద నిలబడలేదు.

Also Read : Kalki Part 2 Update : కల్కి పార్ట్ 2 ఆల్రెడీ 60 శాతం షూటింగ్ అయిపొయింది.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నిర్మాత..

ఇక ఫిబ్రవరిలో ఫిబ్రవరి 2న సుహాస్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ బూట్ కట్ బాలరాజు సినిమాలతో పాటు 7 చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిల్లో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ డీసెంట్ హిట్ నిలవగా మిగిలిన సినిమాలన్నీ అడ్రెస్ లేకుండా పోయాయి. ఫిబ్రవరి 8న వైఎస్ జగన్ బయోపిక్ గా తెరెకెక్కిన యాత్ర 2 సినిమా రిలీజయింది కానీ ఈ సినిమా ప్రేక్షకులని మెప్పించలేకపోయింది. ఫిబ్రవరి 9న రవితేజ ఈగల్ సినిమా రిలీజవ్వగా యావరేజ్ గా నిలిచింది. ఫిబ్రవరి 15 అమరావతి రైతుల మీద తీసిన రాజధాని ఫైల్స్ రిలీజయింది. ఫిబ్రవరి 16న సుందీప్ కిషన్ ఊరుపేరు భైరవకోన సినిమాతో వచ్చి చాలా రోజుల తర్వాత మంచి హిట్ కొట్టాడు. అదే రోజు మరో చిన్న సినిమా రిలీజయింది. ఫిబ్రవరి 23న సుందరం మాస్టర్, మస్త్ షేడ్స్ ఉన్నాయి రాతో పాటు మరో 5 చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. కమెడియన్ వైవా హర్ష హీరోగా మారి తెరకెక్కించిన సుందరం మాస్టర్ యావరేజ్ గా నిలిచింది. కమెడియన్ అభినవ్ గోమటం హీరోగా మారి తెరకెక్కిన మస్త్ షేడ్స్ ఉన్నాయి రాతో పాటలు మిగిలిన చిన్న సినిమాలు కూడా ఫ్లాప్ దారి పట్టాయి.

మార్చ్ 1న భూతద్దం భాస్కర్ నారాయణ, చారి 111, ఆపరేషన్ వాలెంటైన్, వ్యూహంతో పాటు 4 చిన్న సినిమాలు రిలీజయ్యాయి. శివ కందుకూరి హీరోగా తెరకెక్కిన భూతద్దం భాస్కర్ నారాయణ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా యావరేజ్ గా నిలిచింది. వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్, వెన్నెల కిషోర్ చారి 111, ఆర్జీవీ వ్యూహంతో పాటు మిగిలిన సినిమాలు అన్ని పరాజయం పాలయ్యాయి. మార్చ్ 8 గామి, భీమలతో పాటు 4 చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. విశ్వక్ సేన్, చాందిని చౌదరి ముఖ్య పాత్రల్లో ప్రయోగాత్మకంగా తీసిన గామి సినిమా మంచి హిట్ అయింది. గోపీచంద్ భీమతో పాటు మిగిలిన సినిమాలు కూడా నిరాశ పరిచాయి. మార్చ్ 15న రజాకార్, లంబసింగి, షరతులు వర్తిస్తాయి, వెయ్ దరువేయ్, తంత్రలతో పాటు మరో 3 చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. భారతదేశంలో నైజాం విలీనంపై తీసిన రజాకార్ అందర్నీ మెప్పించి యావరేజ్ గా నిలిచింది. ఇక మిగిలిన సినిమాలన్నీ నిరాశ పరిచాయి. మార్చ్ 22 ఓం భీం బుష్, లైన్ మ్యాన్ తో పాటు మరో 3 చిన్న సినిమాలు రిలీజవ్వగా శ్రీ విష్ణు ఓం భీమ్ బుష్ హిట్ అవ్వగా మిగిలిన సినిమాలు ఫ్లాప్ బాట పట్టాయి. మార్చ్ 29న సిద్ధూ జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ సినిమా రిలీజయి 100 కోట్లు కలెక్ట్ చేసి భారీ హిట్ కొట్టింది. అదే రోజు 3 చిన్న సినిమాలు రిలీజయి అడ్రెస్ లేకుండా పోయాయి.

Also Read : Rajinikanth : కల్కిపై రజినీకాంత్ రివ్యూ.. పార్ట్ 2 కోసం ఎదురుచూస్తున్నాను అంటూ..

ఇక ఏప్రిల్ 5న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజయి యావరేజ్ గా నిలిచింది. అదే రోజు మరో 2 చిన్న సినిమాలు రిలీజయినా ఫ్లాప్ అయ్యాయి. ఏప్రిల్ 11న అంజలి గీతాంజలి సినిమాకు సీక్వెల్ గా గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా రిలీజయి యావరేజ్ గా నిలిచింది. సుహాస్ శ్రీరంగ నీతులు సినిమా నిరాశ పరిచింది. ఏప్రిల్ 12న 2 చిన్న సినిమాలు రిలీజయినా ఎవ్వరికి తెలియకుండానే వెళ్లిపోయాయి. ఏప్రిల్ 18న సత్యం రాజేష్ ముఖ్య పాత్రలో చేసిన టెనెంట్ రిలీజయి నిరాశ పరిచింది. ఏప్రిల్ 19 మార్కెట్ మహాలక్ష్మి, పారిజాతాపర్వం, మరో 2 చిన్న సినిమాలు, ఏప్రిల్ 26 రెండు చిన్న సినిమాలు రిలీజయి ఇవన్నీ అడ్రెస్ లేకుండా పోయాయి.

మే 3న ఆ ఒక్కటి అడక్కు, బాక్, ప్రసన్న వదనం, శబరి, మరో చిన్న సినిమా రిలీజవ్వగా అన్ని కమర్షియల్ గా ఫ్లాప్స్ గా మిగిలాయి. డబ్బింగ్ సినిమా బాక్ మాత్రం సినిమా బాగున్నా తెలుగులో ఫ్లాప్ అయి తమిళ్ లో హిట్ అయింది. సుహాస్ ప్రసన్న వదనం సినిమా కూడా బాగున్నా కమర్షియల్ ఫ్లాప్ అయింది. మే 10 సత్యేదేవ్ కృష్ణమ్మ, నారా రోహిత్ ప్రతినిధి 2, మరో 3 చిన్న సినిమాలు రిలీజయి అన్ని నిరాశ పరిచాయి. మే 17న అసలు ఎవరికీ తెలియని ఓ 3 చిన్న సినిమాలు రిలీజయి అటు నుంచి ఆటే వెళ్లిపోయాయి. మే 24 గెటప్ శ్రీను హీరోగా చేసిన రాజు యాదవ్ సినిమాతో పాటు మరో 5 చిన్న సినిమాలు రిలీజయి అన్ని పరాజయం పాలయ్యాయి. మే 25న ఆశిష్, వైష్ణవి చైతన్య నటించిన లవ్ మీ ఇఫ్ యు డేర్ సినిమా యావరేజ్ గా నిలిచింది. మే 31న రిలీజయిన కార్తికేయ భజే వాయు వేగం, ఆనంద్ దేవరకొండ గం గం గణేశా, విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలు యావరేజ్ గా నిలిచాయి. ఇలా ఏప్రిల్, మే సమ్మర్ అంతా ఒక్క పెద్ద హిట్ కూడా లేకుండానే గడిచిపోయింది.

Also Read : Kamal Haasan : శ్రీ శ్రీ మహా ప్రస్థానం.. కమల్ హాసన్ ఆకలి రాజ్యం.. కల్కి సినిమా.. 44 ఏళ్ళ తర్వాత.. లింక్ ఏంటి?

ఇక జూన్ 7న నవదీప్ లవ్ మౌళి, శర్వానంద్ మనమే, కాజల్ అగర్వాల్ సత్యభామ సినిమాలు రిలీజయి యావరేజ్ గా నిలవగా పాయల్ రాజ్ పుత్ రక్షణ సినిమాతో పాటు మరో 4 చిన్న సినిమాలు రిలీజయి పరాజయం పాలయ్యాయి. జూన్ 14న సుధీర్ బాబు హరోం హర, చాందిని చౌదరి ఏవమ్, మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాలతో పాటు మరో 2 చిన్న సినిమాలు రిలీజయ్యాయి. ఇందులో మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా బాగున్నా కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదు. మిగిలిన సినిమాలన్నీ నిరాశపరిచాయి. జూన్ 21న వరుణ్ సందేశ్ నింద, హెబ్బా పటేల్ హనీమూన్ ఎక్స్ ప్రెస్ తో పాటు మరో 6 చిన్న సినిమాలు రిలీజయి పరాజయం పాలయ్యాయి. జూన్ 22న హెబ్బా పటేల్ సందేహం సినిమా ఫ్లాప్ గానే నిలిచింది. ఇక తాజాగా జూన్ 27న వచ్చిన ప్రభాస్ కల్కి 2898AD సినిమా భారీ హిట్ కొట్టింది. ఇప్పటికే 300 కోట్ల గ్రాస్ వసూలు చేసి దూసుకుపోతుంది.

ఇక డబ్బింగ్ సినిమాల్లో జనవరిలో వచ్చిన ధనుష్ కెప్టెన్ మిల్లర్ పరాజయం పాలైంది. ఫిబ్రవరిలో లవర్, మంజుమ్మెల్ బాయ్స్ సినిమాలు యావరేజ్ గా నిలిచాయి. రజినీకాంత్ లాల్ సలాం సినిమా, భ్రమయుగం సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. మార్చ్ లో రిలీజయిన ప్రేమలు సినిమా పెద్ద హిట్ గా నిలవగా పృథ్విరాజ్ ఆడు జీవితం యావరేజ్ గా నిలిచింది. ఏప్రిల్ లో వచ్చిన డియర్, రత్నం సినిమాలు ఫ్లాప్ అవ్వగా, లవ్ గురు సినిమా యావరేజ్ గా నిలిచింది. మేలో వచ్చిన బాక్ సినిమా యావరేజ్ గా నిలవగా, జూన్ లో వచ్చిన విజయ్ సేతుపతి సినిమా పెద్ద హిట్ గా నిలిచింది.

Also Read : Varalaxmi Sarathkumar : పీఎం మోదీని తన పెళ్ళికి ఆహ్వానించిన వరలక్ష్మి.. థ్యాంక్యూ నాన్న అంటూ..

మొత్తంగా ఫస్ట్ హాఫ్ లో మంచి హిట్ అయి డబ్బులు వచ్చిన సినిమాలు అంటే హనుమాన్, గుంటూరు కారం, నా సామిరంగ, గామి, ప్రేమలు, ఓం భీమ్ బుష్, టిల్లు స్క్వేర్, కల్కి సినిమాలు మాత్రమే. కల్కి ఇప్పుడు రాబడుతుంది. ఇక కొన్ని సినిమాలు మంచి టాక్ వచ్చినా కమర్షియల్ గా ఫెయిల్ అయ్యాయి. ఈ సారి సమ్మర్ మొత్తం ఒక్క హిట్ కూడా లేకుండా పరిశ్రమకు భారీగానే నష్టం మిగిల్చింది. ఇప్పుడు కల్కి సినిమాతో థియేటర్లు మళ్ళీ కళకళలాడాయి. ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో అయినా ఎక్కువ హిట్లు టాలీవుడ్ లో వస్తాయేమో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు