డి. శ్రీనివాస్‌ మరణం పట్ల వైఎస్ జగన్, కేటీఆర్ సంతాపం..

డీఎస్ మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు.

YS Jagan Condolence to DS: మాజీ మంత్రి, తెలంగాణకు చెందిన సీనియర్‌ నాయకుడు, పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్‌ మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. తన తండ్రి దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డితో డి.శ్రీనివాస్‌కు ఉన్న అనుబంధం మరిచిపోలేనిదని గుర్తుచేసుకున్నారు. డీఎస్ మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నానన్నారు. డి.శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

డీఎస్ అజాత శత్రువు: కేటీఆర్
డి. శ్రీనివాస్ రాజకీయాల్లో అజాత శత్రువని, ఆయన చనిపోవటం బాధాకరమైన విషయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం ప్రకటించారు. డీఎస్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

డీఎస్ మరణం బాధాకరం: బండి సంజయ్
మాజీ మంత్రి, పీసీసీ అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ మరణం బాధాకరమని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంతాప ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా, రెండు సార్లు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా డీఎస్ అందించిన సేవలు ఎనలేనివని ప్రశంసించారు. బ్యాంకు ఉద్యోగిగా జీవితాన్ని ఆరంభించిన డీఎస్ రాజకీయాల్లో చేరి అంచెలంచెలుగా ఎదిగి రెండుసార్లు పీసీసీ అధ్యక్షులుగా, మంత్రిగా, రాజ్యసభ సభ్యులుగా సేవలందించారని తెలిపారు. ”తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో డి.శ్రీనివాస్ పాత్ర మరువలేనిది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు హామీని 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపర్చడంతోపాటు, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పార్టీ అధిష్టానాన్ని ఒప్పించడంలో డీఎస్ చేసిన కృషి మరువలేనిది. బడుగు, బలహీనవర్గాల సంక్షేమం కోసం డి.శ్రీనివాస్ నిరంతరం పాటుపడేవారు. ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోటు. డీఎస్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం చేకూర్చాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాన”ని తెలిపారు.

Also Read: రమేష్ రాథోడ్ చనిపోయారంటే నమ్మలేకపోతున్నా.. బండి సంజ‌య్‌

సీపీఐ నేతల సంతాపం
డి. శ్రీనివాస్ మరణం పట్ల సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ, సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు సంతాపం తెలిపారు. డి. శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానభూతి ప్రకటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పనిచేసి అనేక సేవలందించారని కొనియాడారు. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న డీఎస్ తో తమకు విద్యార్థి దశ నుంచే సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయని, లెఫ్ట్ పార్టీలను ఎంతో గౌరవించేవారని నారాయణ వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు