11వ రోజు రాజధాని ప్రాంతాల్లో రైతుల నిరసన : భారీగా పోలీసుల మోహరింపు

అమరావతి రాజధాని ప్రాంతాల్లో రైతుల నిరసన 11వ రోజు కొనసాగుతోంది. మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతులు ధర్నాలు నిర్వహిస్తున్నారు.

  • Publish Date - December 28, 2019 / 04:55 AM IST

అమరావతి రాజధాని ప్రాంతాల్లో రైతుల నిరసన 11వ రోజు కొనసాగుతోంది. మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతులు ధర్నాలు నిర్వహిస్తున్నారు.

అమరావతి ఆందోళనలతో అట్టుడుకుతోంది. రాజధాని ప్రాంతాల్లో రైతుల నిరసన 11వ రోజు కొనసాగుతోంది. మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతులు ధర్నాలు నిర్వహిస్తున్నారు. రాజధానిని తరలించవద్దని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే రాజధాని ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. మందడంలో మహాధర్నా నిర్వహించాలని రైతులు నిర్ణయించారు. అయితే అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ.. వెలగపూడిలో రైతులు నిరసనకు దిగారు. వెలగపూడిలో రైతులు రిలే నిరాహారదీక్ష చేయనున్నారు. అటు తుళ్లూరులో వంటా వార్పు, మహా ధర్నా చేపట్టనున్నారు. కృష్ణా-గుంటూరు జిల్లాల్లో ఆందోళనలు చేపట్టాలని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు నిర్ణయించారు. రాజధానిని తరలించవద్దని డిమాండ్‌ చేశారు. 

రాజధాని తరలింపు ప్రతిపాదనపై అమరావతి గ్రామాల్లో శనివారం (డిసెంబర్ 27,2019) కొనసాగిన ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానులు ప్రకటనపై భావోద్వేగానికి గురైన మహిళలు కన్నీటిపర్యంతం అయ్యారు. తమ బిడ్డల బంగారు భవిష్యత్‌ను కోరుకుని మూడు పంటలు పండే భూములను ఇస్తే రాజధాని తరలింపు ప్రతిపాదన తమను తీవ్ర మానసిక క్షోభకు గురిచేసిందని ఆవేదన వెలిబుచ్చారు. రాజధాని తరలిపోతోందన్న బెంగతో రాజధాని ప్రాంత మహిళలు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇస్తే ఇప్పుడు తరలిస్తే తమ పరిస్థితి దయనీయంగా మారిపోతుందని కన్నీటిపర్యంతం అయ్యారు. పది రోజుల నుంచి ఆందోళన చేస్తున్నా వైసీపీ సర్కార్‌ అర్థం చేసుకోకుండా మొండిగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 

ఆందోళన చేస్తున్న రైతులను హేళన చేస్తున్న వైసీపీ నేతలపై మందడం మహిళలు మండిపడ్డారు. రాజధానికి భూములిచ్చిన తమ బతుకులను జగన్‌ వీధికి ఈడ్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుళ్లూరులో మహిళలు ధర్నా చేశారు. రాజధాని తరలిస్తే సహించేది లేదని హెచ్చరించారు. తుళ్లూరు, మందడం ప్రాంతాలకు చెందిన యువకులను పోలీసులు అరెస్ట్‌ చేయడంపై మహిళలు మండిపడ్డారు. ఏం తప్పు చేశారని అరెస్ట్ చేశారని నిలదీశారు. రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిసెంబర్ 27న గంట సేపు మౌనదీక్ష చేశారు. రాజధాని తరలిస్తే జగన్ ప్రభుత్వం తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.