భద్రత కట్టుదిట్టం : కృష్ణా జిల్లాకు కేంద్ర బలగాలు

  • Publish Date - April 9, 2019 / 02:45 PM IST

ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర బలగాలు కృష్ణా జిల్లాకు చేరుకున్నాయి. జిల్లావ్యాప్తంగా 3500 మంది కేంద్ర బలగాలతోపాటు రాష్ట్ర పోలీస్ సిబ్బంది జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే మొహరించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడమే తమ లక్ష్యమని పోలీసులు చెబుతున్నారు. 

పోలింగ్‌ డే సమీపించడంతో సమస్యత్మాక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కేంద్ర బలగాలు కృష్ణా జిల్లాకు చేరుకున్నాయి. ఇప్పటికే జిల్లాలో సమస్యాత్మకంగా ఉన్న ప్రదేశాల్లో కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలోని వెస్ట్, సెంట్రల్‌తోపాటు మైలవరం, జగ్గయ్యపేట వంటి ప్రాంతాల్లో ఇప్పటికే కేంద్ర బలగాలు మొహరించాయి. అంతేకాకుండా మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో మచిలీపట్నం, గన్నవరం, పెనమలూరు, అవనిగడ్డ వంటి  గ్రామీణ ప్రాంతాల్లో కూడా కేంద్రబలగాలు కవాతు నిర్వహించాయి. 

ఓటర్లు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని.. ఎవరైనా ఓటర్లను భయపెట్టిన, ఇబ్బందులకు గురిచేసిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కేంద్ర బలగాల కవాతులో పోలీసులు మైక్‌లో అనౌన్స్‌మెంట్ చేసి మరీ ఓటర్లను చైతన్యం తీసుకొస్తున్నారు. మరోవైపు నగదు, మద్యాన్ని ఓటర్లకు పంచేందుకు పెద్ద ఎత్తున తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో.. వాటిని అరికట్టేందుకు పోలీసుల ప్రధాన రహదారులతోపాటు, కరకట్ట, విజయవాడ, గుడివాడ, మైలవరం, గన్నవరం జాతీయరహదారుల పైన పెద్ద ఎత్తున చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. 

ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ ఎత్తున నగదు, మద్యం పట్టుపడింది. అలాగే రౌడీమూకలపై బైండోవర్ కేసులు పెట్టడంతోపాటు ఎన్నికల సమయంలో అల్లర్లు సృష్టిస్తే…. కఠిన చర్యలు తప్పవంటున్నారు. అంతేకాకుండా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలన్నారు. ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని.. ఎవరైన అల్లర్లు చేస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వాలని సూచించారు.